Showing posts with label సంగిశెట్టి శ్రీనివాస్. Show all posts
Showing posts with label సంగిశెట్టి శ్రీనివాస్. Show all posts

Tuesday, February 16, 2016

‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! By Sangishettey Srinivas

‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! 
15-02-2016 00:38:06

గుడిలోన మీపూజ గుడిబైట మాపూజ/ ఎన్నాళ్ళు! చేతుమో అన్నినాళ్ళు! /వూరిలో మీ బావి - వూరికావలిమాది/ ఎన్నాళ్ళు! వుండునో అన్నినాళ్ళు! / బడిలోన మీవారు -బడియెదుట మావారు / ఎన్నాళ్ళు! వుందురో అన్నినాళ్ళు! / నట్టింట మీతిండి -నడివీధిలో మాకు / ఎన్నాళ్ళు! పెడుదురో అన్నినాళ్ళు! / పోదు యీ అంటు జాఢ్యము పోదుపోదు / రాదు మతవర్గ రహిత సామ్రాజ్యమింక / పంచములతోడ బాంధవ్యముంచకున్న / హృదయ పరివర్తనంబు చేనొదవునన్న? అంటూ హైదరబాద్‌ కేంద్రంగా దళిత సాహిత్యోద్యమానికి దారులు వేసిన దార్శనికుడు శంకర్‌దేవ్‌. మొత్తం భారతదేశంలో ‘దళిత’ పదాన్ని సాహిత్య రంగంలో మొదటిసారిగా వాడింది కూడా ఈయనే! సమాజ పరంగా దళిత పదాన్ని ‘అంటరాని’ వారినుద్దేశించి ఫూలే, అంబేద్కర్‌లు చాలా ముందే వాడినప్పటికీ సాహిత్య రంగంలో ఆ పదాన్ని మొదట వాడింది హైదరాబాద్‌ సాహిత్యకారులే! ఇప్పటి వరకు సాహిత్య చరిత్రలో దళిత అనే పదాన్ని మొదటిసారిగా వాడింది 1958లో అని రికార్డయింది. ఈ పదం చాలా పాపులర్‌ అయింది మాత్రం 1972లో ‘దళిత్‌ పాంథర్స్‌’ రచనల మూలంగా అని చరిత్ర చెబుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకొని ‘దళిత’ చరిత్రను తిరగరాయాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొన్నట్లయితే 1954లోనే తొలిసారిగా సాహిత్యంలో ‘దళిత’ అనే పదం వాడింది హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి శంకరదేవ్‌ అని రుజువవుతుంది.
 
పాత హైదరాబాద్‌ రాజ్యంలోని బీదర్‌కు చెందిన శంకర్‌దేవ్‌ మొదటి నుంచి ఆర్యసమాజ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అందుకే పేరు చివర విద్యాలంకార్‌ అని కూడా పెట్టుకున్నాడు. బీదర్‌-హైదరాబాద్‌ కేంద్రంగా అస్పృశ్యతా నివారణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అటు సామాజిక, రాజకీయ రంగాలతో పాటు సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్రవేసిండు. బీదర్‌ నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖని నిర్వహించాడు. ఆ తర్వాత కర్నాటక-బీదర్‌ నుంచి మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయిండు. శంకరదేవ్‌ ఆర్యసమాజ్‌, ముఖ్యంగా కేశవరావు కోరట్కర్‌ ప్రభావంతో, గాంధీ/ అంబేద్కర్‌ స్ఫూర్తితో ‘దళిత సారస్వత పరిషత్తు’ని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ కేంద్రంగా ప్రారంభించారు. ఆ తర్వాత దీని కేంద్రకార్యాలయం దోమలగూడకు మారింది. ఈ సారస్వత పరిషత్తు వారు అంటరానితనాన్ని నిర్మూలించేందుకు సాహిత్యాన్ని వాహికగా చేసుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు ప్రచురించారు. ‘సేవక్‌’ పేరిట తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సామాజిక పక్షపత్రికను ప్రచురించారు. ఇక్కడ ‘దళిత’ పదం గురించి కొంచెం వివరణ అవసరం. నిజానికి దళిత అనే పదం మొదట్లో అణగారిన వర్గాలందరికీ వర్తించేది. అయితే అది రాను రాను భారత సమాజంలో ‘అంటరాని’ తనాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రమే పరిమితమైంది. మరాఠీ భాషలో దళిత అంటే బ్రోకెన్‌ లేదా విధ్వంసమైన. జ్యోతిరావు ఫూలే మొదట ఈ ‘దళిత’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, కుల వివక్షతకు గురవుతున్న అతిశూద్రులను ‘దళిత’ అనే పేరుతో ఫూలే గౌరవించాడు. (ఎలీనార్‌ జీలియట్‌, 1992). ఆ తర్వాత 1888లో ఫూలే కాలంలోనే ఆయన అనుయాయి, సత్యశోధక్‌ సమాజ్‌లో చురుకైన నాయకుడు మహర్‌ కులానికి చెందిన గోపాల్‌ బాబా వాలంగ్‌కర్‌ ‘దళిత’ అనే పదాన్ని ఇప్పుడున్న అర్థంలో వాడాడు. ‘అనార్య దోష్‌ పరిహారక్‌ మండల్‌’ తరపున మహర్‌, చమార్‌లను సంఘటితం చేసి వర్ణవివక్షతకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఈ పదాన్ని ఉపయోగించాడు. (ఫిలిప్‌ కానిస్టేబుల్‌; 1997) The term dalit in Sanskrit is both a noun and an adjective. As a noun, dalit may be used for all three genders, masculine, feminine, and neuter. It has been derived from the root dal which means to crack, open, and split, and so on. When used as a noun or adjective, it means burst, split, broken or torn asunder, downtrodden, scattered, crushed, destroyed. (Massey; 1995) ‘దళిత’ అంటే ‘చెల్లా చెదురు’, ‘ఛిన్నాభిన్నం’, ‘నాశనమైన’, ‘ధ్వంసమైన’, ‘నలిగిన’, ‘అణగారిన’ ‘పీడిత’ అనే అర్థాలున్నాయని వామన్‌ శివరామ్‌ ఆప్టే తన 'The practical Sanskrit - English Dictionary' నిఘంటువులో చెప్పిండు. సాహిత్య రంగంలో మొట్టమొదటి సారిగా 1958లో బొంబాయి (ముంబయి)లో జరిగిన మహారాష్ట్ర దళిత సాహిత్య సంఘం సమావేశాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. 'To me, Dalit is not a caste. He is a man exploited by the social and economic traditions of this country. He does not believe in God, Rebirth, Soul, Holy Books teaching separatism, Fate and Heaven because they have made him a slave. He does believe in humanism. Dalit is a symbol of change and revolution’ (quoted in N.R. Inamdar. Contem-porary India, Poona, 1982). 1930వ దశకం నుంచి ‘దళిత’ పదాన్ని అంబేద్కర్‌ సామాజికంగా అణచివేతకు, అస్పృశ్యతకు గురైన వారికి ఉపయోగించడమే గాకుండా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఏది ఎట్లున్నా 1970వ దశకంలో మరాఠీలో ‘దళిత్‌ పాంథర్‌’ వుద్యమంతోనే ఈ పదం విస్తృతమయింది. ఈ వుద్యమ ప్రభావంతో మరాఠీలో చాలా సాహిత్యం వెలువడింది. 1972లో రాజా ధలేతో కలిసి నామ్‌దేవ్‌ దస్సాల్‌ దళిత్‌ పాంథర్స్‌ ని స్థాపించాడు. మిలిటెంట్‌గా నడిచిన ఈ సంస్థకు అమెరికన్‌ ‘బ్లాక్‌ పాంథర్స్‌’ స్ఫూర్తి. బాబూరావ్‌ బగుల్‌, శంకర్‌రావు కారత్‌ రాసిన కథలు తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలిచాయి. దయాపవార్‌, త్రయంబక్‌ సప్కలేలు ఎంతో దళిత కవిత్వాన్ని సృజించారు. వీరి రచనలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడ్డాయి, మెప్పుని పొందాయి. (జీలియట్‌, ఇంట్రొడక్షన్‌ టు దళిత్‌ పొయెట్రీ; 1982). దళిత్‌ పాంథర్స్‌లో మహిళలు కూడా ఉన్నారు. హీరా బానిసోడ్‌, జ్యోతి లంగేవార్‌, కుముద్‌ పావడేలు ఇందులో ప్రముఖులు. (చల్లపల్లి స్వరూపరాణి, ఇపిడబ్ల్యు- ఏప్రిల్‌ 25- మే 31- 1998)
 
