Showing posts with label అవినీతి. Show all posts
Showing posts with label అవినీతి. Show all posts

Monday, October 31, 2011

(హజారే నిరశన )అసంపూర్ణ ఉద్యమం By ఉణుదుర్తి సుధాకర్ Andhra Jyothi 1/11/2011


అసంపూర్ణ ఉద్యమం

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అన్నా హజారే నిరశన దీక్ష పాక్షిక విజయంగా ముగిసిందని ఇప్పుడందరూ అంగీకరిస్తున్నారు. ఈ ఊహించని విజయం వెనక ఉన్న శక్తులేమిటి? ఈ ఉద్యమం, రాబోయే కాలంలో రానున్న ఏయే మార్పుల్ని సూచిస్తోంది? హజారే ఉద్యమంలో నాలుగు ప్రధానాంశాలు స్పష్టంగా కన్పిస్తాయి. మొదటిది- ఇదొక స్వయం ప్రజ్వలితమైన స్పాంటేనియస్ ఉద్యమం. అతి తక్కువ కాలంలోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. నిప్పుకణం కోసం ఎదురుచూసిన ఎండుటాకుల కుప్ప మాదిరిగా దేశం యావత్తూ ఒక్కసారి భగ్గుమంది. రాంలీలా మైదానం ఒక యాత్రా స్థలంగా మారింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే ఉత్సాహం వెల్లివిరిసింది.

అన్ని వర్గాలూ, వయో సమూహాలూ, ఆడా మగా, చిన్నా చితకా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరి ముఖాల్లోనూ ఒక ఆశాకిరణం తాండవించింది. అయితే ఈ ఉద్యమం ప్రధానంగా -ఆర్థిక సంస్కరణల తరవాత ఉద్భవించిన కొత్త మధ్య తరగతి నడిపించిన మొదటి ఆందోళన. అందుకే కొత్తగా సచేతన మవుతూన్న ఈ సామాజిక వర్గాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం అవసరం. భారతదేశపు స్వాతంత్రోద్యమంతో సహా చరిత్రలోని అన్ని ఉద్యమాలకూ, విప్లవాలకూ పునాది ఏర్పరిచింది మధ్యతరగతి ప్రతినిధులే. వామపక్షీయులు, పెట్టీ బూర్జువా అనే తిట్టు మాటని ఎంత తరచుగా ప్రయోగించినప్పటికీ ఇది వాస్తవం.

గతంలోనూ, ఇప్పుడూ కూడా ఇందుకు రెండే కారణాలు కనిపిస్తున్నాయి. అవి-దోపిడీనీ, అన్యాయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగల వెసులుబాటు ముందుగా మధ్యతరగతి వారికి ఏర్పడడమూ, ప్రజల పక్షాన నిలబడాలని వాళ్ళు నిర్ణయించుకోవడమూను. ఇప్పటి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కూడా ఇదే వర్తిస్తుంది. భారతదేశపు మధ్యతరగతి వర్గీయుల సంఖ్య పది కోట్లా, పాతికకోట్లా అనే చర్చను పక్కన పెడితే ఆర్థిక సంస్కరణల తరువాత ఈ వర్గం గణనీయంగా పెరిగిపోయిందనీ, ఈ వర్గంలో కేవలం అగ్రవర్ణాలే కాక, ఇతర కులాల ప్రాతినిధ్యం (అట్టడుగు కులాల నుంచి మధ్యతరగతిలోకి అడుగుపెట్టిన వారితో సహా) గుణాత్మకంగా మారిపోయిందనీ చెప్పుకోవాలి. ఒక అంచనా ప్రకారం వర్తమాన భారతదేశపు మధ్యతరగతి జనాభా మొత్తం అమెరికా జనాభాకు అతిచేరువలో ఉన్నది. సంఖ్యా పరంగా అందుకే అది ఇటు దేశీయ పరిశ్రమలకూ, వాణిజ్యానికే కాక, అటు బహుళ జాతి సంస్థలకూ కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

సంస్కరణలకు పూర్వం మన మధ్యతరగతిలోని ప్రధాన సభ్యులు భూములు కోల్పోయిన బ్రాహ్మణులు, భూమిని ఇంకా అంటిపెట్టుకొని ఉన్న అగ్రకుల సమూహాలు, శూద్రులు. వీళ్ళలో అధిక శాతం విద్యావంతులు, తద్వారా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు వగైరా. భూమి బలం ఉన్న వాళ్ళల్లో కొంతమంది కొత్తగా ఏర్పడుతూన్న వ్యాపారాల వైపు మొగ్గితే మరికొంత మంది (ముఖ్యంగా ప్రాంతీయ) రాజకీయాల్లోకి మళ్ళారు. ఈ గతకాలపు మధ్యతరగతి నుంచే కమ్యూనిస్టు ఉద్యమం మొదలు జెపి ఉద్యమం దాకా అన్ని రకాల నాయకత్వ శ్రేణులూ పుట్టుకొచ్చాయి. ఆనాటి మధ్యతరగతిని స్థూలంగా (చర్చకోసం) సర్కారీ మధ్యతరగతి అని భావిస్తే, నేటి మధ్యతరగతిని కార్పొరేట్ మధ్యతరగతిగా ఊహించవచ్చు. ముఖ్యమైన అంశం ఏమిటంటే గతకాలపు మధ్యతరగతితో పోలిస్తే, నేటి మధ్యతరగతిలో వివిధ కులాల ప్రాతినిధ్యం, ప్రమేయం పెరిగాయనే చెప్పుకోవాలి. మరి ఈ కలగూరగంపలోని ఏ సారూప్యత వీరినందరినీ అన్నా హజారే ఉద్యమం వైపు నడిపించింది?

