ఏనుగమ్మ.. ఏనుగు
11-08-2017 22:25:53
ఏనుగులు చాలా తెలివైనవి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. మనుషుల్లానే వాటికీ భావోద్వేగాలుంటాయి. మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. కానీ రోజు రోజుకూ వాటి సంఖ్య తగ్గిపోతోంది. దంతాల కోసం, శరీర భాగాల కోసం అమానుషంగా వాటిని కొందరు చంపేస్తున్నారు. అయినా ఆ భారీ జంతువులకు మనుషుల మీద కోపం రాలేదు. ఆకారం భారీగా ఉన్నా అందరితో ప్రేమగా మెదిలే ఏనుగులను కాపాడాలనే ఉద్దేశంతో ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ మొదలైంది.
 
ఏనుగులు మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. భారతీయ సంస్కృతిలోనూ ఏనుగులకు విశిష్ట స్థానం ఉంది. నాలుగు వేల సంవత్సరాల నుంచి మానవులతో మైత్రి కొనసాగిస్తున్న గజరాజులకు.. మానవుల వల్లే ప్రమాదం పొంచి ఉంది. గత పది సంవత్సరాల్లో ఏనుగుల సంఖ్య 62 శాతం తగ్గింది. ప్రతిరోజు దాదాపు 100కు పైగా ఏనుగులు చనిపోతున్నాయి. ఏనుగు మాంసం, శరీర భాగాలు, దంతాల కోసం వేటగాళ్లు వాటిని చంపుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరో పదిహేను, ఇరవై సంవత్సరాల్లో ఏనుగులు అంతరించిపోతాయని అంటున్నారు పర్యావరణవేత్తలు. అరణ్యంలో దొరికిన అనాథ ఏనుగుల్ని ‘టూరిజమ్‌ ఇండస్రీ’్ట, ‘సర్కస్‌’, ‘టూరిస్ట్‌ పార్కు’లకు విక్రయించడంతో పాటు, అడవుల సంఖ్య తగ్గడం వల్ల కూడా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది గమనించిన కెనడియన్‌ ఫిల్మ్‌మేకర్‌ ప్యాట్రిసియా సిమ్స్‌, ‘థాయ్‌లాండ్‌ రీ ఇంట్రడక్షన్‌ ఫౌండేషన్‌’ సాయంతో ఆగస్టు 12న ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవా’న్ని జరుపుకోవాలని పిలుపునిచ్చాడు. ఏనుగులను కాపాడుకోవటం అందరి బాధ్యతంటూ సిమ్స్‌ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు.
 
ఎన్నెన్నో ఏనుగులు
ఆసియా ఏనుగులు:
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగుల్లో కేవలం పది శాతం మాత్రమే ఆసియా ఏనుగులున్నాయి. జన్యు వ్యత్యాసాల ఆధారంగా ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు. ఇవి ఇంచుమించు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్నాయి.

 శ్రీలంక ఏనుగు : ఆసియా ఏనుగులన్నింటిలోనూ పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి.
 
 ఇండియన్‌ ఎలిఫెంట్‌ : ఇవి భారత దేశం నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి. వీటి సంఖ్య దాదాపు 35 వేల వరకు ఉండొచ్చు.
 
 సుమత్రా ఏనుగు : ఇవి అన్నింటికన్నా చిన్న పరిమాణంలో ఉంటాయి.
 
ఆఫ్రికా ఏనుగులు :
  •  ఆఫ్రికా ఖండంలో 37 దేశాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.
  •  ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి చెవులు చాలా విశాలంగా, చెవులు చూడటానికి ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉండటం విశేషం.
రక్షించుకుందాం !
  •  అరణ్యాల్లో పోలీసుల సంఖ్య పెంచడం వల్ల వేటగాళ్ల నుంచి ఏనుగులను రక్షించుకోవచ్చు.
  •  గాయపడ్డ ఏనుగులకు ప్రత్యేక చికిత్సలను అందిస్తే, ఎన్నోఏనుగులను కాపాడుకోవచ్చు.
  •  అనాథ ఏనుగులను టూరిజం ఇండస్ర్టీకి ఇవ్వకుండా ప్రత్యేక చట్టాలను రూపొందించడం ద్వారా కూడా వీటిని రక్షించుకోవచ్చు.
  •  ఏనుగుల శరీర భాగాలను స్మగ్లింగ్‌ చేస్తున్న వారికి కఠిన శిక్షలు విధించడం వల్ల కూడా గజరాజులను కాపాడుకోవచ్చు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.