దళితులు అనే పదం ఒక కులానికి పరిమితమైన పేరు కాదు. అది ఒక సమూహం యొక్క అస్తిత్వం. వేలయేండ్లుగా అవమానానికి, హేళనకు గురైన పదాల స్థానంలో తమ ఆత్మగౌరవాన్ని సాధించుకునేందుకు, కాపాడుకునేందుకు ‘దళిత’ అనే పదాన్ని సమాజంలో అణచివేత, హింసను అనుభవించిన వారు ముందుకు తీసుకొచ్చిన పదమిది. దళిత్‌పాంథర్స్‌కు మార్గదర్శి, మరఠ్వాడా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గంగాధర్‌ పంత్వానే దళిత పదాన్ని ఇలా నిర్వచించాడు. ‘‘దళిత అనేది కులం కాదు. సామాజికంగా, ఆర్థికంగా, సంప్రదాయాల పేరిట అణచివేతకు గురైనవాడు. వాడు దేవుడు, పునర్జన్మ, ఆత్మ, విభజన వాదాన్ని ప్రేరేపించే గ్రంథాల్ని నమ్మడు. కర్మ, స్వర్గం అనే వాటిని కూడా నమ్మడు ఎందుకంటే ఈ నమ్మకాలన్నీ అతణ్ణి బానిసగా తయారు చేశాయి. అతడు మానవత్వాన్ని నమ్ముతాడు. దళిత అంటేనే మార్పుకు, విప్లవానికి ప్రతీక’’. ఈ విషయాన్ని జీలియట్‌(2001)కు రాసిన లేఖలో పంత్వానే వివరించాడు.
 
నిజానికి ‘దళితులు’ అనే పదాన్ని వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు, గిరిజనులు, షెడ్యూల్డ్‌ కులాల వారు ఇంకా చెప్పాలంటే కుల పరంగా పీడన, అణచివేతను, వివక్షతను, హేళనను ఎదుర్కుంటున్న వారందరికీ కలిపి ఈ పదాన్ని గతంలో వాడిండ్రు. మహారాష్ట్రలోని ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లోని ‘దళిత మహాసభ’, ఇంటర్నేషనల్‌ దళిత్‌ సాలిడారిటీ నెట్‌వర్క్‌, ‘దళిత్‌’ మానవ హక్కులు తదితర సంఘాలు, సంస్థలు ‘దళిత’ పదాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టాయి.
 
సాహిత్యంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ‘దళిత’ పదం వాడుక 1954లో వాడడం జరిగింది. అదీ తెలుగులో! హైదరాబాద్‌కు చెందిన శంకరదేవ్‌ అనే ఆర్యసమాజీయుడు ‘హరిజన శంఖారావం’ పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకం ‘దళిత సారస్వత పరిషత్తు’ తరపున వెలువడింది. ఈ పరిషత్తు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి పనిచేసింది. ఈ పుస్తకానికి శంకరదేవ్‌ ముందు మాటలో కూడా ‘దళిత’ అనే పదాన్ని వాడిండు. ‘‘ఈ కాలములో దళితులను సంఘటిత పర్చుట, సరియైన మార్గంలో నడుపుట, చాలినంత రాజకీయ విజ్ఞత చేకూర్చట నేటి సంఘనాయకుల ధర్మంగా వున్న కారణంతో ఈ చిన్న పుస్తకం ‘హరిజన శంఖారావం’ పేరుతో ప్రచురించడమైనది. పుస్తకము చిన్నదిగాను, శైలి సులభముగాను గ్రామీణ ప్రజానీకానికి చక్కగా అర్థమయ్యేటట్లు వ్రాయడమైనది. కాలము మారిపోగా, రాజకీయ సాధనాలకు ఈ దళితులను విభిన్న రాజకీయ పార్టీలు తమతమ కొరముట్లుగా వాడుకోదలచిన అదనులో, ఈ పుస్తకము హరిజనులకు, కనువిప్పుముగా ప్రకటించబడినది. (శంకరదేవ్‌;1954). 1950వ దశకం నాటికే దళితులను వివిధ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నదనే అవగాహనతో ఈ పుస్తకం రాయడమైంది. ఈ పుస్తకంలో దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేర్కొంటూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగంలో దళితుల మేలుకోసం చేసిన చట్టాలను పేర్కొన్నారు. ‘‘సకల మానవకోటి సరి సమానత్వాన్ని, శంఖారవంబుతో చాటండి చాటండి!’’ అంటూ పిలుపునిచ్చాడు. ‘జాతి అభిమానానికై, జాతి ఉద్ధారణ కొరకు, ఎవరి రక్త నాళాలు ఉబుకుతున్నాయో, ఎవరి హృదయాల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్నాయో, అట్టి హరిజన యువకులకే యీ హితవులు, హెచ్చరికలు, ఉద్భోధలు’’ అంటూ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం నినదించాలన్నారు.
 
తే.గీ// నేను స్వేచ్ఛా విహారిని, లేని పోని/ బంధనములకు లోనగు వాడగాను /గగన మార్గాన నెగయం గలను భూమి / గర్భమును చీల్చుకొనిపోవ గలను నేను - అని తాను నినదిస్తూ తన తోటి వారందరిచేత అనిపించాడు. ఇంకా నిద్రావస్థలో ఉన్నట్లయితే నష్టం జరుగుతుందని హెచ్చరించిండు. మనలో అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ లాంటి గొప్పవాళ్ళున్నారు. అవకాశం దక్కినట్లయితే అనేక మంది అలాంటి మహనీయులు తయారవుతారు. అది మీరే కావచ్చు అని దళితులను చైతన్యవంతుల్ని చేసేందుకు రాసిన ఈ వ్యాస సంకలనంలో అక్కడక్కడా పద్యాలు కూడా ఉన్నాయి. ‘నిలవండి నిలవండి,నిలచి పోరాడండి/ పారిపోతే పిరికి పందలంటారోయి/గెలవండి యిక ముందు గెలుపు మీదేనండి/పిలవండి నోరెత్తి దళిత జాతులనెల్ల/ కలసి, సంఘీభావబల పరాక్రమముతో (నిల)
 