ఏ ఉద్యమంలోనైనా ప్రజల్ని కూడగట్టు కోవడానికి ఒక తీవ్ర మైన అసంతృప్తి, ఒక ఉమ్మడి శత్రువు ఉండి తీరాలి. అందీఅందని ఆర్థికాభివృద్ధి, అవినీతి మూలంగానే ఆర్థిక ప్రగతి అందకుండా పోతోందనే అసంతృప్తి, ఆవేదన ఒక వైపు, ఇందుకు సంస్థాగత రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులే ప్రధాన శత్రువులుగా అడ్డుపడుతున్నారనే ఆలోచన మరో వైపు అన్నా ఉద్యమపు చోదక శక్తులు. రాజకీయవ్యవస్థపై ప్రకటితమైన తీవ్ర అసంతృప్తి చివరికి రాజ్యాంగం తమకు హమీ ఇచ్చిన వెసులు బాట్లకు ముప్పు కలిగిస్తుందేమోనని ఒక దశలో దళితులు, బహుజనులు, మైనారిటీ వర్గాల వారు కలవరం చెందారు. అటువంటిదేమీ లేదని సర్దిచెప్పడానికి అన్నా హజారే ఉద్యమం విరమించే నాటికి ఒక దళిత బాలికనీ, ఒక ముస్లిం బాలికనీ స్టేజి మీదకి తీసుకురావాల్సిన అవసరాన్ని నిర్వాహకులు గుర్తించారు. ఏ ఉద్యమానికైనా కనీస అవసరాలైన అసంతృప్తి, ఉమ్మడి శత్రువు అన్నా ఉద్యమంలో కూడా ఉన్నాయి గాని, మూడో మూల స్తంభం అయిన 'మరో ప్రపంచం' లేదు.

ఉన్నా అది అసంపూర్ణంగానే ఉండిపోయింది. అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ఉద్యమాలన్నిటినిలోనూ కనిపించే అసంపూర్ణతే ఇది ('సంపూర్ణ విప్లవం' అని నినదించిన జేపీ ఉద్యమంలో కూడా ఈ అస్పష్టత అనివార్యం అయింది). అన్నా ఉద్యమానికి 'మరో ప్రపంచం'గాని ప్రత్యామ్నాయాన్ని చేరుకొనే మార్గనిర్దేశనం గానీ లేనప్పటికీ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ రాబోయే మంచి రోజుల పట్ల తమ తమ అభిప్రాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఉహాజనిత ప్రత్యామ్నాయంలోని ప్రధాన అంశాలు: అవినీతి లేని భారతదేశం, అందరికీ అందుబాటులో అభివృద్ధి, చట్టబద్ధమైన పాలన, సంక్షే మరాజ్యం... ఈ విధంగా విస్తరించుకుంటూ పోవచ్చు. అటు హిందూరాజ్యాన్ని , ఇటు సామ్యవాదాన్ని దూరంగా ఉంచి, రాజకీయాలకు అతీతమైన (అంతకన్నా ముఖ్యంగా రాజకీయాలకు వ్యతిరేకమైన) ఉద్యమంగా దీని తొలిదశను నడిపించడంలో అన్నా ఉద్యమపు నిర్వాహకులు (నాయకులు అనలేం) సఫలీకృతులయ్యారు. భారతదేశపు నిర్దిష్ట కఠిన వాస్తవాలైన కుల వైరుధ్యాల్ని, ప్రాంతీయ అసమానతల్నీ, మత పరమైన విభజనల్ని, రాజకీయ శక్తుల్నీ ఈ ఉద్యమం తాత్కాలికంగానైనా ఎలా అధిగమించగలిగింది? ఇది ఎంతకాలం సాధ్యం?

అన్నా ఉద్యమం ఏ ఒక్కరాజకీయ పార్టీనో, సమూహాన్నో తన లక్ష్యంగా చేసుకోకుండా 1947 తరవాత మొట్ట మొదటిసారిగా మొత్తం వ్యవస్థాగత రాజకీయ సంస్థలన్నింటినీ వాటితో బాటు పార్లమెంట్‌నీ రక్షాత్మక వ్యూహంలోకి నెట్టివేసింది. రాజ్యాంగపు ఔన్నత్యాన్ని, పార్లమెంటు ఆధిపత్యాన్నీ, వీటితో బాటు తమ ఉనికినీ సమష్టిగా పునరుద్ఘాటించుకోవలసిన స్థితికి రాజకీయ పక్షాలన్నీ చేరుకున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైనా ప్రజలకే జవాబుదారులనే గుర్తింపు సర్వత్రా బలపడింది. ఇది అన్నా ఉద్యమం సాధించిన ప్రధాన విజయం. ముందు ముందు ఏం జరగబోతోంది? నిజంగా అవినీతి అంతరిస్తుందా? ఈ ప్రశ్నలకి జవాబు వెతుక్కోవడానికి ముందు అవినీతి ఒక జాతీయ జాడ్యం లేదా వ్యసనం కాదు, లంచగొండితనం చేతి దురద కాదు అని గ్రహించాలి. పరిమితమైన అవకాశాల నుంచి, అభద్రత నుంచి దురాశ నుంచి మొదలైన అవినీతి ఇందిరాగాంధి కాలంలో వ్యవస్థీకృతమయింది.

లైసెన్సులు, పర్మిట్లు, 'సోషలిస్టు' మోడల్‌లో అక్రమ సంపాదనకు రాజమార్గాలయ్యాయి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక పాత మోడల్ పోయి దాని స్థానంలో సరికొత్త అవినీతి అవకాశాలు, మార్గాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా అవినీతి స్థాయి అనూహ్యంగా పెరిగిపోయింది. సుమారు ఏభై ఏళ్ళ స్వాతంత్య్రం తరవాత కీలక రంగాల్లో తన అసమర్థతను పెంచుకొంటూ పోయిన పాలకులు (ఏ పార్టీ వారైనా), చేతులెత్తేశారు. విద్య, ఆరోగ్యం, మౌలికసదుపాయాలు అదే క్రమంలో ప్రైవేటురంగం చేతుల్లోకి మారాయి. చివరికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఈ అభివృద్ధి మేడిపండు మాత్రమే అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసివస్తోంది. అయితే ఈ మేడిపండు సృష్టి వెనుక కొత్త మధ్యతరగతి విడుద లచేసిన మార్కెట్ శక్తులు దాగి ఉన్నాయి.

