మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నా పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. నాన్నగారు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారు కాశీనాథుని సరస్వతీ దేవి గారు. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. శ్యామలా దేవి, గిరిజా దేవి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని ’పెదపులివర్రు’ అనే గ్రామం. మా తాతగారు పరమ నిష్ఠాగరిష్టుడు. మనదేశానికింకా స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన సంఘటన. తాతగారు కాంగెస్ వాలంటీర్లకి భోజనం పెట్టారనే నెపంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్టు చేసి జైలులోపెట్టారు. అందుకు నిరసనగా జైలులో ఉన్నంతకాలం భోజనం ముట్టకుండా కేవలం కొబ్బరినీళ్ళతోనే బ్రతికిన అభ్యుదయవాది. అలాంటి తాతగారికి మనవడిగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. వారి సద్గుణాలు అంతగా నాకు అబ్బకపోయినా ఇలాంటి సమయంలో వారిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

నా బాల్యం. ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడినుంచి మా నివాసం విజయవాడకి మారింది. అది ఎలా జరిగిందంటే – మా ఊరికే చెందిన సముద్రాల రాఘవాచార్యులు గారు (సీనియర్ సముద్రాల) అప్పటికే మద్రాసులో వాహినీ ప్రొడక్షన్స్ లో ఆస్థాన రచయితగా పనిచేస్తున్నారు. వారు నిర్మించిన దేవత, సుమంగళి, పోతన మొదలైన చిత్రాలకి అప్పటికే రచన చేసి ఉన్నారు. వారి మూలంగా మా నాన్నగారికి విజయవాడలో వాహినీ ప్రొడక్షన్స్ కి రీజినల్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. అందువల్ల మా కుటుంబం అంతా విజయవాడకి షిఫ్ట్ అయ్యింది. నా హైస్కూలు విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. నేను బి.ఎస్సీ డిగ్రీ చేశాను. అప్పటికే మద్రాసులో బి.ఎన్.రెడ్డి గారు వాహినీ స్టూడియోస్ నిర్మిస్తున్నారు కొత్తగా. సౌత్ ఈస్ట్ ఏసియా లో అధునాతన సౌకర్యాలతో తయారౌతున్న ఆ స్టూడియో ఎప్పుడూ వార్తల్లో విశేషంగా ఉండేది. డిగ్రీ అయ్యాక నేను ఎక్కడో ఒక చోట ఉద్యోగం చెయ్యాలి. మా మేనమామ గారి సలహాపై నాన్నగారు నన్ను మద్రాస్ వాహినీ స్టూడియోలో సౌండ్ విభాగంలో రికార్డిస్ట్ గా చేర్పించారు. ఆ విధంగా జీవనోపాథికోసమే చిత్రరంగ ప్రవేశం చేశానే తప్ప చిన్నప్పటినుంచీ నాకేదో కళాదృష్టి ఉందనీ, పెద్ద దర్శకుడ్నయిపోవాలని కలలు కనే వాడ్ననీ చెప్పలేను. మా అంకుల్ ప్రోత్సాహం వల్లనే ఒక టెక్నీషియన్ గా నా సినీ జీవితం మొదలుపెట్టాను.

బి.యన్.రెడ్డి గారి శిక్షణ ప్రకారం, స్టూడియోస్ లో చేరిన ప్రతి టెక్నీషియనూ కెమెరా, ప్రొజెక్షన్ ఆపరేషన్, లేబొరేటరీ…ఇలా ప్రతి విభాగంలోనూ కనీసం ఆర్నెల్లయినా పని చేయాలి. అప్పట్లో వాహినీ స్టూడియోలో ఎలా ఉండేదంటే నిర్మాతలు మిగతా విభాగాల టెక్నీషియన్లని ఎక్కడ నుంచి తెచ్చుకున్నా, ఆడియో విభాగం మాత్రం స్టూడియోకి సంబంధించిన వారినే వాడుకునే వాళ్ళు. ఇందువల్ల వాహినీ నిర్మాణమైన అనేక చిత్రాలకి సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసే అవకాశం లభించింది. బి.ఎస్.రామకృష్ణారావు గారు, కె.వి.రెడ్డి గారు, బి.ఎన్.రెడ్డి గారు, తాతినేని ప్రకాశరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు లాంటి ప్రముఖ దర్శకుల సినిమాలకి పనిచేసే అవకాశం వచ్చింది. అలానే తెలుగు, తమిళ సినిమాలకి రెండింటికీ కూడా పనిచేసే వాడిని. ఈ క్రమంలో ఆదుర్తి సుబ్బారావు గారితో నాకు కాస్త ఎక్కువ అనుబంధం ఏర్పడింది.