‘మీకు విద్యాబుద్ధి లభియించునందాక/ మీ బానిసత్వాలు మాయమౌనందాక/ మీయిళ్ళు వాకిళ్ళు స్వవనీయమగుదాక/ మీ వెట్టి చాకిరీ మిము బాయునందాక/నిలవండి బలముతో నిలచి పోరాడండి’ - అని పాటలు రాసి ప్రచారం చేసిండు. దళితుల్లో ఐకమత్యావశ్యకతను విడమర్చి చెప్పిండు. ‘ఇంకోసారి మీకు హెచ్చరిస్తున్నాను. అది ఐకమత్యం. మీయింటిలోని చెత్తాచెదారాన్ని ఊడ్చే చీపురు సంగతి మీరెప్పుడైన విచారించారా? చీపురుకట్టలోని ఒక్క పుడకను విడదీసి, దానితో మీ యిల్లు ఊడిచచూడండి- వ్యర్థము. చెత్త ఎక్కడిదక్కడనే ఉంటుంది. సరే అనేక పుడకలను ఏకముగా చేర్చి ఊడ్చి చూడండి. మీ యిల్లు ఈషణ్మాత్రాన శుభ్రమైపోతుంది’’. దళితులకుపయోగ పడు చట్టాలు, ఆయా చట్టాల్లో వచ్చిన మార్పులు, భూమిపట్టాలు, ఉద్యోగాల్లో దళితులకు అమలవుతున్న రిజర్వేషన్లు, విద్యా రంగంలో ఉపయోగించుకోవాల్సిన వనరులు తదితర విషయాల్ని ఇందులో చెప్పిండు. మద్యపాన నిరోధ ప్రాధాన్యత కూడా విశదీకరించిండు. ప్రభుత్వం తరపున సీ్త్రలకు లభించాల్సిన వసతులు, ఆస్పత్రి సౌకర్యాలు, అధికారాలు, వారి ప్రస్తుత స్థితిగతులు కూడా శంకర్‌దేవ్‌ చర్చకు పెట్టిండు. ‘హైద్రాబాదు రాష్ట్రములోని ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామములో దళితజాతికి సంబంధించిన రచనలు, గేయాలు, హరికథలు, బుఱ్ఱకథలు, నాటకాలు విరివిగా తయారు అవుతున్నాయి. మీలో వ్రాయగలిగిన వారుంటే, వ్రాయండి. దళిత సారస్వతాన్ని పెంపొందించండి. కవులు, గాయకులు, నటకులు, మీలో ఉంటే బయటికి రండి. మీకు చేయూత దొరుకును. ‘‘లెండోయి, లెండోయి, లెండోయి, లెండోయి/ దండు లేచిపోయే లెండోయి లెండోయి/ తేరు తరలిపోయే లెండోయి లెండోయి/ తెల్లవారిందాక, తెలివొంది లేవండి!!’’
 
‘‘మీ యిల్లు మీ వాడ మీ జీవితాలన్ని/ కూలి కుమిలిపోయే, గేళిపాలైపోయే/ కూడు గుడ్డలు లేక పాడైన గతమేమి/ గాఢనిద్రావస్త కప్పుకొన్నదిగాన, లెండోయి’’ ‘‘తూర్పు కొండలపైని సూర్యడుదయించాడు/ మారిపోతుంది భూమండలంబేకమై/ కులములు, గోత్రాలు, కలుములు, లేములు/ తలక్రిందులై విప్లవాలు దొరలెను గాన. లెండోయి’’ అంటూ పాటల ద్వారా చైతన్య పరిచిండు. దండు అనే పదాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చిండు. ఆంగ్లములో ‘దళిత్‌ లిటరేచర్‌ సొసైటీ’గా పిలువబడ్డ ఈ సంస్థ మేనేజర్‌గా శాసనసభ్యులు కళ్యాణరావు నిన్నే వ్యవహరించారు. మొదట పదివేల కాపీలతో ఈ పుస్తకాన్ని బాగ్‌లింగంపల్లి(హైదరాబాద్‌)లోని సుధాన ప్రింటరీ వాళ్ళు ముద్రించారు. ‘అమర సందేశం పేరిట’ గాంధీ ముఖచిత్రంతో రెండో పుస్తకాన్ని శంకర్‌దేవ్‌ హిందీలో రాసిండు. దీన్ని తెలుగులోకి సి.ఐ. అడ్రూస్‌, యం.జె.త్యాగరాజు అనే జంటకవులు అనువదించారు. ఈ వ్యాస సంపుటి 1955లో ప్రచురితమయింది. ఇందులో మొత్తం ఏడు వ్యాసాలుంటే ప్రతి వ్యాసం చివరలో అద్భుతమైన పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ముందుమాట రాస్తూ ‘‘.. దళిత సారస్వత పరిషత్తు ప్రచురణలు, సామాజిక చైతన్యతకు ఎంతయు వుపయుక్త పడతాయని, దళిత సారస్వత ప్రియులు మరీ మరీ యిట్టి గ్రంథాలు ప్రజానీకానికి అందించగలరని, తద్వారా సాంఘిక సమత సాధించగలరని నమ్ముచు ఈ గ్రంథాన్ని చదువరులకు సన్నిహిత పరుస్తున్నాను’’. ఈ పుస్తకం గురించి ‘మా రెండో పుష్పం’ పేరిట జంటకవులు ఇలా పేర్కొన్నారు. ‘‘ప్రకృతిలో ఏ ఫలమైనా ఆలస్యంగా లభ్యమౌతుంది. మా దళిత సారస్వత వనం లో పలురకాల భాష ఫల మహీరుహాల నాటు పెట్టితిమి. ఇప్పుడిపుడే తోట కాతకు మరలింది. ప్రపథమంగా మా తోటనుండి ‘హరిజన శంఖారవాన్ని’ అనేక ప్రాంతాలకుఎగుమతి చేసి వున్నాము. ప్రథమఫలం రుచితనానికి చదువందితలు యీ తోట ఫలాలనే యపేక్షిస్తున్న కారణంచేత యీ రెండో పుష్పాన్ని మీ చేతి కందిస్తువున్నాం’’. ‘పొలమున ధాన్యరాసుల బండ్లకెత్తించి/ తమవిగాతని వొందు దళిత ప్రజలు/బానెడు జున్నుపాలను బిండి మీదుచె/ తలదాల్చి కొనితెచ్చు దళిత ప్రజలు/ తనువును దేశ స్వాతంత్య్రతకై యర్పి/ తము సేయ పరుగిడు దళిత ప్రజలు/ రాజకీయా చదరంగ రంగపు పాచి/ కల రీతి వర్తించు దళిత ప్రజలు/ నిలువనీడలేక నీడలు కల్పించు/ తనకు లేని దానధర్మమిడును/ తిండిలేని వాని తినమంద్రుపస్తుండె/ దళితజాతికన్న లలితులెవరు?’ అంటూ ప్రశంసించాడు. 1955 నాటికే ఈ సారస్వత పరిషత్‌ తరపున తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పుస్తకాలు ప్రచురించారు. అవి. 1. హరిజన శంఖారవం (తెలుగు), 2. హరిజన సంఘాల మాన్యువల్‌ (హిందీ), దళిత జాతీయ సంఘం దాని కర్తవ్యం (తెలుగు), 3. వాట్‌ అండ్‌ వై (ఇంగ్లీషు), అస్పృశ్యతా నివారణపై కరపత్రాలు, పోస్టర్లు (తెలుగు). వీటితో పాటు త్వరలో అచ్చుకానున్నవి పేరిట దళిత ప్రశ్నోత్తర చంద్రిక (తెలుగు), చిరంజీవి మనువుగానికి తాత (తెలుగు), హరిజన్‌ టుడే అండ్‌ టుమారో (ఇంగ్లీషు), నాటికలు, బుర్రకథలు, నాటకాలు తయారీలో ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈ పుస్తకాల్లోని పద్యాలు, దళిత పదం గురించి ఇంతవరకు తెలుగు సాహిత్యంలో సరైన స్థానం దక్కలేదు. తగినంత చర్చ కూడా జరగలేదు. మరుగున పడ్డ తెలంగాణ, తెలుగు సాహిత్య చరిత్ర ముఖ్యంగా విస్మరణకు గురైన దళిత సాహిత్య చరిత్రను రికార్డు చేసుకోవడం ఈనాటి అవసరం. హైదరాబాద్‌ కేంద్రంగా 1956కు పూర్వం అనేక దళిత రచనలు వెలువడ్డాయి. కాని వాటికి తెలుగు సాహిత్య చరిత్రలో సరైన స్థానం దక్కలేదు. మల్లెల దావీదు రాసిన ‘అస్పృశ్యత’ కావ్యం మాదిగ మహనీయుడు ముదిగొండ లక్ష్మయ్యకు అంకితమీయబడింది. ‘అస్పృశ్యత’ అంశం మీద వెలువడ్డ ఈ కావ్యం గురించీ, రాజకీయ రంగంలో ఉంటూ, అచలబోధ చేస్తూ సమాజంలో రావాల్సిన మార్పుల్ని పేర్కొంటూ అరిగె రామస్వామి అనేక పద్యాలు రాసిండు. వీటన్నింటితోబాటు భాగ్యరెడ్డి వర్మ సంపాదకీయాలు, వ్యాసాలు, రచనలు కూడా పుస్తకాలుగా/పునర్ముద్రణ కావాల్సిన అవసరముంది. అప్పుడే తెలంగాణ లేదా తెలుగు దళిత సాహిత్యంపై సాధికారికంగా మాట్లాడ్డానికి వీలవుతుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.
 