కొత్త మధ్యతరగతి సృష్టించిన మార్కెట్లకూ వాణిజ్య అవకాశాలకూ డిమాండ్ చేస్తున్న వస్తువులకూ సర్వీసులకూ సరిగ్గా అమరిపోయే విధంగా కొత్త అవినీతి బాటలు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటుతో పెరుగుతున్న భారతదేశపు మొబైల్ ఫోనుల కనెక్టివిటీకీ 2జీ స్కామ్‌కి దగ్గర చుట్టరికం ఉన్నది. అలాగే మౌలిక సదుపాయాలు, విద్యా ఆరోగ్య వ్యాపారాలు కూడా అభివృద్ధి కన్నా వేగవంతంగా అవినీతిమార్కెట్ శక్తులకు అనుగుణంగా స్పందించింది. నేటి తరం రాజకీయ నాయకులు ముందుగా అక్రమ సంపాదనకూ పకడ్బందీ అయిన చట్రాన్ని నిర్మించుకొని తర్వాతే దాని చుట్టూ అభివృద్ధి పథకాలను రూపొందిస్తున్నారు. కొత్త అవినీతికి ఉన్న మరో లక్షణం భూదాహం. ఏదో ఒక అభిృద్ధిపథకం, పరిశ్రమ పేరుతో వందలాది ఎకరాలను స్వంతం చేసుకొనే ప్రయత్నంలో అంతా నిమగ్నమై ఉన్నారు. ఐటి అయినా, ఇన్ ఫ్రాస్ట్రక్చరైనా, ప్రైవేటు కళాశాలలైనా అందరిదీ అదే దారి. ప్రభుత్వం తన పాత్రని కుదించుకుంటూ పోతూ ఉంటే ఈ కొత్త అభివృద్ధి శక్తులు మరింత విజృంభిస్తున్నాయి. వాటిని ఎవరైనా అడ్డుకుంటే అభివృద్ధి వ్యతిరేకులుగా వాళ్ళని చిత్రీకరించడం జరుగుతున్నది.

అభివృద్ధికీ అవినీతికీ మధ్య ఏర్పడిన ప్రగాఢమైన సంబంధాన్ని విడగొట్టి ఆ జంటను వేరుచెయ్యాలని అన్నా ఉద్యమం ప్రయత్నించింది. కనీసం ఆ దిశలో మొదటి అడుగు వేసింది. ఇది ఆ ఉద్యమం సాధించిన రెండో ఘన విజయం. అసలు ఏ రకమైన అభివృద్ధిఅయినా అట్టడుగు వర్గాల నుంచే మొదలవ్వాలనే సాధారణ సూత్రాన్ని మరచిపోయిన పాలకులు ఇప్పుడు అందరూ అభివృద్ధిక్రమంలో భాగస్వాములవ్వాలని ఉద్ఘాటిస్తున్నారు. ఇవాళ అభివృద్ధి ఎవరి కోసం అనే మౌలికప్రశ్న రేఖామాత్రంగానైనా చాలా మందికి స్ఫురిస్తున్నది. ఒక వేళ ఈ ప్రశ్నకి జవాబు చెప్పుకోగలిగి, అభివృద్ధిమోడల్‌ని సంస్కరించుకోగలిగితే అది నిజమైన ఆర్థిక సంస్కరణ అవుతుంది. అయినప్పటికీ ఆ మోడల్ నయినా అవినీతి కౌగిలి నుంచి విడదీయడం ఎలా? అనే ప్రశ్న మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ రెండో ప్రశ్నకు జవాబు ఒక్కటే. అది ప్రజాస్వామ్య విలువల్ని, సంస్థల్నీ బలోపేతం చెయ్యడం.

ఈ విషయం అందరికన్నా బాగా పాలకులకీ తెలుసు గనుక అవకాశం దొరకగానే అన్నా బృందంతో మొదలుపెట్టి, స్వచ్ఛంద సంస్థలపైనా సమాచార హక్కు పైనా, పత్రికా స్వేచ్ఛ పైనా ఎదురుదాడులు మొదలుపెట్టారు. మున్ముందు ఇవి ఇంకా ఉధృతం కాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఎదురుదాడులు ఆగే అవకాశం లేదు. అన్నా మొదలు పెట్టిన ఉద్యమం కొనసాగడమే ఇందుకు పరిష్కారం. చివరగా ఒక మాట. అవినీతి వ్యతిరేక ఆందోళన ద్వారా మొదటిసారిగా బరిలో దిగిన కొత్త మధ్య తరగతి రాజకీయాలకు అతీతంగా ఉండిపోతుందని భావించడం సరికాదు. వాళ్ళల్లో కొంత మంది స్వచ్ఛంద సంస్థలకూ, ప్రజాస్వామ్య వాదులకూ అలాగే ఆధ్యాత్మిక సంస్థలకూ ప్రాంతీయ రాజకీయాల చట్రంలో ఎక్కడో ఒకచోట మరికొంత మంది ఇమిడిపోవచ్చు. అయితే ఎవరి నిర్ణయాలకు వారిని వదిలివేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. కొత్తగా ఏర్పడుతున్న ఈ సమూహాన్ని తమకు అనుగుణంగా మలచుకొనేందుకు వివిధ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి.