సౌండ్ రికార్డిస్ట్ గా ఉంటున్నప్పటికీ సినిమాల్లోని మిగతా విభాగాల గురించీ, ముఖ్యంగా దర్శకత్వ శాఖలో నాకున్న ఆసక్తినీ, నా క్రియేటివిటీని గమనించిన ఆదుర్తి సుబ్బారావు గారు తన సినిమాలకి స్క్రిప్టు అసిస్టెంటు గానూ, అసోసియేట్ గానూ పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. మూగమనసులు, తేనే మనసులు లాంటి అనేక సినిమాలకి సుబ్బారావు గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. కొన్ని సినిమాలకి రెండో యూనిట్ దర్శకుడిగా కూడా పనిచేశాను. అప్పుడే నన్ను గమనించిన అక్కినేని నాగేశ్వరరావు గారు ’మీరు మా ఆన్నపూర్ణా సంస్థలోకి వచ్చేసెయ్యండి. ఒకటి రెండు సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచెయ్యండి. తొందరలోనే సొంతంగా దర్శకత్వం చేసే అవకాశం ఇస్తాము’ అని నన్ను అహ్వానించారు. ఆ విధంగా వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ వృత్తినుంచి అన్నపూర్ణా పిక్చర్స్ లో దర్శకత శాఖకి మారడానికి అక్కినేని గారే ప్రధాన కారణం. అక్కడినుంచీ వారు నిర్మించిన చదువుకున్న అమ్మాయిలు, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి మొదలైన సినిమాలకు అసోసియేట్ గా పనిచేశాను.

అన్నమాట ప్రకారమే వారు నిర్మించే ’ఆత్మగౌరవం’ సినిమాకి నాకు సొంతంగా దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. యద్దనపూడి సులోచన రాణి గారు, గొల్లపూడి మారుతీ రావు గారు కథనందించగా గొల్లపూడి మారుతి రావు గారు, భమిడిపాటి రాధాకృష్ణ గారు కలిసి సంభాషణలని అందించారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది బహుమతిని అందుకుంది….

ఇదండీ మొదటి సినిమా వరకూ జరగిన నా అతి సాధారణ సినిమా ప్రయాణం.

———————

ఆత్మగౌరవం

– ’స్వర్ణయుగంలో అన్నపూర్ణ’ పుస్తకం నుంచి సేకరణ

ఆత్మగౌరవం చిత్రం ద్వారా అన్నపూర్ణ సంస్థ మరో ప్రతిభావంతుడైన దర్శకుణ్ణి పరిచయం చేసింది. ఆయనే కె.విశ్వనాథ్. అన్నపూర్ణ సంస్థలో పని చేసిన మూడవ దర్శకుడు ఈయన. వరుసగా మూడు చిత్రాలకు అసోసియేట్ గా ఆదుర్తి దగ్గర పని చేశాక, నాలుగవ చిత్రానికి డైరెక్టరుగా ’డాక్టర్ చక్రవర్తి’ కి సారథ్యం వహించాల్సిన విశ్వనాథ్ – అప్పట్లో తన అధైర్యాన్ని వ్యక్తం చేయడం వల్ల – దాన్ని కూడా ఆదుర్తే డైరెక్ట్ చేయడం జరిగింది. అన్న మాట తప్పని అన్నపూర్ణా అధినేతలు – ’ఆత్మగౌరవం’ సినిమాని డైరెక్ట్ చెయ్యమని మళ్ళీ విశ్వనాథ్ ని కోరారు. ఆ బాధ్యతను ఆయన సంతోషంగా స్వీకరించారు.

“ఇక ఎలాంటి కథ చేయాలి” – అనే విషయం చర్చనీయాంశమైంది.