- సంగిశెట్టి శ్రీనివాస్‌
9849220321
Andhra Jyothi Telugu News Paper Dated: 15/02/2016 

Monday, May 21, 2012

దళితోద్యమ వేగుచుక్క---సంగిశెట్టి శ్రీనివాసు



భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు వేసిండు. ఇదే 1913 నాటికి మాన్యసంఘంగా మారింది. అంబేద్కర్ కన్నా ముందు భారతదేశం గర్వించతగ్గ దళిత నాయకుడు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగే సభలకు ముఖ్యఅతిథిగా హాజరై తన ఉపన్యాసాల ద్వారా దళితోద్యమ కార్యకర్తలను చైతన్య పరిచిండు. భారతదేశంతో పాటు ఆంధ్రవూపాంతంలో కూడా దళితోద్యమాలకు దారులు వేసిండు. వినూత్న రీతిలో ఆయన తీసుకొచ్చిన చెతన్యం భవిష్యత్తరాలను తీర్చిదిద్దింది. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి, నిర్వహించాడు. భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికలకు సంపాదకత్వం వహించి అనేక రచనలు చేసిండు. 1911లో దేవదాసీ (జోగిని) నిర్మూలన సంఘాన్ని, 1912లో స్వస్తిదళ్ స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటుచేసి ప్రజాహిత కార్యక్షికమాలు చేపట్టిండు. రెడ్‌క్రాస్ సొసైటీ మాదిరిగా నడిచిన ఈ సంస్థ హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అనా థ శవాలను తొలగించి, నగరాన్ని పరిశువూభంగా ఉంచినందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించిం ది. సేవా పతకాలను అందజేసింది.

అనేక సంస్థలు స్థాపించి ఇటు అనంతపురం నుంచి అటు అమలాపురం వర కు, లక్నో నుంచి ఔరంగాబాద్ వరకు (హైదరాబాద్, తెలంగాణ సరేసరి) ఆయన అనేక సభల్లో సభాధ్యక్షుడిగా, ముఖ్యఅతిథిగా హాజరయ్యిండు. ఆయన విజయవాడ వస్తుండని తెలియడంతో దళితులు బలవంతంగా ఎక్కడ దుర్గ గుడిలో ప్రవేశిస్తారో అన్న భయంతో పూజారులు గుడిని మూసేశారంటే ఆయన ప్రభావం అర్థమవుతుంది. అంతెందుకు ఉన్నవ లక్ష్మినారాయణ రాసిన మాలపల్లి నవలకు స్ఫూర్తి భాగ్యడ్డి వర్మ. అందులో హీరో భాగ్యడ్డి వర్మే. తాము పంచములం కాము ఈ దేశ మూలవాసులం, ఆదిహిందువులం (మతానికి సంబంధం లేదు) అని నినదించిండు. విజయవాడలో మొదట పంచమ మహాసభ అని ప్రారంభించి సాయంవూతానికి అది ఆదిహిందూ మహా జనసభగా మారేలా చేసిండు. ఈ విజయవాడ సభనే మొత్తం తెలుగునాట దళిత చెతన్యానికి పునాదులు వేసింది. 

ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ అంతటిలో మొట్టమొదటిసారిగా దళితుల సంఘటిత సమావేశం 1917 నవంబర్ 4,5,6 తేదీల్లో విజయవాడలో జరిగింది. ఈ సభకు ఆంధ్రవూపాంతంలోని అన్ని జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి హైదరాబాద్ నుంచి వచ్చిన భాగ్యడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఇందులో భాగ్యడ్డి వర్మతో పాటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలకు చెందిన దళిత కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మొదట ఈ సభను ప్రథమ ప్రాంతీయ పంచమ మహాసభ పేరిట విజయవాడ టౌన్ హాల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయ వాదుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు టౌన్‌హాల్‌లో సభను నిర్వహించడానికి అనుమతి నిరాకరించారు. దీంతో మైలవరం రాజాకు చెందిన డ్రామా హాల్‌లో సభ జరుపుకున్నారు. అయితే సాయంత్రం అయ్యే సరికి తాము పంచములం కాము ఆది హిందువులం ‘ఈదేశ మూలవాసులం అని ఉద్ఘాటిస్తూ సమావేశం పేరును ప్రథమ ఆది హిందూ మహాజన సభ పేరిట జరుపుకున్నారు. అందుకు ప్రధాన కారణం భాగ్యడ్డి వర్మ తన ప్రసంగంలో పంచములు అని ఏ శాస్త్రంలోనూ లేదు. ఆత్మన్యూనతతో కాదు మనం ఈ దేశ మూలవాసులుగా ఆత్మగౌరవంతో బతకాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు సభలో ఒక తీర్మానం కూడా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని గౌరవిస్తూ పంచమ పదాన్ని తొలగిస్తూ 25 మార్చి 1922లో 817 జీవోను విడుదల చేసింది. ఈ సమావేశంలో ఆదిహిందువులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. దళిత విద్యార్థులకు అందరితోపాటు చదువుకునే అవకాశం కల్పించాలని, మాల, మాదిగ పల్లెల్లోనే పాఠశాలలను ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కూడా తీర్మానాలు చేశారు. 

ఈ చారివూతాత్మక సభ ఏర్పాటుకు గూడూరు రామచంవూదరావు, చుండ్రు వెంకయ్య తదితరులు పూనుకున్నారు. ఈ సమావేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా పిప్పరకు చెందిన మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్ధ భారతం పుస్తకం విడుదల చేశారు. ఈ సమావేశం తెలుగునేలపై దళితోద్యమాలపై వేసిన ప్రభావం అత్యంత ప్రభావశీలమైనది. మూడ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగ్గా ఆ మూడు రోజులు విజయవాడలోని దుర్గ గుడి తలుపులు మూసి ఉంచారు. సమావేశానికి హాజరైన దళితులు దుర్గగుడిలోకి చొచ్చుకువచ్చే అవకాశం ఉందని ఏకంగా గుడినే మూసేశారు. ఈ సమావేశం వల్ల ప్రభావితుడెన ఉన్నవ లక్ష్మినారాయణ మాలపల్లి నవల రాసిండు. ఈనవల్లో హీరో భాగ్యడ్డి వర్మే. అలాగే కుసుమ ధర్మన్న (1900‘1946) కూడా మా కొద్ది నల్లదొరతనము అనే కవితా పుస్తకాన్ని 1921లో అచ్చేశాడు. విజయవాడ సభ స్ఫూర్తితో వరుసగా ఆంధ్రవూపాంతంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి. 

