కలంయోధుడు.. కాళోజీ


Tue,September 10, 2019 03:12 AM

kaloji narayana rao birth anniversary celebrated

- త్వరలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తిచేస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
- కోట్ల వెంకటేశ్వరరెడ్డికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం
- ఘనంగా కాళోజీ జయంత్యుత్సవం.. తెలంగాణ భాషా దినోత్సవం


రవీంద్రభారతి: ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు కలం యోధుడు అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కవిత్వం పోరాటస్ఫూర్తిని రగిలించి వెన్నుతట్టి ముందుకు నడిపించిందన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సోమవారం రాత్రి ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు 105వ జయంతి ఉత్సవం- తెలంగాణ భాషా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి కాళోజీ చిత్రపటానికి పుష్పాలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డిని ఘనంగా సత్కరించి కాళోజీ సాహితీ పురస్కారం, 1,01,116 నగదు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్‌లో కాళోజీ పేరిట నిర్మిస్తున్న కళాక్షేత్రం నిర్మాణం త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు. ఒక చేతితో కలం ఇంకోచేత్తో కత్తిపట్టి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడిన మహాకవి పోరాటయోధుడు కాళోజీ అని గుర్తుచేశారు. కాళోజీని తెలంగాణ మహాకవిగా హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌కు భాషా సాహిత్యాల పట్ల మక్కువ అధికమని, అందుకే ఆయన తెలుగును స్కూల్‌లో నిర్బంధంగా అమలుచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అధ్యక్షోపన్యాసంచేస్తూ.. కాళోజీ తెలంగాణభాషకు సొబగులద్దారని పేర్కొన్నారు.

కాళోజీని స్మరించుకోవడం తెలంగాణవారికి గర్వకారణం అన్నారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ బతుకును ఆరాధించిన తత్తవేత్త కాళోజీ అన్నా రు. ప్రజల కోసం నిలబడిన.. కలబడిన ప్రజాకవి కాళోజీ అని పేర్కొన్నారు. తెలుగును ఎంత ప్రేమించాడో తెలంగాణ భాషను అంతే ప్రేమించారన్నారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలంగాణ సామాజిక నేపథ్యం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం తో రూపొందించిన పాటలను ఆలపించారు.

88
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles