Expand to right
Expand to left

తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు

రావికంపాడు, పోలకంపాడు మొదలైన గ్రామనామాల్లో కన్పిస్తున్న ‘కమ్మ’కు నది అని అర్థం. గుండ్లకమ్మ మనం ఎరిగినదే. కృష్ణానదికి ‘పేరకమ్మ’ అనేది అచ్చపు తెనుగు పేరు. ఈ రెండు కమ్మలకు మధ్య వున్న నాడు ‘కమ్మనాడు’. ‘కమ్మగుట్టు గడప దాటదు’ అనే సామెతను కమ్మవారి కుటుంబాలలోని గుట్టు గడప దాటి బయటకు రాదనే అర్థంలో వివరించడం పరిపాటి. నిజానికిది సరికాదు. కమ్మనాటి గుట్టు కడప దాటిపోదు అని అర్థం. అంటే పాకనాడు దాటినా, రేనాడు దాటిపోదని అర్థం. ‘పెంట’ అంటే పశువులను మంద వేసే స్థలం. ‘తడ’కు సరిహద్దు అని అర్థం. గుర్రాల బయలులోని ‘బయలు’ కర్థం మేతకు వదిలే చోటు అని. పాలెం మొదటి అర్థం, పాలెగాడు వుండే చోటు. అనంతరం కాలంలో శివారు అని అర్థంలో రూఢమైంది.

పల్లె మొదట బౌద్ధుల నివాసం. పాడు జైనులుండే చోటు. వాడ శాఖా నగరానికి పేరు. చెరువు, కుంట, గుంట, కొలను, కుళం, మడుగు, కంభం మొదలైనవి పరిమాణాన్నిబట్టి జలాశయాల్ని సూచించేవి. చీకటి అంధకారం అనే అర్థంలో కాక చెట్టును సూచిస్తుంది. నెమలి, కాకి కూడ పక్షుల పేర్లు కావు. చెట్ల పేర్లే. ప్రోలు, పురానికి వికృతిగా భావించడం కద్దు. కాని ప్రోలు దేశ్యపదం. ప్రభుత్వ ఖజానా వుండే చోటు. దానిమీద అధికారి ప్రోలయ. తరువాత వ్యక్తి నామంగా మారింది. చీరాల, పేరాల, గూటాల, కడియాల మొదలైన వానిలోని ‘ఆల’ గడ్డిజాతికి చెందిన మొక్క. ఆకూ అలము అనడం మన ఎరుకలోనిదే. ‘గడ్డ’ ఏటి ఒడ్డున వున్న ఎత్తైన భూభాగాన్ని సూచిస్తుంది. ‘లంక’ నదీ మధ్యంలోని విశాలమైన భూభాగాన్ని, ‘తిప్ప’ అంతకంటె తక్కువ పరిమాణం గల భూభాగాన్ని సూచిస్తాయి. పిన్నదరి, వైరదరి ఆయా నదుల తీరాల నెలకొని వున్న వైనాన్ని సూచిస్తాయి.

‘వరం’ అనేది ఒకరి అనుగ్రహం వల్ల పొందిన వరం లాంటిది కాదు. వరాని కర్థం ఒక పెద్ద గ్రామంలోని కొంత భూభాగాన్ని విడదీసి ఇచ్చినది. ఆ విడదీయబడిన భూభాగం ‘వరం’. అంతేకాని ఇవ్వడమనే క్రియకు సంబంధించినది కాదు. అయితే గన్నవరం, అడవివరం ఇలాంటివి కావు. నిజానికవి గనివారం, అడివారం. చెరువు క్రింది భూమి గనివారం. క్రిందనున్న (సింహాచలం దేవస్థానానికి) భూమి ఆడివారం. వైవాకలోని ‘వాక’, పాలువాయిలోని ‘వాయి’ చిన్న ప్రవాహాలను సూచిస్తాయి. వినుకొండ, బెల్లంకొండ, నీరుకొండల లోని ‘కొండ’ పర్వతసూచే. కాని మానికొండ, పోలు కొండ, కొండ పాటూరులలోని ‘కొండ’ శిలాసూచి కాదు. కొండంగి అనేది గడ్డి జాతి మొక్క. దీనిని బట్టి ఇచ్చట కొండ అనేది మొక్క అని బోధ పడుతుంది. ఈ ఉదాహరణల వలన, ముందు చెప్పినట్లుగా, మన ప్రాచీనులు పరిసరాలను దృష్టిలో వుంచుకొని తమ ఆవాసాలకు పేర్లు పెట్టారని అవగతమవుతుంది.