ప్రస్తుతానికి కాంగ్రెస్ తన శక్తుల్నీ, సమయాన్నీ ఎదురుదాడులకే పరిమితం చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోకీ బిజెపికీ ఈ కొత్త మధ్యతరగతిని తనవైపు తిప్పుకోగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. అఖండ భారత్, బాబాల ఆధ్యాత్మికత, చరిత్ర పట్ల అసమగ్ర, ఆశాస్త్రీయ అవగాహన, అన్నిటి కన్నా ముఖ్యంగా తీవ్ర అసంతృప్తి బిజెపికి మంచి సాధనాలు. గుజరాత్‌ను ఒక ఆదర్శ వంతమైన అభివృద్ధి మోడల్‌గా ప్రచారం చెయ్యడం , నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా సూచించే ప్రయత్నం, ఇవేవీ కూడా యాదృచ్ఛికం కాదు. రాబోయే పరిణామాలకు ముందస్తు హెచ్చరికలు. ఆరెస్సెస్, ఎబివిపిల మార్గాన కాకుండా మధ్యతరగతిని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకునేందుకు మొట్ట మొదటి సారిగా బిజెపికి ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. అద్వానీ రథయాత్ర వెనక ఉన్న అసలైన ఆశయం బహుశా ఇదే.
- ఉణుదుర్తి సుధాకర్ 

Friday, October 14, 2011

దారితప్పుతున్న అన్నాలు By - డొక్కా మాణిక్య వరప్రసాద్ Andhra Jyothi 15/10/2011


దారితప్పుతున్న అన్నాలు

రాజకీయ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తెగనాడి మతపరమైన మెజారిటీ రాజకీయాల దిశగా దేశాన్ని నడిపించే మహాకుట్ర అన్నాల ఉద్యమంలో దాగివుంది. అన్నా హజారే, బాబా రాందేవ్, మోడీ, అద్వానీ చెలిమికి అదే ప్రాతిపదిక.

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం కంటే అన్నా హజారేను గాంధీజీ సరసన నిలబెట్టాలనే తాపత్రయం అన్నా బృందంలో ఎక్కువగా వుంది. దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించే నాటికే గాంధీజీ దక్షిణాఫ్రికాలో పలు పోరాటాలు నడిపారు. యువకుడుగా ఉన్నప్పుడే జాతిపితకు సత్యాగ్రహం గురించిన అవగాహన ఏర్పడింది. కానీ గాంధీ చిత్రపటం నేపథ్యంలో అవినీతి వ్యతిరేక జన లోక్‌పాల్ చట్టం కోసం దీక్ష చేసిన అన్నా వయో వృద్ధుడైనప్పటికీ గతంలో ఆయన ఏ దురన్యాయాలకు వ్యతిరేకంగా ఏమిచేశాడు అన్న ప్రశ్నకు 'అన్నా'ల వద్ద సమాధానం లేదు.

గాంధీజీ దృష్టిలో సామాజిక మార్పు శాసనాలతో వచ్చేది కానేకాదు. ఆయనది నైతిక మార్గం. శాసనమార్గం కాదు. జాతి వివక్షతో తనపై దాడికి పాల్పడిన సందర్భాల్లో కూడ ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడానికి నిరాకరించారు. అహింసాయుత సత్యాగ్రహ పద్ధతిలో శత్రువులో మానసిక పరివర్తన తేవడం ఆయన సన్మార్గంగా భావించారు. కానీ అన్నా హజారేది అందుకు భిన్నమైన మార్గం.

అది శాసనాల ద్వారా అవినీతి నిర్మూలన మార్గం. గాంధీజీకి నైతికమార్పు అప్రాముఖ్యం. గాంధీ మరణ శిక్షను వ్యతిరేకించాడు. అవినీతిపరులకు ఉరిశిక్ష విధించాలనేది అన్నాల డిమాండ్. ఎంత తేడా! అయినా అన్నా హజారేను గాంధీ సమానుడిగా, ఈనాటి గాంధీగా చూపే ప్రయత్నాల్లో అన్నాలు వున్నారు. వారి ఉద్యమాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా భ్రమింపజేస్తున్నారు. పౌర సమాజం అనే భావనను అన్నాలు బలంగా తెరపైకి తెచ్చారు. రెండున్నర దశాబ్దాల క్రితమే 'పౌరసమాజం-రాజ్యం' అనే రెండుగా దేశాన్ని చూడడం మొదలైంది. వాటి పరిధి, పరస్పర ప్రభావాల చర్చ జరిగింది, ముగిసింది. పౌర సమాజం గురించి విశేష సైద్ధాంతిక కృషి జరిపిన నీరా చందోక్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో ఇక పౌర సమాజంలో మన యాత్ర ముగిసినట్టేనా? అని సందేహించారు.

పౌర సమాజం గురించిన ఈ చర్చ గురించి అన్నాలకు ఏ మాత్రం తెలుసోగానీ పౌర సమాజం పార్లమెంటు కంటే ఉన్నతమైనదనే ప్రచారాన్ని వారు ప్రారంభించారు. సమాజ జీవితపు రాజకీయ వ్యక్తీకరణగా చట్టసభలు వచ్చాయి. అలా సమాజం నుంచి రాజకీయాలు విడిపోయాయి. మిగిలిన డొల్లను పౌరసమాజం అనవచ్చు. అది రాజకీయరహితమైనది.

ప్రస్తు త రాజకీయాల్లో విలువల సంక్షోభానికి పౌర సమాజంలో రాజకీయాల పట్ల వుండే ఏహ్య భావం, నిష్క్రియాపరత్వం ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో నిరంతరం వుండే స్వార్థపర మనుషులు మెసలేది పౌర సమాజం అని జర్మన్ తత్వవేత్త హేగెల్ భావించాడు. స్వలాభాపేక్షతో సంచరించే రాజకీయరహిత మానవుల సముదాయమైన పౌర సమాజాన్ని రద్దుచేసే దిశగా పని చేయాలని కారల్ మార్క్స్ భావించాడు.

పౌర సమాజం అన్నిటికంటే పవిత్రమైనదనే భావాన్ని నెలకొల్పడం అనేది చరిత్ర తెలియని వాళ్ళకు ఉత్తేజకరంగా వుండవచ్చేమో కానీ చరిత్ర చదువుకున్న వాళ్ళకు కాదు. 'ఐ హేట్ పాలిటిక్స్' అనే వాళ్ళు అన్నాలుగానూ, నీతివాక్య ప్రబోధకులుగానూ నిష్క్రియాపరులుగానూ దర్శనమివ్వవచ్చు గానీ, వాళ్ళ వల్ల అంతిమంగా దేశానికి జరిగేది గుండు సున్న (సామాన్యులకిచ్చే సంక్షేమ పథకాలను ఆడిపోసుకునేది కూడా వీళ్ళే).