ఒక వైపు నిరంతరం సభలు సమావేశాలు అంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూనే తాను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లోని దళిత బస్తీల్లో మద్యపానం వల్ల కలిగే నష్టాలను బు‘రకథలు, హరికథల ద్వారా ప్రచారం చేసేవాడు. ఈ నాటకం చూడ్డానికి వచ్చే ప్రేక్షకులకు వాటి ప్రదర్శన కన్నా ముందూ తన ఉపన్యాసాల ద్వారా వారిలో చెతన్యం తీసుకురావడానికి ప్రయత్నించేవాడు. బస్తీల్లోని ప్రజల్లో తాగుడు మాన్పించేందుకు ఆయన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి సఫలీకృతుడయ్యాడు. రోజూ ఎక్కడో ఒక దగ్గర బస్తీల్లోని కూలీలు పని చేసుకునేవారు. ఐదారు కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రతి కుటుంబం రోజూ తమకు వచ్చే ఆరణాల కూలీలో ఒక అణా మాకు చందాగా ఇవ్వాలని కోరాడు. కూలీలు మొదట కొంత తటపటాయించినా భాగ్యడ్డి వర్మ వారిని ఒప్పించి తలా ఒక అణా పైసని వారి నుంచి వసూలు చేసిండు. ఇలా నెల రోజులు వరుసగా వసూలు చేసి ఆ డబ్బుతో 31వ రోజు ఒక తులం బంగారం కొని వాటితో పుస్తెలు చేయించి చిన్న సమావేశం ఏర్పాటు చేసి అందులో తాళి కట్టించేవాడు. దీంతో అణా పైసలు తక్కువ కావడంతో వారు ఆమేరకు కల్లు, సారాయి తాగడం మానేయడమే గాకుండా నెల రోజు ల తర్వాత తులం బంగారం దక్కించుకుండ్రు. ఇలాంటి కార్యక్షికమాలు భాగ్యడ్డి వర్మ హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని అనేక బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిండు. 

దళితుల అవస్థలకు అవిద్యే ప్రధాన కారణమని భావించి విద్యారంగంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేసిండు. హైదరాబాద్‌లోని గణేశ్‌మల్ సింఘ్వీ, వామన నాయక్ లాం టి వితరణ శీలుర ప్రోత్సాహంతో తానే వివి ధ ప్రదేశా ల్లో దళిత బాల, బాలికల కోసం పాఠశాలలు నెలకొల్పిండు. ఈ దశలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు వాటిని సవ్యంగా నడిపించే షరతుమీద పాఠశాలల నిర్వహణ బాధ్యతను భాగ్యడ్డి వర్మ నిజాం ప్రభుత్వానికి అప్పజెప్పిండు. ఆ పాఠశాలలే పష్తక్వామ్ పాఠశాలలుగా ప్రసిద్ధి. భాగ్యడ్డి వర్మ ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్ అన్నింట్లో పాలు పంచుకొని అవి ఏవి దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి చివరికి బుద్ధిజం పట్ల మక్కువ చూపిండు. దాన్నే ఆచరించిండు. ప్రతి యేటా పెద్ద ఎత్తున బుద్ధ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించేవాడు. చివరికి తన కొడుక్కు గౌతమ్ అని పేరు పెట్టుకుండు. 

తెలుగునాట దళితోద్యమానికి దారులు వేసి వేగుచుక్కై వెలిగిన భాగ్యడ్డి వర్మ గురించి ఏ తరగతి పాఠ్యపుస్తకంలోనూ సమాచారం లేదు. ఆంధ్రవూపాంతంలో డజనుకు పైగా వార్షిక సభలకు అధ్యక్షుడుగా హాజరై అనేకమంది అనుచరుల్ని సంపాదించికున్నాడు. అయినప్పటికీ అటు ఆంధ్రవూపాంతంలోనూ, ఇటు హైదరాబాద్‌లోనూ ఒక్క విగ్రహమూ లేదు. వచ్చే సంవత్సరం భాగ్యడ్డి వర్మ 125వ జయంతి. ఆ సందర్భంగానెనా దళితులు, సామాజిక కార్యకర్తలు పూనుకొని ఆయనపై పోస్టల్ స్టాంప్ వచ్చే విధంగా, ట్యాంక్‌బండ్‌తో పాటు హైదరాబాద్‌లోని కూడలి ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని నిలబెట్టాలి. అంతేగాదు అందుబాటులో లేకుండాపోయిన ఆయన నడిపిన పత్రికలు భాగ్యనగర్, ఆదిహిందూలను సేకరించి వాటిల్లోని ఆయన రచనలను సంకలనాలుగా అచ్చేయించాల్సిన అవసరముంది. ఇదే ఆ మహానాయకుడికి మనమిచ్చే నివాళి.


సంగిశెట్టి శ్రీనివాసు 

నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ 22/05/2012 

Saturday, February 25, 2012

నడిచే హైదరాబాద్ సర్వస్వం ఖాలిది -సంగిశెట్టి శ్రీనివాస్


గుండెల నిండా హైదరాబాద్ ఆర్తిని, ఆత్మీయతను నింపుకున్న నిరంతర పరిశోధకుడు, రచయిత, పౌర హక్కుల కార్యకర్త, హైదరాబాద్-తెలంగాణ చరిత్ర, సంస్కృతి, మైత్రిని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పిన ఉమర్ ఖాలిది లేని లోటు తీర్చలేనిది. ఖాలిది హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీని స్థాపించి హైదరాబాద్ చరిత్రపై అమూల్యమైన పుస్తకాల్ని ప్రచురించాడు. వృత్తిపరంగా అమెరికాలోని మాసాచూసెట్స్ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పనిచేస్తోన్న ఖాలిది హైదరాబాద్ చరిత్రపై, భారతదేశంలో పోలీసు వ్యవస్థపై, ముస్లిం ఆర్థిక సామాజిక పరిస్థితులపై, 'హైదరాబాద్‌పై పోలీసు చర్య'పై అద్భుతమైన గ్రంథాలు వెలువరించాడు.

హైదరాబాద్ చరిత్రపై కొన్ని వందల వ్యాసాలు వివిధ సందర్భాల్లో వెలువరించాడు. హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? మొదట ఆ ప్రాంతం ఎలా ఉండేది, ఆ ప్రాంతంలో మొదట్లో వ్యాపారాలు నిర్వహించిన ఆబిద్, ఆ తర్వాత లండన్‌లో స్థిరపడిన వివరాలు, ఇలా హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన చరిత్ర ఆయన రచనల్లో ఉన్నాయి.

శ్రీకృష్ణ కమిటీ సభ్యుడైన అబుసలే షరీఫ్ సైతం ఖాలిది గురించి రాస్తూ నాకు మంచి 'మిత్రుడు, దార్శనికుడు, ఫిలాసఫర్' అని చెప్పాడంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది. పౌరహక్కుల కోసం నిరంతరం తపిస్తూ, హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిని చిత్రికగడుతూ 24కు పైగా పుస్తకాలు వెలువరించాడు. 1981లో తాను సౌదీలో పనిచేస్తున్న కాలంలో హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీని స్థాపించి దాని ద్వారా 'ద బ్రిటీష్ రెసిడెంట్స్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ ది నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్' పేరిట హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన కిర్క్ పాట్రిక్, కెప్టెన్ సీదెన్‌హామ్ మొదలుకొని బ్రిటిష్ రెసిడెంట్లుగా పనిచేసిన వారి చరిత్రను, హైదరాబాద్ పట్ల వారి వైఖరిని అందులో ఆయన వివరించాడు. హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీ ద్వారా మొత్తం నాలుగు విలువైన పుస్తకాలు ప్రచురించాడు.

ఇందులో పైన పేర్కొన్న పుస్తకంతో పాటు 1296-1724 మధ్య కాలంలో దక్కన్‌లో సుల్తానుల పాలనపై వచ్చిన రచనల బిబ్లియోగ్రఫీ, 1724-1948 మధ్యలో హైదరాబాద్‌లో నిజామ్‌ల పాలనపై వచ్చిన రచనల బిబ్లియోగ్రఫీని కూడా వెలువరించాడు. అలాగే హైదరాబాద్‌పై పోలీసు చర్య సందర్భంగా జరిగిన దమనకాండపై వివిధ స్కాలర్ల చేత వ్యాసాలు రాయించడమే గాకుండా తాను ఆ పుస్తకానికి సంపాదకత్వం వహించాడు. హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీ తరఫున వెలువడ్డ ఈ పుస్తకంలో హైదరాబాద్‌పై పోలీసు చర్య సందర్భంగా ముస్లింల ఊచకోతకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి పుస్తకం లో అచ్చేశాడు. 