ఇక గ్రామనామాల్లోని ప్రథమ భాగాలను పరిశీలిద్దాం. వీటిలో కూడ చాల వైవిధ్యముంది. వ్యక్తినామాలు, కులనామాలు, వృత్తి నామాలు, నైసర్గిక స్థితికి సంబంధించినవి. వృక్షాల పేర్లు, పక్షుల పేర్లు, సంఘటనల పేర్లు — ఇలా మానవ నాగరికత, సంస్కృతి వికాసాలు ముడిపడి వున్న అన్ని అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గ్రామనామాల్లోని వ్యక్తినామాలు ఆ గ్రామాన్ని నిర్మించిన వారి పేర, గ్రామాన్ని దానంగా పుచ్చుకొన్నవారి పేర, ప్రముఖులైన వ్యక్తుల పేర వస్తుంటాయి. కులాలు, వృత్తుల పేర్లు, వారు ముందుగా ఆ చోట నివాసమేర్పరచుకోవడం వల్ల వస్తాయి (ఉదా. మేదర మెట్ల, బోయగూడెం, బ్రాహ్మణతర్ల, రెడ్డిపాలెం, నాయుడుపేట.)

జొన్నపాడు, వరికుంట, నేలమామిడి చెలక, తాడికొండ, నెమలికల్లు, తోటకూరపాడు, రావిరేల, మర్రిబంధం, వేములదిన్నె, తుమ్మల పెంట, మద్దిపట్ల, రేణి గుంట, జమ్ములమడక, అవురుపూడి, కొడవటికల్లు, కలిగిరి, కడవ కుదురు, చింతమోటు, వెదుళ్ళచెరువు, ఈతముక్కల, గొట్టిపాడు, మెంతిదిబ్బ, పెసర్లంక, చాగర్లమూడి, సామర్లకోట, కందిమళ్ళ, బెండపూడి, వెణుతురుమిల్లి మొదలైన గ్రామనామాలలోని పూర్వ పదాలన్నీ వృక్షజాతి సంబంధులు. ఆవులెన్న, గుఱ్ఱాలబయలు, ఎడ్లపాడు, తోడేళ్ళదిబ్బ, చీమలమర్రి, వింజమూరు మొదలైనవి జంతువుల పేర్లను, పక్షుల పేర్లను, గడ్డిపేర్లను సూచిస్తాయి. ‘వింజ’ అనేది ఒక నీటిపక్షి దాని ఈకలతో చేసినది వింజామర. పులిగడ్డ, పులివెందుల, పులిప్రొద్దుటూరులలోని ‘పులి’ జంతువు కాదు. పులి అంటే అనాది బంజరు. బోరుపాలెం, కొండపల్లి, బండమీదపల్లి, లోయ, లాము, నరవ, ఎదురుమొండి, నంగేగడ్డ మొదలైనవి, అవి నెలకొన్న ప్రాంతపు భూస్థితిని వ్యక్తపరుస్తాయి. ‘బోరు’ శబ్దానికర్థం మధ్యలో ఎత్తుగా వుండి, ఇరువైపులకు వాలి వున్న భూస్థితిని సూచిస్తుంది. ‘మొండి’ భూమి ఆగిపోయిన చోటును సూచిస్తుంది. లాము అంటే కొండ అంచునగల ఆవాసం. నంగే శబ్దానికర్థం రేవు. అయినవోలు, అయినంపూడి లలో గల ‘అయిన’ శబ్దానికర్థం నదివంపు తిరిగేచోట అభిముఖంగా వున్న భూభాగం అని అర్థం.