“ఇంతవరకూ ఫ్యామిలీ డ్రామా తో కూడిన సెంటిమెంట్ సినిమాల్నీ – సీరియస్ చిత్రాల్నీ తీశాం కనుక – కొత్తదనం కోసం ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ తో ఫుల్ లెంగ్త్ రొమాంటికి కామెడీ తీస్తే బావుంటుంది” అన్నారు మధుసూదన రావు.

ఆ ఆలోచన విశ్వనాథ్ కీ నచ్చింది.

వెంటనే యద్దనపూడి సులోచనారాణితో కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అనుకున్న దానికంటే బాగా వచ్చింది. కథ లోని పాత్రలన్నీ కామెడీకి ఒదిగిపోయే విధంగా – సన్నివేశాలు సమకూరాయి.

హాస్య భరితమైన నాటకాలు రాయడంలో ఆరితేరిన గొల్లపూడి మారుతీరావుకి సంభాషణలు రాసే బాధ్యతను అప్పగించారు. అప్పట్లో మారుతీరావు హైదరాబాదు రేడియో స్టేషన్లో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే వారు. సాధారణంగా సినిమా సంభాషణలు ప్రశాంతమైన గెస్ట్ హౌస్ లోనో, ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లోనో రూపు దిద్దుకుంటాయి. కానీ ఆత్మగౌరవం చిత్రానికి సంభాషణలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని చెట్ల నీడన, పచ్చిక బయళ్ల పైన మొలకెత్తాయని చెప్పాలి.

నాటకాలలో పాత్రోచితమైన సంభాషణలు రాయడంలో సిద్ధహస్తుడైన మారుతీరావు, సినీ మీడియాని సులువుగానే అవగాహన చేసుకుని ఆత్మ గౌరవం చిత్రానికి సంభాషణలు చక్కగా రాశారు.

ఇక చిత్ర నిర్మాణ విషయానికొస్తే – తొలిసారిగా దర్శకత్వపు బాధ్యతలు చేపట్టిన విశ్వనాథ్ కి నటీనటులనుంచి చాలినన్ని కాల్ షీట్స్ తీసుకునే విషయం లోనూ – ఫిలిం నెగటివ్ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చాడు మధుసూదనరావు. అంతకుముందు అన్నపూర్ణలో పనిచేసిన విశ్వనాథ్ – ఎంతో సృజనాత్మకతను సంపాదించుకున్నారనీ – ఆదుర్తి వద్ద శిష్యరికం చేయటం వల్ల ’టెక్నికల్’ గా చిత్రాన్ని బాా తీయగలరనీ మధుసూదన్ రావు గారి విశ్వాసం.

స్వతహాగా సౌండ్ ఇంజనీర్ కావడం వల్ల దర్శకులు విశ్వనాథ స్వయంగా దగ్గరుండి పాటల్ని చక్కగా రికార్డ్ చేయించారు. పాటలన్నీ పాపులర్ అయ్యి ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా హిట్టయింది.

సహజ వాతావరణాన్ని కన్నులకి కట్టేలా చూపించాలన్న లక్ష్యంతో – ఈ చిత్రం ఔట్ డోర్ దృశ్యాల్ని మొత్తం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనూ, రామప్ప సరస్సు, దేవలయం దగ్గరా, డిండీ ప్రాజెక్ట్ ప్రాంతంలోనూ చిత్రీకరించారు. స్థానికంగా ఉన్న నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ ఈ చిత్రంలో అవకాశాలిచ్చి ప్రోత్సాహించారు.

1966 మార్చి 18 న విడుదలైన ఆత్మగౌరవం శతదినోత్సవ చిత్రం కావడమే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో తృతీయ ఉత్తమ చిత్రంగానూ, ఉత్తమ కథా చిత్రం గానూ అవార్డులు అందుకోవడం విశేషం.

మొట్టమొదటి చిత్రంతోనే కె.విశ్వనాథ్ కి దర్శకునిగా మంచి పేరు వచ్చింది. పోను పోను కమర్షియల్ సినిమాని దృశ్యకావ్యంగా మలుచుకుంటూ కళాతపస్విగా నీరాజనాలందుకున్నారాయన!!

———————————

కౌముది సౌజన్యంతో–కిరణ్ ప్రభ

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుమొదటి సినిమా – అన్నే మోహన్ గాంధీ