40 ఏండ్లుగా అందరూ మరిచిపోయిన ఒక సంఘటనను వెలుగులోకి తెచ్చి చర్చకు పెట్టిన ఘనత ఖాలిదిదే. ఈ అంశంపై గత ఆరేళ్లుగా తెలుగు పత్రికల్లో విస్తృ తంగా చర్చ జరుగుతోంది (దీనిని తెలుగులో మొట్టమొదటిసారిగా 'ముల్కి' ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక చర్చకు పెట్టింది). సమైక్యాంధ్ర నుంచి విడిపోతేనే హైదరాబాద్, తెలంగాణ చరిత్రకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడేవాడు. గోల్కొండ చుట్టూ గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించాడు. పరాయి పాలన వల్ల హైదరాబాద్‌కుఅంతా నష్టమే జరిగిందని, ముఖ్యంగా ఉర్దూ భాషకు, ముస్లిం ఉద్యోగార్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన తన అభిప్రాయాల్ని పంచుకునేవాడు. తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో రచనలు కూడా చేయతగ్గ ప్రతిభ ఉన్న ఖాలిది కొన్ని వేల పుస్తకాల సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆయన తెలుగులో కూడా ఇస్లాం రచనల బిబ్లియోగ్రఫీని వెలువరించాడు.

గతంలో ఈ బిబ్లియోగ్రఫీకి సంబంధించిన ఒక అసమగ్ర కాపీని నాకు ఇస్తూ దీన్ని సమగ్రం చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన పనిచేసేది అమెరికాలోనే అయినా ప్రతి సంవత్సరం కనీసం ఒక్క సారి అయినా హైదరాబాద్‌ని సందర్శించి విలువైన, పాత, అరుదైన పుస్తకాలు సేకరించేవాడు. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఏదో ఒక పాత పుస్తకం 'గిఫ్ట్'గా ఇవ్వడం ఆయనకు అలవాటుగా ఉండేది. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయంపై వెలువరించిన ఫోటో అల్బమ్‌ని కూడా ఆయన నాకు ఇచ్చారు. ముస్లిం హక్కుల ఉద్యమానికి అండగా నిలిచి అందుకు ఊతం ఇచ్చే ఎన్నో పుస్తకాలను, వ్యాసాలను ఆయన వెలువరించారు.

'ముస్లిమ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ' పేరిట ఆయన రాసిన పుస్తకం మేధావుల మన్ననలు అందుకుంది. 2003లో దేశంలో జరిగిన మతకలహాలను దృష్టిలో ఉంచుకొని 'ఖాకీ అండ్ ఎత్నిక్ వయొలెన్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ' అనే పుస్తకాన్ని రాశాడు. దీంట్లో పోలీసులు, సాయుధ బలగాలు ఎలా పక్షపాతంతో వ్యవహరించింది ఎత్తి చూపించాడు. ఈ పుస్తకంలోని వివరాలు రాజేందర్ సచార్ కమిటీకి స్ఫూర్తినిచ్చాయి. అందుకే రాజేందర్ సచార్ కమిటీ మతాలవారీగా సాయుధ బలగాల గణన చేసింది. సాధ్వి రితంబరకు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ప్రసంగించడానికి అనుమతివ్వడానికి వ్యతిరేకంగా ఉద్యమమే చేశాడు. అమెరికాలో ముస్లిం సంస్థల నిర్వహణలో ఖాలిది చేసిన కృషి మరువలేనిది. భారత సంతతికి చెందిన అమెరికా ముస్లింల సమాఖ్య, ఇండియన్ ముస్లిం చారిటీస్, ఇండియన్ ముస్లిం కౌన్సిల్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ముస్లిం సంస్థల నిర్వహణలో ఖాలిది కీలక పాత్ర పోషించాడు.

ఖాలిది ప్రాథమిక విద్య మదరాసె-ఆలియా స్కూల్‌లో చదివాడు. తర్వాత చరిత్ర ప్రధానాంశంగా కన్సాస్‌లోని విచిటా స్టేట్ యూనివర్సిటీ నుంచి బి.ఎ. చదివిన ఖాలిది ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ లో ఎఎల్ఎం కోర్సుని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్- లాంప్‌టర్ బ్రిటన్ నుంచి పిహెచ్‌డి చేశాడు. ఉమర్ ఖాలిది తండ్రి అబునాసర్ మహమ్మ ద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన ఇస్లామిక్ స్టడీస్, ఉర్దూ సాహిత్యంలో దిట్ట. తండ్రి నుంచి ఉమర్‌కు ఉర్దూ, చరిత్ర పట్ల ఆసక్తి అబ్బింది. 1953లో హైదరాబాద్‌లో పుట్టిన ఉమర్ ఖాలిది రెండు డజన్లకుపైగా పుస్తకాలు వెలువరించాడు.

అందులో దాదాపు అన్నీ హైదరాబాద్ చరిత్రకు, లేదా ముస్లిం సమాజానికి సంబంధించిన వే. వందల సంఖ్యల్లో పత్రికా వ్యాసాలే గాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆయా యూనివర్సిటీల్లో చేసిన ప్రసంగాలు, రాసిన అకడమిక్, రీసెర్చ్ వ్యాసాలు ప్రతి ఒక్కటీ ఆణిముత్యమే. మధుమేహంతో బాధపడుతున్న ఖాలిది ఈ నెల 29న అమెరికాలో రైలు ప్రమాదంలో చనిపోవడం హైదరాబాద్ సమాజానికి తీరని లోటు, వ్యక్తిగతంగా నేను ఒక ఆత్మీ య మిత్రుణ్ణి, పరిశోధక దిక్సూచిని కోల్పోయాను. ప్రపంచ ముస్లిం సమాజం ఒక మంచి ఉద్యమ కార్యకర్తను కోల్పోగా హైదరాబాద్ సమాజం ఉద్యమకారునితోపాటు విలువైన రచయితను, పరిశోధకుడిని కోల్పోయింది.
-సంగిశెట్టి శ్రీనివాస్
తెలంగాణ హిస్టరీ సొసైటీ
Andhra Jyothi News Paper Dated : 12/2/2010

అన్ని అనర్థాలకు మూలమైన దినం -సంగిశెట్టి శ్రీనివాస్


సెప్టెంబర్ 17కు చరిత్రలో ఎలాంటి ప్రాధాన్యముందో చూద్దాం. 1998లో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 'విమోచన' అనే పదం మొదటిసారిగా తెరమీదికి వచ్చింది. ఆ పార్టీ అంటున్నట్టు 1948 సెప్టెంబర్ 17న 'ముస్లిం పాలకుని నుంచి విముక్తి' దొరికితే ఆ తర్వాత కూడా సర్వాధికారిగా నిజాం ఎలా కొనసాగాడు? 1950 ఏప్రిల్ 1న నిజాంకు, భారత ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిరింది. 

దాని ప్రకారం నిజాంకు ఏడాదికి (ఎలాంటి పన్నులు లేకుండా) యాభై లక్షల రూపాయల భరణం చెల్లించడానికి నిర్ణయం జరిగింది. అలాగే నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాద్ రాజుగా పూర్వపు బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు భారత ప్రభు త్వం అంగీకరించింది. 1950 జనవరి 26వరకు ప్రభుత్వాధినేతగా, తర్వాత 1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్‌గా నిజాం ఉన్నారు. ఈ గౌరవం కాశ్మీర్‌ని భారత్‌లో కలిపిన హరిసింగ్‌కు కూడా దక్కలేదు. 

ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రం గా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం. 