ఈ అన్నాల పౌర సమాజంలో ఆమ్ ఆద్మీకి స్థానం లేదు. సామాన్యుల పోరాటాలు వీరికి పట్టవు. రైతులు, కూలీలు, కర్షకులు, కార్మికులు చేసే ఏ ఉద్యమం కూడా 'పౌర సమాజం' చేసే ఉద్యమంగా భావించబడదు. అన్నాలు ఈ ఉద్యమంలో మమేకం అవడం అటుంచి కనీసం సానుభూతి కూడా ఏనాడూ ప్రకటించిన పాపాన పోలేదు. వీళ్ళకి గత ఉద్యమ చరిత్ర శూన్యం.

దారుణ మారణకాండకు సంఘ్‌పరివార్ శక్తులు తెగబడిన సందర్భాల్లో ఈ అన్నాలు, వారి పౌర సమాజం ఎక్కడుంది? అని అరుంధతీరాయ్ వేసిన ప్రశ్నకు జవాబు లేదు. ఏనాడూ ఏ సామాజిక దురన్యాయాన్ని గురించి కూడా కాసింత గొంతెత్తకుండానే వృద్ధుడైపోయిన అన్నా హజారే దశాబ్దాల కుంభకర్ణ నిద్ర అనంతరం మేల్కొన్న భారత 'రిప్‌వాన్ వింకిల్' అని చెప్పొచ్చు.

కేజ్రీవాల్‌తో సహా పలువురు ముఖ్యులకు సంఘ్ పరివార్ శక్తులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు వున్నాయన్నది బహిరంగ రహస్యమే. అన్నా ఉద్యమిస్తే ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందని ఆ సంస్థ బాధ్యులు గత మార్చిలోనే రాసిన లేఖను దిగ్విజయ్ సింగ్ గురువారం బయటపెట్టాడు. అన్నా, ఆరెస్సెస్ మధ్య సంబంధం ఇక ఎంత మాత్రం రహస్యం కానేకాదు. మతంపేరిట మూడువేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీని అన్నా పొగిడారు.

దానిపై తీవ్ర విమర్శలు రాగా నాలిక కరుచుకున్నారు. సంఘ్‌పరివార్‌తో అన్నాల సంబంధం బహిర్గతమైతేనే ఇరువురికీ లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అన్నాలు ప్రత్యక్ష రాజకీయాలకు దిగజారి రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే ధ్యేయమని ప్రచారం చేస్తూ మతతత్వ వాదులను గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. అద్వానీ అవినీతి వ్యతిరేక రథయాత్రకు అనుగుణంగానే అన్నాలు పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నాను నిలబెట్టే దిశగా సంఘ్ పరివార్ కృషి చేస్తుందని వచ్చిన వార్తల్లో నిజం లేకపోలేదు.

రాజ్యాంగ సంస్థలపై ప్రజలలో అవిశ్వాసం రేకెత్తించడం అన్నాలు చేస్తున్న మరో పని. ఇటీవల కేజ్రీవాల్ ఒక ఇంగ్లీష్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంటు కంటే అన్నానే గొప్పవాడు అని వ్యాఖ్యానించాడు.

పార్లమెంటు కంటే పౌరుడే గొప్ప అని రాజ్యాంగం చెప్పింది కాబట్టి తానన్నది సరైనదేనని సమర్థించుకోజూచాడు. కానీ రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పార్లమెంటు కంటే పౌరుడు గొప్ప అనేది ఆయన చెప్పలేక పోయాడు. ఇప్పటివరకూ 'పౌరుడు వర్సెస్ పార్లమెంటు' అనే చర్చ రాజ్యాంగ ప్రవచనంలోకి రాలేదు. హెచ్.ఎమ్.సీర్వాయ్, గ్రాన్‌విల్లీ ఆస్టిన్ లాంటి రాజ్యాంగ కోవిదులు రాసిన గ్రంథరాజాల్లో గానీ, వి.ఆర్.కృష్ణయ్యర్, కోకా సుబ్బారావు, భగవతి, చంద్రచూడ్, హెచ్.ఆర్.ఖన్నా లాంటి ఉద్దండులైన న్యాయమూర్తుల తీర్పుల్లో గాని కన్పించని చర్చను కేజ్రీవాల్ లేవనెత్తారు. పౌరులకు పార్లమెంటుకు మధ్య లేనిపోని అగాధం సృష్టించి, ఒక తప్పుడు చర్చను రేకెత్తించి రాజ్యాంగాన్ని, రాజ్యంగ సంస్థలను బలహీనపరిచే దురుద్దేశపూరిత ప్రయత్నంలో అన్నాలు నిమగ్నమయ్యారు.

రాజ్యాంగం ప్రకారం పౌరులకు విశేష ప్రాధాన్యం ఉంది. పౌరసత్వ ప్రాతిపదికనే ఓటు హక్కుతో పలు హక్కులు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అలాంటి పౌరుల రాజకీయ వ్యక్తీకరణగా ఏర్పరచబడిన పార్లమెంటును కించపరచడం అంబేద్కర్ విరచిత రాజ్యాంగానికి ఎసరు పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు. సంఘ్ పరివార్ శక్తులు అధికారంలో ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని తిరిగిరాయాలనే విఫలయత్నం చేయడాన్ని ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే శక్తుల నుంచి రాజ్యాంగ సంస్థలకు వస్తున్న ముప్పు గురించి ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం వుంది.

దేశంలో అవినీతి బాగా వేళ్ళూనిందనటంలో సందేహం లేదు. ప్రపంచీకరణతో పాటు ఈ అవినీతి మన దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ కొత్తపుంతలు తొక్కుతున్నది. దాన్ని కట్టడి చేయాల్సిందే, శిక్షించాల్సిందే. అందుకోసం చట్టపరమైన మార్గాలను అన్వేషించాల్సిందే. ప్రపంచీకరణ పేరిట లబ్ధి పొందిన వర్గాల 'పౌర సమాజం' అవినీతిని అంతమొందించ లేదనడంలో అతిశయోక్తి లేదు.

తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఇప్పటివరకూ దేశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారంలో వున్న ప్రతిపార్టీ ఈ అవినీతి వట వృక్ష ఛాయలో సేద తీరినదే. కానీ అన్నాలు పాపమంతా కేవలం ప్రస్తుత పాలకులదే అన్నట్టు చిత్రీకరించి గాలి జనార్ధన రెడ్డి లాంటి వారిని తయారుచేసిన సంఘ్‌పరివార్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో వున్నారు. మసీదులు కూలగొట్టే, మత కల్లోలాలు సృష్టించే, ప్రజాస్వామ్య రాజకీయాలను ద్వేషించే, 'ఆమ్ ఆద్మీ'ని ఈసడించుకునే, స్త్రీలను అణగదొక్కే, దళితులను వివక్షకు గురిచేసే ఈ శక్తుల గురించి ప్రజలు బాగా అవగాహన చేసుకోవాల్సి వుంది.

అన్నా ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత మోతాదుకు మించినదని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. వాటిని సైతం పక్కన బెట్టి నేరుగా అన్నాలతో చర్చలు జరిపి పలు డిమాండ్లు అంగీకరించినా వారు సంతృప్తి చెందకపోవడానికి కారణం సంఘ్ పరివార్‌కు లాభం చేకూర్చాలన్నదే. లేకపోతే అన్నాలు అమ్మకానికో (డిజిన్వెస్ట్‌మెంట్) మంత్రిని కేబినెట్‌లో వుంచుకొని బాల్కో లాంటి లాభసాటి ప్రభుత్వ సంస్థలను చౌకగా అమ్మి సొమ్ముచేసుకున్న వారిని పల్లెత్తు మాట ఎందుకనరు? ఒక పక్క పార్లమెంటును ప్రశ్నిస్తూ మరో పక్క మోడీని ఎలా సమర్థిస్తారు?

ప్రస్తుత రాజకీయ పార్టీలలో గిరిజన, దళిత, బలహీన వర్గాలకు, మైనారిటీలకు మహిళలకు లబ్ధిచేకూర్చే పలు పథకాలతో సామాన్యుల ఆదరణ చూరగొన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిసలైన సెక్యులరిస్టు పార్టీ. అలాంటి పార్టీని దెబ్బ తీసిన పక్షంలో లబ్ధి పొందేవి అన్నాల వర్గ స్వభావం కలిగిన వర్గాలే, వారి పార్టీలే, సెక్యులరిజాన్ని, ఆమ్ ఆద్మీని దెబ్బతీసే సంఘ్ పరివార్ శక్తులే.

అంబేద్కర్ అన్నట్టు 'మెజారిటీలు రెండురకాలు: (అ) మతపరమైన మెజారిటీ; (ఆ) రాజకీయ పరమైన మెజారిటీ. రెండవదాన్ని మార్చవచ్చు. కానీ మతపరమైన మెజారిటీ అలా కాదు. అది పుట్టుకతో ఏర్పడేది. రాజకీయ పార్టీల్లో ఎవరికైనా ప్రవేశం ఉంటుంది. కానీ మతపరమైన మెజారిటీ విషయంలో తలుపులు మూసి వుంటాయి. దాని రాజకీయాలు దానిలో పుట్టిన వాళ్ళే నిర్ణయిస్తారు'. రాజకీయ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తెగనాడి మతపరమైన మెజారిటీ రాజకీయాల దిశగా దేశాన్ని నడిపించే మహాకుట్ర అన్నాల ఉద్యమంలో దాగివుంది. అన్నా హజారే, బాబా రాందేవ్, మోడీ, అద్వానీ చెలిమికి అదే ప్రాతిపదిక.
- డొక్కా మాణిక్య వరప్రసాద్
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు 

Sunday, September 4, 2011

అన్నా అర్థంలో అవినీతి అంటే..సుదర్శన్ బాలబోయిన కుమారస్వామి నాగం పరిశోధక విద్యార్థుల Namasethe Telangana 28/08/2011