కొన్ని ఊళ్ళ పేర్లు, రెండు మూడు చోట్ల కూడ వుంటాయి. ఇలాంటి సన్నివేశంలో మరికొన్ని విశేషణాలు చేర్చి వాటిని వివక్ష చేసిన వైనం కన్పిస్తుంది. ఇక కొన్ని దిక్కులను సూచించేవి. కాగా మరికొన్ని పరిమాణ, పౌర్వాపర్య సూచకాలు. ఉదా: తూర్పు లంకపల్లి, పడమటి ఆలేరు, ఎగువతడకర, దిగువమిట్ట, సౌత్‌ వల్లూరు, నార్త్‌ వల్లూరు, పెదమద్దాలి, కురుమద్దాలి, పాతకురు మద్దాలి కొత్త పెదమద్దాలి మొదలైనవి. శేరీగొల్వేపల్లి, జమీ గొల్వేపల్లి, శేరికల్వ పూడి, జమీకల్వపూడి, మొఖాసా కల్వపూడి మొదలైనవి రెవిన్యూ పదాలతో చేసిన వివక్ష. పండిత విల్లూరు, దొంగ తిమ్మాపురం, నీళ్లులేని తిమ్మాపురం మొదలైనవి వాటి వాటి ఆధిక్యాన్ని అభావాన్ని సూచించేవి.

సంఘటనలతో వచ్చిన పేర్లు

రణస్థలం – అక్కడ జరిగిన యుద్ధం కారణంగా వచ్చింది. సంక్రాంతిపాడు – ఆ గ్రామాన్ని కట్టించి సంక్రాంతినాడు దానమివ్వడం కారణంగా వచ్చింది. వసంతవాడ – మార్గమధ్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కారణంగా వచ్చింది. పాయకరావు పేట – ఒకానొక సర్దార్‌కు నైజాం నవాబు ఫాయక్‌రావు అనే బిరుదు ఇవ్వడం కారణంగా, అతడు నివాసమున్న చోటుకు ఆ పేరు స్థిరపడిరది. సర్వసిద్ధి – తెలుగు చాళుక్యులలోని ఒకరికి బిరుదు. అతడిమీద గౌరవంతో విశాఖజిల్లాలోని సర్వసిద్ధి గ్రామం ఏర్పడింది.

సోమవారపు పేట, బేస్తవారపు పేటలు ఆయా రోజుల్లో అక్కడ సంత జరగడం కారణంగా వచ్చాయి. బంటుమిల్లి, భట్టి ప్రోలులు సైనికుల పోషణకు గాను ఏర్పాటు చేయబడిన గ్రామాలు. జోడి ధర్మాపురం ఆ గ్రామంపై ‘జోడి’ అనే పన్నును విధించడం కారణంగా, మరొక ధర్మాపురం నుండి దీనిని వివక్ష చేయడానికి గాను స్థిరపడింది. కప్తానుపాలెం నిజానికి కేప్టెన్‌ పాలెం. పోర్చుగీసులు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసికొన్న నెలవు. హంపి పంపానది కారణంగా వచ్చింది. విజయ నగరం చరిత్ర తెలిసిందే. వళందపాలెం డచ్చివారి రాజధాని హాలెండు శబ్దం నుంచి వారి మకాముకు పేరుగా నెలకొన్నది. ఫ్రెంచివారి నెలవు పరాసుపేట. ఫరంగుల (విదేశీయులు) ఆవాసం ఫిరంగి పురం. (Foreign అనే ఆంగ్లపదం తెలుగు లిప్యంతరీకరణంలో ఫరంగి అయి, వ్యవహారంలో ఫిరంగి అయింది.)

ఇలా ఊళ్ల పేర్లలో అనేక విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని శాస్త్రీయపద్ధతిలో అధ్యయనం చేయడం వల్ల చరిత్ర, చారిత్రక భూగోళం, ఒకప్పటి నైసర్గికస్థితి, జనుల ఆచార వ్యవహారాలు, వారు పండించిన పంటలు, వారు సాకిన జంతుజాలం — ఈ విధంగా మానవేతిహాసానికి సంబంధించిన అన్ని అంశాలను సమంగా అర్థం చేసికోవడానికి ఉపకరిస్తుంది. గ్రామనామాలు భాషా సంకేతాల రూపంలో ఉన్న శిలాజాలు. అవి కదిలిపోయిన కాలపు గుర్తులు.

