సైనికుడూ... ప్రేమికుడూ!
ప్రతి ప్రేమ పాట, రచయిత పెన్నుకి సరికొత్త పరీక్ష పెడుతుంది!
అందులోనూ అమ్మాయి బుంగమూతి పెట్టుకుని వెళ్తుంటే... అబ్బాయి బతిమాలే సందర్భం వస్తే కత్తి మీద సామే!
 
పదహారణాల తెలుగు అక్షరాలను పడుచు పదాలుగా మలిచి బాణీలోకి కుదిరేలా రాయాలంటే... కవిరాజుకి కష్టమే సుమీ!
 
అటువంటి సందర్భంలో పాట రాసి దర్శక, నిర్మాతలను, కథానాయకుణ్ణి, ప్రేక్షకులను మెప్పించినప్పుడే పాటల రచయితలోని ప్రతిభ బయట పడుతుంది.
 
రామజోగయ్య శాస్త్రికి అటువంటి సందర్భమే ఎదురైంది. కథానాయకుడు సూర్య సైనికుడు. సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధం చేసే అతను ప్రేమికుడు కూడా! ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, ఒక రోజు సూర్యపై కోపం వస్తుంది. అతడిపై యుద్ధం ప్రకటిస్తుంది. చిన్న చిన్న మనస్ఫర్థలతో ప్రేమ యుద్ధం అన్నమాట! సరిహద్దుల్లో యుద్ధం అయితే ఎలా చేయాలో సూర్యాకు తెలుసు. ప్రేమ యుద్ధం కొత్త. ప్రేయసిపై బోల్డంత ప్రేమ ఉంది. బ్రేకప్‌ చెప్పేసి వెళ్ళలేడు. అమ్మాయిని ఏడిపించలేడు. అతడి ప్రేమలో నిజాయితీ ఉంది. పాటలో అది కనిపించాలి. అలాగని, సైనికుడిగా అతని వ్యక్తిత్వాన్ని తగ్గించకూడదు. పాటలో ఆ వ్యక్తిత్వం కనిపించేలా రాయాలి. రామజోగయ్య శాస్త్రి ప్రతిభతో పాటు అనుభవాన్ని రంగరించి ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ చిత్రంలో ‘ఐయామ్‌ లవర్‌ ఆల్సో... ఫైటర్‌ ఆల్సో!’ పాటను ట్రెండీగా రాశారు. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాట చరణాల్లోని ‘నీ హార్ట్‌ బుక్‌ పై లవ్‌ స్టోరీ మళ్లీ రాసే రైటర్‌ ఆల్సో’, ‘నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టె లైటర్‌ ఆల్సో’ ప్రయోగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
 
పాట: ఐయామ్‌ లవర్‌ ఆల్సో... ఫైటర్‌ ఆల్సో!
చిత్రం: నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా
సంగీతం : విశాల్‌-శేఖర్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శేఖర్‌
 
పల్లవి:
అట్ట సూడకే... కొట్టినట్టుగా అట్ట సూడకే
సిట్టి గుండెకే... ఊరికూరికే సొట్టబెట్టకే (2)
గురి పెడుతూ సూపులతోనా...
నువు పెల్చకు బొమ్మ తుపాకి
సరిహద్దులు తెంచుకురానా...
నే నీ జిందగిలోకీ
ఐయామ్‌ లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో! (2)
లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో!
నో సెప్పి కూసున్న నీ హార్ట్‌ బుక్‌ పై
లవ్‌ స్టోరీ మళ్లీ రాసే రైటర్‌ ఆల్సో
ఐయామ్‌ లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో!
 
చరణం1:
ఏం చూశావని...
నాలోని ప్రేమికుణ్ణి పూర్తిగా (2)
ఏం చేశానని...
వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో చలో చెరో సగం తప్పుగా
మరో కథై కలుద్దామా కొత్తగా
ఫ్లాషుబ్యాకు బొమ్మని గుర్తుకే తెచ్చుకో
ప్యాచప్‌ అయిపోవడానికెంత ఛాన్సో... ఓఓఓ
ఐయామ్‌ లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో!
 
చరణం 2 :
ఇను ఇనవే...
మాట ఇనవే మంచి పిల్లవే
సిన్న గొడవే...
సన్న గొడవే సల్లబడవే
బెదిరింపులు తెగతెంపులుగా... ఎల్లిపోకే బ్రేకప్‌ లోకి
గడియేసిన తలుపులు తీసి... తిరిగొస్తా నీ లోకి
ఐయామ్‌ లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో! (2)
లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో!
సీకట్లో దాకున్న నీలోని ప్రేమని
పట్టుబట్టి బయటపెట్టె లైటర్‌ ఆల్సో
ఐయామ్‌ లవర్‌ ఆల్సో! ఫైటర్‌ ఆల్సో!
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.