రజాకార్లంటే కేవలం ముస్లింలనే భావన ఉంది. ముస్లింలతో బాటుగా శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీర న్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములతో పాటుగా వారి అనుచరగణం కూడా రజాకార్లలో ఉన్నారన్న విషయం మరువరాదు. 

'విమోచన' అంటే స్వేచ్ఛ లభించడం. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విమోచనద్వారా స్వేచ్ఛ లభించకపోగా 'పెనం నుంచి పొయ్యి'లో పడ్డట్టయింది. మరట్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో భార త సైన్యం వేలసంఖ్యలో అమాయక ముస్లింలను ఊచకోత కోసిం ది. ఈ విషయాన్ని నెహ్రూ నియమించిన సుందర్‌లాల్ కమిటీ తేల్చిచెప్పింది. కొంతమంది మేధావులు యుద్ధం జరిగితే ప్రాణనష్టం ఉంటుందని చెబుతున్నారు. 

యుద్ధంలో మరణాలు ఏకపక్షంగా ఉండవనేది తెలిసిందే. నిజాంపై యుద్ధాన్ని 'పోలీస్ చర్య' గా భారత ప్రభుత్వం ప్రచారం చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే విమర్శలను తప్పించుకునేందుకే ఆ సైనిక దాడిని పోలీస్‌చర్యగా పిలిచారు. భారత ప్రభుత్వ చర్యను ఖండిస్తూ నిజాం ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. భద్రతామండలిలో కేసు విచారణకు వచ్చి భారత్‌పై చర్య తీసుకోవడం ఖాయం అనిపిస్తున్న దశలో నిజాంను ఒప్పించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. 

మహారాష్ట్ర, కర్ణాటకలలో 'విమోచన' జరుపుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా 'విమోచన' పండుగ జరపాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. నిజానికి బిజెపి భాగస్వామ్య ప్రభుత్వాలున్న కాలంలోనే ఆయా రాష్ట్రాలలో 'విమోచ న' పండుగ జరపడం ఆరంభమయింది. అంతేకాకుండా మర ట్వాడా, కర్ణాటక ప్రాంతాలు భాషా పరంగా ఆయా రాష్ట్రాలతో మమేకమయ్యాయి. కాని తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఆంధ్ర వారితో తెలంగాణ వాసులు మమేకం కాలేకపోయారు. అందుకే ఇక్కడ 'విమోచన'కు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 

'పోలీస్ చర్య'ను విలీనం అనడానికి వీల్లేదు. ఇరువర్గాల సమ్మ తి మేరకు కలిసిపోతే విలీనం జరిగినట్టు లెక్క. భారత సైన్యం చర్యను నాటి అంతర్జాతీయ పత్రికలన్నీ దురాక్రమణగా పేర్కొన్నా యి. సెప్టెంబర్ 17 తరువాత కూడా నిజాం పేరిటనే ఫర్మానాలు విడుదలయ్యాయి. భారత సర్వోన్న త న్యాయస్థానం కూడా అనేక సందర్భాల్లో హైదరాబాద్ స్వతంత్రదేశం కనుక దానికి సంబంధించిన విషయాలు తమ పరిధిలోకి రావని తీర్పునిచ్చింది. 

నిజానికి విలీనమంటే ఇక్కడి ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి. కానీ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగాలు పోయాయి. పరాయి పాలనకు తెర లేచింది. ప్రజలు సాధించుకున్న భూమి భూస్వాముల పాలయింది. అన్ని అనర్థాలకు మూలకారణమైన దినాన్ని పండుగలాగా ఎలా చేసుకోగలం? 

పోలీస్ యాక్షన్ తర్వాత ప్రభుత్వం మద్రాసు నుండి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగులను దిగుమతి చేసుకుంది. వీరందరూ అప్పటివరకు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నతోద్యోగాల్లో ఉన్న ముస్లింలు ఇతర దేశాలకు వలసపోగా వారి స్థానాల్లో వచ్చినవారే! వీరు ఇక్కడి ప్రజలకు భాష రాదు, తెలివిలేదు, తాము అవి నేర్పడానికి వచ్చినవారమన్నట్టు అహంభావం ప్రదర్శించారు. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. వీరంతా కిందిస్థాయి ఉద్యోగాలు కూడా తమ ప్రాంతం వారికే కట్టబెట్టేవారు. 

దీనికి నిరసనగా 1952 సెప్టెంబర్‌లో ముల్కీ ఉద్యమం ఉధృతంగా వచ్చింది. డజన్‌కు పైగా విద్యార్థులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఇందుకు కారణమైన సెప్టెంబర్ 17ను పండుగలాగా చేసుకుందామా? ఆనాడు 'ఆజాద్ హైదరాబాద్' అనే నినాదమిచ్చిన కమ్యూనిస్టులు కూడా నేడు సెప్టెంబర్ 17ను పండుగలాగా చేసుకోవాలంటే ఆశ్యర్యంగా ఉంది. తెలంగాణకు ఏమీ ఇవ్వని సెప్టెంబర్ 17 కన్నా రాబోయే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజునే పెద్ద పండుగలాగా జరుపుకుం దాం. ఆ శుభ దినం కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదాం. 

-సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ హిస్టరీ సొసైటీ
Andhra Jyothi News Paper Dated : 15/9/2010

నిజాలు దాచి నిజాంపై దాడెందుకు? -సంగిశెట్టి శ్రీనివాస్


'నిజాం నిరంకుశుడు కాదా?' అంటూ ఎస్వీ సత్యనారాయ ణ స్పందించిన తీరు (మార్చి 7, ఆంధ్రజ్యోతి) పూర్తిగా మత దృక్పథంతో, అహేతుకంగా ఉంది. అభ్యుదయ రచయితల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్వీ ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు అసత్యాలు, అర్ధసత్యాలతో నిండివున్నాయి. 

నిజాంని నిందించడమే ఎజెండాగా పెట్టుకొని అభ్యుదయ రచయితల సంఘం పనిచేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతుంది. రాచరికంలో రాజులందరి మాదిరిగానే నిజాం కూడా కొన్ని విషయాల్లో నిరంకుశుడుగా ఉండి ఉండొచ్చు. దానికి ఆయన్ని బాధ్యుణ్ణి చేస్తూ 60 ఏండ్లుగా నిలదీస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో నిజాం ని నిందించడం కూడదని రఫత్ సీమా, కనీజ్ ఫాతిమాలు ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ తరఫున చేసిన విజ్ఞప్తి (ఫిబ్రవరి 29, ఆంధ్రజ్యోతి) పూర్తిగా న్యాయంగా ఉంది. నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని నిజాంని నిందించడం వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనమేమిటో ఎస్వీ చెప్పాల్సి ఉంది.

గతంలో జరిగిన సంఘటనలకు ఒక్క నిజాంని మాత్రమే బాధ్యుణ్ణి చేసి ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులు ఆ సంఘటనలకు నిజాంతో పాటుగా సంస్థానాధీశులు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్‌లు, దేశ్ పాండ్యాలు, భూస్వాములు, దొరలు కూడా సమా న బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని ఎందుకు కావాలని విస్మరిస్తారు? బహుశా ఆయా వర్గాలు తమ మతానికి సంబంధించిన వారు కావడం మూలంగానే వదిలేస్తున్నారేమో? ఎస్వీ ఇంకా ఆ వ్యాసంలో నిజాం పాలనలో కేవలం పన్నులు, పీడన, వెట్టిచాకిరి తప్ప మరేమి లేదనే భావన కలిగించాడు.