8/27/2011 11:46:28 PM
అన్నా అర్థంలో అవినీతి అంటే..
బ్రాహ్మణీయ, పెట్టుబడిదారీ విధానాలే దళిత బహుజనులను పీడించే అధర్మానికి మూలాధారాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్నాడు. నిజంగా అవినీతిని వ్యతిరేకించే వారెవరైనా ఉంటే, ఈ సమాజంలోని అమానవీయ బ్రాహ్మణ విలువలకు, సంస్కృతికి, పెట్టుబడిదారీ విష సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలి. అంతే తప్ప అగ్రకుల, వర్గ ప్రయోజనాలను పునర్నిర్మించే అన్నా (అ)ధర్మాన్ని ఆదర్శంగా తీసుకోరాదు.
దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి మరింత మెరుగైన చట్టం (జన్ లోక్ పాల్ బిల్లు)ను రూపొందించాలని అన్నాహజారే, అతని అనుయాయులు ఉద్యమం లేవదీశారు. అన్నా టీం సభ్యులు (ఎలిట్ క్లాస్, క్యాస్ట్ ) ప్రభుత్వంపై చేస్తున్న ఒత్తిడి, లేదా ఉద్యమం సంగతి ఎలా ఉన్నా.. దీనిపై దేశం లో విభిన్న వాదనలు వస్తున్నాయి. అవినీతి అంటే ఏమి ? దాన్ని ఎలా నిర్వచించాలి? అవినీతికి ఈ దేశంలో ఉన్న మూలాలేమిటి? వంటి అంశాలపై లోతైన చర్చ సాగుతోంది. అంబేద్కరిస్టులు మొదలుకొని మార్క్సిస్టుల దాకా అన్నా ఉద్యమం, పర్యవసానాల గురించి సైద్ధాంతిక చర్చను లేవదీస్తున్నారు.
సమాజంలోని కొన్ని శక్తులు రూపొందించుకున్న విలువలు ఆచరణలో విఫ లం చెందితే, ప్రజా సమూహాలలో సంఘర్షణ మొదలౌతుంది. తిరిగి నీతి, అవినీతుల పునాదులను పునః సమీక్షించుకొని మరింత విస్తృతంగా, ఉదారంగా ఉండే సరికొత్త విలువలను రూపొందించుకుంటాయి.
సామాజిక ఉత్పత్తి శక్తుల పునాదుల ఆధారంగా సమస్త ఉపరితల రంగాలు నిర్ణయించబడతాయని, నియంవూతించబడతాయని మార్కిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ ప్రతిపాదించారు. సరిగ్గా నేడు దేశ రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశమైన అవినీతి వ్యతిరేక ఉద్యమం తీరుతెన్నులను ఈ దృక్పథం నుంచి కూడా చూడవచ్చు. ఏ సమాజంలోనైనా ఆధిపత్య శక్తులు నిర్మించిన విలువలకు భిన్నంగా, వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు నిత్యం సంఘర్షిస్తూనే ఉంటాయి. ఈ సంఘర్షణనే విలువల స్వరూపాన్ని, గుణాత్మక స్వభావాన్ని గతం కంటే మెరుగైనదిగా తీర్చిదిద్దుతుంది. విలువలు లేదా నీతి మరింత ఉన్నతమైనదిగా ఉన్నతీకరించబడే ప్రతి దశలోనూ దాని ప్రతిఫలాలు విశాల ప్రజారాశులకు అందజేయబడతాయి. ఆ ప్రతిఫలాలు గతంకంటే మెరుగైనవి మాత్రమే కాక ప్రజాస్వామికమైన, ప్రగతిశీలమైన సమాన అవకాశాల రూపంలో అక్కడి ప్రజా సమూహాలన్నింటికీ వీలైనంత విస్తృతంగా పంచబడతాయి. మానవ పరిణామ ప్రతి దశలోనూ నీతికి సంబంధించిన ఘర్షణ నిత్యం సాగుతూనే ఉంటుంది.
యజమానులు నిర్మించిన నీతి, దాని తాలూకు విలువల్ని ధ్వంసం చేస్తూ బానిసలు సృష్టించిన మహోన్నతమైన ఫ్యూడల్ సమాజాన్ని నిర్మించింది. ఈ విధంగానే ఫ్యూడల్ సమాజాన్ని ధ్వంసం చేసి దానికంటే మెరుగైన పెట్టుబడిదారీ విధానంలోని రాజకీయ ప్రజాస్వామిక విలువలను ప్రజలు రూపొందించుకున్నారు. అంటే చరివూతలో దోపి డీ శక్తులు నిర్మించుకున్న ఉత్పత్తి పునాదుల్నే కాకుండా దాని ఉపరితల అంశాలైన నైతిక, సాంస్కృతిక విలువల్ని సైతం అణచివేతకు, పీడనకు గురవుతున్న శక్తులు నిరంతరం మార్చుకుంటూ.. ఉన్నతీకరించుకుంటూ..మానవీకరించుకుంటాయి. భారతీయ సమాజంలో కూడా కొన్ని వేల సంవత్సరాలుగా.. ప్రజాసమూహాల న్నీ.. నిత్యం సామాజిక అణచివేతలకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నతమైన మానవీయ విలువలను నిర్మించుకుంటున్నాయి.
మనువు రూపొందించిన ధర్మం ఈ సమాజంలోని ప్రజా సమూహాలను సమానంగా చూడటానికి నిరాకరించింది. ఉత్పత్తిని సృష్టించే శూద్ర, అతిశూద్ర వర్ణాల శ్రమను, సంపదను దోపిడీ చేసే బ్రాహ్మణీయ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించింది. ఇది హిందూ ధర్మం అని జనులను శాసించింది. ఈ ధర్మాన్ని ఉల్లంఘిస్తే అత్యంత కఠినమైన, నీచమైన శిక్షలు అమలు చేసింది. ఈ బ్రాహ్మణీయ, హిందూ నీతిని ఈ దేశ పాలకులు 1950 వరకూ కాపాడుకుంటూ కాలం గడుపుతూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రజాపోరాటాలు పారిక్షిశామిక విప్లవాల ఫలితంగా గత సమాజపు పునాదులు పెకిలించబడ్డాయి. నిర్మూలించబడ్డాయి. ప్రజలే స్వయంగా నిర్మించుకొని, పాలించుకొనే రాజకీయ మూలాలు కలిగిన సోషలిస్టు, పార్లమెంటరీ ప్రభుత్వాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే భారత దేశంలో సైతం మనువాద నైతిక విలువలు బద్దలు కొట్టబడి ఎన్ని లోపాలున్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానులే (రూల్ ఆఫ్ లా) అనే విలువ అస్తిత్వంలోకి వచ్చిం ది. జీవన విధానంగా మారింది.