మన ఇంటి పేర్లు

ప్రతి వ్యక్తికీ పేరుంది. ఇంటి పేరూ వుంది. ఈ ఇంటిపేరు నిజానికి కుటుంబనామం. కొందరు తాము నిర్మించుకున్న నివాస భవనాలకు పేర్లు పెట్టుకుంటారు. నిజానికవే ఇంటిపేర్లు. అయితే ఈ భావన ఇటీవల ప్రాచుర్యంలోనికి వచ్చింది. వెనుకటి శతాబ్దాల్లో రాజభవనాలకు పేర్లున్నట్టు దాఖలా వుంది. సాధారణ భావనలో కుటుంబ నామమే ఇంటిపేరుగా వ్యవహరింప బడుతోంది. కారణం కుటుంబానికి ఆశ్రయమిచ్చేది ఇల్లు గనుక, కుటుంబ నామం ఇంటి పేరుగా చెలామణిలోనికి వచ్చింది. ఇలాంటి వ్యవహారం, దీని విషయంలోనే కాదు మరోచోట కూడ కన్పిస్తుంది. ఇలువరుస అనే వ్యవహారముంది. అక్కడ కూడ ఇండ్ల వరుస అని కాక కుటుంబ చరిత్ర అనే అర్థాన్నే ఇస్తోంది.

ఇక ఈ ఇంటిపేర్లు ఏదో ఒక పద్ధతిలో ప్రపంచమంతటా వున్నాయి. ఇలా చెప్పడానికి కారణం, మన ఇంటి పేర్లు, వ్యక్తి నామానికి ముందుండగా, ఇతర భాషా సమాజాల్లో వెనుక వున్నాయి. దేనినయినా సమంగా గుర్తించేటందుకు పేరు అవసరముంటుంది. అది మనిషైనా, జంతువైనా, వస్తువైనా, స్థలమైనా అంతే. అయితే సమాజం లోని వ్యక్తులకు, వారు నివసించే స్థలాలకు మాత్రమే అన్నింటికి పేర్లుంటాయి. మిగతా వాటికి జాతి గతమైన పేర్లు తప్ప, ప్రతి దానికి పేరుండదు. పిల్లులలో ప్రతి పిల్లికీ పేరుండదు. అలాగే ప్రతి వేపచెట్టుకు పేరుండదు. ఇక వ్యక్తులందరికీ పేర్లున్నా, ఒకే విధమైన పేర్లు చాలా మంది వ్యక్తులకుంటాయి. దీని వలన సమమైన గుర్తింపుకు విఘాత మేర్పడుతుంది. దానిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఇంటి పేర్లు అవసరమైనాయి. అయితే కొన్ని సందర్భాలలో అప్పుడు కూడ ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు తండ్రి పేరు లేదా వారు చేసే వృత్తి పేరు లేదా వారి శరీర వర్ణం. ఇలా ఆయా వ్యక్తులలోని ఏదో ఒక ప్రత్యేకతను బట్టి ఇచ్చే శబ్దంతో ఆ ఇబ్బందిని పరిహరిస్తాము.

ఇలా ఏర్పడ్డ ఇంటిపేర్లు, ఒక భాషా సమాజపు అంటే ఒక జాతి జీవనానికి ప్రతీకలుగా భాసిస్తాయి. అంటే సమాజపు అన్ని ముఖాలు అందులో దర్శనమిస్తాయి. కాలగతిలో జన జీవనంలో అనేక మార్పులు వస్తాయి. జీవవశైలి మారిపోతూ వుంటుంది. ఆ మార్పు కనుగుణంగా దానిని సూచించే వ్యవ హారం సంఘ జీవనంలో చోటు చేసుకొంటుంది. దాని కనుగుణ మైన భాషా వ్యవహారమేర్పడుతుంది. అంటే క్రొత్త భావనలు, దాని కనుగుణమైన పదజాలం వ్యాప్తిలోనికి వస్తూ వుంటుంది. కాని మారనివి పేర్లు. అందువలన అవి పురా సమాజపు జీవ నానికి దర్పణంగా భాసిస్తాయి. అందులోను, ఒకనాటి సమా జాన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడేవి ఇంటిపేర్లంటే అతిశయోక్తి లేదు. వాని అధ్యయనం వలన చరిత్ర, సంస్కృతు లకు నేపథ్యాన్ని సవదరించే సమస్త అంశాలు బోధపడతాయి. ఒక భాషా సమాజపు సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేయ డంలో విస్మరింపరానిది గృహనామాధ్యయనం. దీనిని కొంత వివరంగా చూద్దాము.

మిగితా పేజీలు: 1 2 3
    
   
Print Friendly