1724 నుంచి 1948 వరకు 224 సంవత్సరాల ముందు 220 యేండ్లు జరిగిన సంఘటనలకు కూడా నిజాంనే బాధ్యుల్ని చేయాలి. అంటే తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు, వైద్య, విద్యాలయాలకు, నోబెల్ ప్రయిజ్ గ్రహీత రోనాల్డ్ రాస్ పరిశోధనకు వసతులు సమకూర్చినందుకు, ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యూడిష్యరీని విడదీసి న్యాయవ్యవస్థకు దేశంలోనే మొట్టమొదటిసారి స్వయం ప్రతిపత్తి కల్పించినందుకు కూడా నిజాంని బాధ్యుణ్ణి చేయాల్సిందే! కట్టుబట్టలతో వచ్చిన నిజాం అత్యంత సంపన్నుడెట్లయ్యా డు? అని ఎస్వీ ప్రశ్నించారు.

ఒక ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ వ్యక్తి కట్టుబట్టలతో మాత్రమే వస్తాడని ఊహించడం ఆయనకు అసఫ్‌జాహీలపై ఉన్న ఏహ్య భావాన్ని వ్యక్తం చేస్తోం ది. అసఫ్ జాహీలు ప్రపంచంలోనే అత్యధిక సంపున్నులుగా ఎదగడానికి ప్రధాన కారణాలైన వజ్ర, వైఢూర్య ఆభరణాలు, సర్ఫెఖాస్ భూములు రెండూ ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఉన్నా యి. ఆ సర్ఫెఖాస్ భూములే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కామధేనువులయ్యాయి. 

అసఫ్ జాహీలు తమ ఆస్తుల్ని వేరే ప్రాంతాలకు తరలించలేదు. దేశ విదేశాల్లో మరెక్కడా పెట్టుబడి పెట్టలేదు. తమ ఆస్తి సంపదనంతా తెలంగాణలోనే నిక్షిప్తం జేశారు. బ్రిటి ష్ పాలకుల మాదిరిగా సంపదను తరలించలేదనే విషయాన్ని గ్రహించాలి. తనకు ఇంగ్లీషు పుస్తకాల్లో ఏమి రాస్తున్నారో తెలియదు అని ఒకవైపు ఒప్పుకుంటూనే మరో వైపు అందులో గోరంతలు కొండంతలు చేసి రాస్తున్నారనే అబద్ధాలు ప్రచారంలో పెట్టారు.

షీలారాజ్, సరోజిని రేగాని, రత్నానాయుడు, వి.కె.బావా లాంటి వందల మంది ఉర్దూ, పర్షియన్ పత్రాలను అవలోకించి వెలుగులోకి తెచ్చిన విషయాలు తెలుగువారికి అందుబాటులో లేవు. వారి పుస్తకాల్లోని విషయాలు అందరికి అందుబాటులో ఉన్నట్లయితే ఎస్వీ లాంటి వారు చేసే వాదనలు ఎంత అహేతుకమైనవో తేలుతాయి. రఫత్, కనీజ్‌లు అడిగినట్లుగా నిజాంని నిందించడం గాకుండా అరసం తెలంగాణ ముస్లింలకు ఏం జేసిందో, విశాలాంధ్ర ప్రచురణ సంస్థ నుంచి ఇంతవరకు తెలంగాణ ముస్లిం యోధులైన షోయెబుల్లాఖాన్, బందగీ, తుర్రేబాజ్ ఖాన్ గురించి ఒక్క చిన్న పుస్తకమైనా ఎందుకు వేయలేదో జవాబివ్వాలి? మఖ్దూమ్ కవిత్వం అంతా ఎందుకు ఒక దగ్గరికి రాలేదో చెప్పాలి.

గజ్జెల మల్లారెడ్డి తర్జుమా చేసిన మఖ్దూమ్ కవితను కోట్ చేసిన ఎస్వీ ఎన్నడైనా నిజాంని పొగుడుతూ ప్రతియేటా పండితులు తెలుగులో పద్యాలు రాసేవారంటే నమ్ముతా రా?అలాంటి పద్యాలే నిజాం 49వ జన్మదినం సందర్భంగా గోల కొండ పత్రికలో అచ్చయ్యాయి. ఆ పద్యాలను చూసినట్లయితే ఆనాటి పండితులు నిజాంని చూసినతీరుని అర్థం చేసుకోవచ్చు. 

'నైజాము సర్కరోడా-నాజీల మించినోడా' అనే పాటను రాసిన యాదగిరిని హతమార్చిన నైజాం పోలీసులను, ప్రభుత్వాన్ని, దానికి రాజైన నిజాంని నిందించాల్సిందే. యాదగిరితో పాటు మరో మూడువందల మందిని 1944-48 మధ్యలో చం పించినందుకు నిజాం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. ఇదే సమయంలో 1948-1951 మధ్యన అప్పటి భారత హోం మంత్రి వల్లభ్ బాయి పటేల్ సైన్యం, దానికి నేతృత్వం వహించిన నెహ్రూలు, నాలుగు వేల మంది తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని పొట్టన బెట్టుకోవడాన్ని ఎందుకు నిలదీయ కూడ దు? ఈ పని మీరెందుకు చేయరు? నిజాంని ఎత్తిచూపించి నెహ్రూని మరవడంలో మర్మమేంది? 

యాదగిరి మృతికి అభ్యుదయ రచయితల సంఘం ఆనాటి నుంచీ సంతాపం ప్రకటిస్తుంది. అయితే యాదగిరి మృతిని శ్రీశ్రీ ఎదురుకాల్పుల సంఘటనగా రాశాడంటే నమ్మే గుండె ధైర్యం అరసంకు ఉందా? అవును శ్రీశ్రీ నిజాం ప్రభుత్వ సమాచార శాఖ లో ఉద్యోగిగా ఉంటూ ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి తర్జుమా చేశాడు. ఈ విషయాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించరు?

ఒక వైపు తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేస్తూంటే మరో వైపు శ్రీశ్రీతో పాటుగా రాయప్రోలు, కురుగంటి సీతారామయ్య, కాసింఖాన్ ఇంకా అనేక మంది సాహితీవేత్తలు నిజాం ప్రభుత్వం లో కొలువులు చేశారు. అడివి బాపిరాజు, రాంభట్ల, తిరుమల రామచంద్ర లాంటివారు 'మీజాన్' పత్రిక ద్వారా పరోక్షంగా నిజాం ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఈ విషయాలను ఇప్పుడైనా చర్చించాల్సిన అవసరం లేదా?

గాంధీ విషయంలో కూడా అర్ధసత్యాలనే ఎస్వీ ప్రచారంలో పెట్టారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ప్రారంభమైన వెంటనే నిషేధానికి గురయ్యింది. ఈ స్టేట్ కాంగ్రెస్ తరఫున నాయకులు సత్యాగ్రహాన్ని, శాసనోల్లంఘనను చేపడితే గాంధీ వారిమీద వత్తిడి తీసుకొచ్చి వాటిని వెంటనే విరమింపజేసుకునేలా చేశాడు. చేస్తున్న ఉద్యమాన్ని ఆపు చేయించడమంటే 'ఉద్యమం చేయవలసిన అవసరం లేదు'గా రఫత్, కనీజ్‌లు భావిస్తే తప్పేంటి? ఇక్కడి పాలనపై సానుకూలతను గాంధీ-అక్బర్ హైదరీ లేఖల్లో ఉల్లేఖితమైన విషయం పరిగణనలోకి తీసుకోవాలి.

చివరగా ఒక్కమాట. ప్రస్తుత సందర్భం ప్రత్యేక తెలంగాణ. ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకొని కూడా నిజాంని నిందించాలని చూడడం పూర్తిగా అనైతికం. ఇప్పటికైనా విషయాల్ని ఉన్నదున్నట్లుగా, పాలని పాలుగా, నీళ్ళని నీళ్ళుగా చూడాలి, తెలంగాణ ఉద్యమాన్ని కులమతాలకు అతీతంగా ముందుండి నడిపించాలని ప్రతి ఒక్కర్నీ కోరుతున్నాం.
'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
Andhra Jyothi News Paper Dated : 21/3/2010