అయితే.. అన్నా హజారే టీం సభ్యులు ప్రతిపాదిస్తున్న అవినీతి వ్యతిరేక జన్ లోక్ పాల్ బిల్లు ధ్వంసం చేయబడిన నైతిక విలువల్నే తిరిగి ప్రతిపాదించే విధంగా ఉంది. అన్నా హజారే ఉద్యమానికి వచ్చిన ప్రతిస్పందనను తట్టుకోలేని ప్రభుత్వం దీని వెనుక మావోయిస్టులున్నారని దుష్ర్పచారానికి దిగింది. అటు తర్వాత, ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక సూత్రాలకు, విలువలకు పూర్తి విరుద్ధమైనదని స్యయంగా గాంధీ మనుమడు తుషార్ గాంధీ, మాజీ స్పీకర్ సోమనాధ్ చటర్జీల చేత విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టించింది. ఇదిలా ఉంటే... భారత పార్లమెంటరీ రాజకీయాలను అందించిన భారత రాజ్యాంగాన్ని అగౌరపర్చడమే గాక, మనువాద శక్తుల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడమే అన్నా బృందం లక్ష్యంగా కనిపిస్తున్నదని అంబేద్కరిస్టులు, సామాజిక శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు అంటున్నారు.
అన్నా చుట్టూ బ్రహ్మణ, బ్రహ్మణేతర అగ్రకుల శక్తులు, బడా కార్పోరేట్ రంగ ప్రముఖులు చేరి ఉన్నారు.
వీరంతా మనువాదాన్ని, ప్రైవేటీకరణ అనుసరిస్తూ, రిజర్వేషన్ విధానాలను, సామాజిక న్యాయసూవూతాలను ఉల్లంఘించే ప్రతిపాదనల దిశగా ప్రస్తుత ఉద్యమాన్ని కుట్రపూరితంగా చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య గురించి చర్చకు పెట్టవద్దని, సందర్భరాహిత్యమని వాదిస్తున్నారు. పార్లమెంటరీ రాజకీయాలపైన ఏ మాత్రం విశ్వాసం లేని మావోయిస్టులు రేపు ప్రజల కోసం లక్షల మందితో లాంగ్‌మార్చ్ చేస్తే ఈ బృందం సభ్యులంతా ఏటు వైపు నిలబడతారు?
అన్నా ‘హీరో’ వర్షిప్ అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా ప్రచారం చేయబడుతున్నది. ప్రజలకు విలువనీయకుండా వ్యక్తిని మాత్రమే పూజించే విధానం ఎంత ప్రమాదకరమైందో చరివూతలో అనేక ఉదాహరణలున్నాయి. 1935లో నాజీ నాయకుడు అడాల్ఫ్ ‘హిట్లర్ ఈజ్ జర్మనీ ఆన్ జర్మనీ ఈజ్ హిట్లర్’ అని కీర్తించారు. ఇలాంటి వ్యక్తి పూజ రెండవ ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది మరణహోమానికి దారి తీసింది. ‘ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇంది రా’ అంటూ 1975లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకాంత్ బారు అకాశానికెత్తాడు. దీనితో అపరకాళీగా అవతరించిన ఇందిర మొత్తం దేశాన్ని ఎమ్జన్సీ చీక ట్లో బంధించింది. ప్రస్తుతం ‘అన్నా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ అన్నా’ అని కిరణ్‌బేడీ పదే పదే అంటుంది. దీని ఫలితంగా భవిష్యత్‌లో మనం ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో? గత అనుభవాల నుంచి తగిన గుణపాఠం తీసుకొని అన్నా ఉద్యమాన్ని ఎలా కట్టడి చేయాలో బాధ్యత గల పౌరులు గా ఆలోచించాలి.
సోషలిజం ఎన్నటికి నెరవేరని స్వప్నమని రష్యా పతనాంతరం ప్రపంచ పెట్టుబడిదారి వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మూడో ప్రపంచ దేశాల్లో మార్కెట్ కోసం మొదలుకొని వనరులను కొల్లగొట్టడానికి బహుళజాతి సంస్థలు పెద్ద ఎత్తున అవతరించాయి. ‘కార్పోరేటు సామ్రాజ్యాలు వెనుకబడిన దేశాల్లోని సంపదను దోచుకోవడానికి ప్రభుత్వాధినేతలను, రాజ్యాధినేతలను డాలర్‌తో లొంగదీసుకుంటామని లేదంటే సి.ఐ.ఎ తోడేళ్ళతో వేటాడటం అత్యంత సహజమైన విషయమని’ ఒకప్పటి ఎం.ఎన్.సి ల ఏజెంట్ జాన్ పెర్కిన్స్ నగ్న సత్యాను వెలిబుచ్చాడు.
సంపద, సహజ వనరుల సమానంగా పంపిణీ జరగకుండా కొద్ది మంది సంపన్నులు సృష్టించే కృత్రిమ కొరతే అవినీతికి ప్రధాన మూలం. కొద్ది మంది సంపన్నుల గుత్తాధిపత్యంలో భూమిలాంటి సహజ వనరులు ఉండటం వల్ల ప్రజలకు సక్రమంగా పంపిణీ కాకుండా పోతుంది. ఆ సంపదను తిరిగి ఆ వర్గమే అక్రమ పద్ధతుల్లో మరింత లాభాలు గడించడానికి పెట్టుబడిగా ఉపయోగిస్తుంది. ఈ దేశ మొత్తం అవినీతి యంత్రాంగంలో ప్రధాన భాగమైన సంపన్నులను శిక్ష నుంచి తప్పించి, నామమావూతమైన ఉద్యోగులను మాత్రమే బలిచేయబూనడం వెనుక ఎటువంటి కుట్రలు దాగి ఉన్నాయో ఇట్టే పసిగట్టవచ్చు. పరిక్షిశమ నెలకొల్పడాని కి సరైన ప్రమాణాలు లేని పెట్టుబడిదారుడి (అగ్రకుల, వర్గ) దరఖాస్తును తిరస్కరించే అధికారిని (దళితుడై ఉండవచ్చు) లంచం ఆశించాడని శిక్షించడం ఎంత సులభం.
ఎల్.పి.జి ప్రభావం వల్ల కనీస జీవన అవసరాలైన ఆహారం,దుస్తులు, విద్య, వైద్యం వంటి వాటిని తీర్చుకోవడానికి వీలు లేని పరిస్థితికి సమాజం నెట్టివేయబడింది. ప్రతి ఒక్కరికీ కనీస అవసరాల్ని అందుబాటులోకి తెచ్చే రాజకీయ వ్యవస్థను నిర్మూలించకుండా అవినీతి నిర్మూలించడం సాధ్యమేనా?
బ్రాహ్మణీయ, పెట్టుబడిదారీ విధానాలే దళిత బహుజనులను పీడించే అధర్మానికి మూలాధారాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్నాడు. నిజంగా అవినీతిని వ్యతిరేకించే వారెవరైనా ఉంటే, ఈ సమాజంలోని అమానవీయ బ్రాహ్మ ణ విలువలకు, సంస్కృతికి, పెట్టుబడిదారీ విష సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలి. అంతే తప్ప అగ్రకుల, వర్గ ప్రయోజనాలను పునర్నిర్మించే అన్నా (అ)ధర్మాన్ని ఆదర్శంగా తీసుకోరాదు.
-సుదర్శన్ బాలబోయిన
కుమారస్వామి నాగం
వేణుగోపాల్‌డ్డి బండారి
(ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు