ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత
25-09-2019 12:47:13
హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. గతకొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో.. మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది. సమాచారం అందుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి జీవిత రాజశేఖర్‌తో పాటు ఉత్తేజ్, మా కార్యవర్గ సభ్యుడు సురేశ్ కొండేటి, టాలీవుడ్‌కు చెందిన పలువురు కమెడియన్స్‌ హాస్పిటల్‌లో వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించి.. మధ్యాహ్నం 12.21 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు. ఈయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. వేణు మాధవ్ మృతదేహాన్ని మధ్యాహ్నం కాప్రా హెచ్.పి కాలనీలో స్వగృహానికి తీసుకెళ్లనున్నారు. 
 
సూర్యపేట జిల్లా కోదాడలో 1969 డిసెంబర్ 30న జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో వెంకటేశ్ హీరోగా.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మి’ సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.