బుధవారం 15 ఏప్రిల్ 2020
Sunday - Apr 12, 2020 , 01:42:16

స్వరమే వరం

స్వరమే వరం

తెర మీద పాత్రధారులకు గాత్రదానం చేసే సూత్రధారులు డబ్బింగ్‌ ఆర్టిస్టులు. తెలుగులో హీరోలందరూ సొంతంగానే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నా.. ఇతర భాషల నుండి దిగుమతి చేసుకుంటున్న విలన్లకు హీరోయిన్లకు మాత్రం డబ్బింగ్‌ తప్పనిసరి అవుతున్నది. అలాగే ఇతర భాషల నుండి తెలుగులోకి అనువదించే సినిమాలకూ పూర్తిస్థాయిలో డబ్బింగ్‌ చెప్పాల్సిందే. తమ స్వరంతో ఎన్నో సినిమాలను విజయతీరాలకు నడిపించిన డబ్బింగ్‌ ఆర్టిస్టులు ఎంతోమంది. వారిలో ఆర్‌సీఎం రాజు (రెడ్డిచర్ల చంద్రమోహన్‌రాజు) ఒకరు. బుల్లితెర, వెండితెరల మీద తన గొంతుతో పాత్రలకు జీవం పోస్తున్న ఆయన.. 24 క్రాఫ్ట్స్‌లో అతి ముఖ్యమైనది అయిన ‘స్వర కళ’గురించి అనేక విషయాలను వెల్లడించారు. 

వెండితెర ఇరవైనాలుగు కళల్లో డబ్బింగ్‌ ఒకటి. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అంటే... వినిపించే హీరో. సినిమా విజయంలో డబ్బింగ్‌ అతిముఖ్యమైంది.ఒకప్పుడు నటీనటులు తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకునేవారు. షూటింగ్‌ సమయంలోనే నటీనటులు డైలాగ్స్‌ చెప్పినా బయటి శబ్దాలు, ఇతరత్రా గొంతులూ రికార్డింగ్‌లో దూరిపోతాయి. వాటిని నివారించడానికి డబ్బింగ్‌ తప్పనిసరి అయింది. వీడియో చూసుకుంటూ, పాత్రల లిప్‌ మూమెంట్స్‌ను గమనించుకుంటూ.. ఎక్స్‌ప్రెషన్స్‌ పరిగణనలోకి తీసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి సీన్‌ చూడగానే.. మొత్తం పేజీ డైలాగ్‌ ఒకేసారి చదివేసి డబ్బింగ్‌ చెప్పగల మహానుభావులూ  ఉన్నారు. ఎన్‌టీఆర్‌, కృష్ణ, కోట శ్రీనివాసరావు లాంటివారు డబ్బింగ్‌లో దిట్టలు. పాత్రలో ఒదిగిపోయి ఉంటారు కాబట్టి, వాళ్లకే అది సాధ్యం అవుతుంది. డబ్బింగ్‌ ఆర్టిస్‌ పరిస్థితి వేరు. తను నటుడు కాదు. ఆ పాత్రను ధరించనూ లేదు. మహా అయితే,  ఆ పాత్ర స్వరంలోకి ప్రవేశించగలడు. ఇన్ని పరిమితుల మధ్య కూడా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ తన గొంతుతో విన్యాసాలు చేయాలి. ఆ పాత్రని సొంతం చేసుకోవాలి. అప్పుడే డబ్బింగ్‌ అతికినట్టు సరిపోతుంది. లేకపోతే, అతికించినట్టే ఉంటుంది. కొన్నిసార్లు ప్రేక్షకుడు పాత్రని పక్కనపెట్టి డబ్బింగ్‌ స్వరమే డామినేట్‌ చేస్తుంది. ఈ స్వర ఆధిపత్యమూ అంత మంచిది కాదు.

ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండాలి

ఒకప్పుడు ఫలానా క్యారెక్టర్‌కు ఫలానా ఆర్టిస్ట్‌తో చెప్పిస్తామని ముందే డిసైడ్‌ అయ్యేవారు. అంటే, అప్పటికే ఎంతోకొంత పేరు ఉన్నవారికి అవకాశం ఇచ్చేవారు. తర్వాత కాలంలో ఆ క్యారెక్టర్‌కు తగిన వాయిస్‌ ఉన్నవాళ్లను ఎంపిక చేసుకోవడం మొదలైంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు, వాయిస్‌ ఓవర్‌ అర్టిస్ట్‌కు కొంత తేడా ఉంటుంది. వాయిస్‌ ఓవర్‌కు మంచివాయిస్‌ ఉండాలి. మంచి ఉచ్ఛారణ ఉండాలి. భావవ్యక్తీకరణ ఉండాలి. కానీ డబ్బింగ్‌లో క్యారెక్టర్‌ను బట్టి ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండాలి. వాయిస్‌ ఓవర్‌తో పోలిస్తే డబ్బింగ్‌ కష్టమైన పక్రియ. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు నటన తెలిసి ఉంటే ఇంకా బాగా రాణించగలడు.  

పారితోషికం..

యూనియన్‌ ప్రకారం అయితే, నిడివిని బట్టి అంటే.. సీన్స్‌ను బట్టి రెమ్యూనరేషన్‌ ఉంటుంది. ఆర్టిస్టుల ప్రకారం చూసుకుంటే హీరోహీరోయిన్లను బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ సీన్లు ఉంటే రెమ్యూనరేషన్‌ కూడా ఎక్కువే. కొంతమంది సీనియర్‌ ఆర్టిస్ట్‌లకు, డిమాండ్‌ ఉన్న ఆర్టిస్టులకు కొంత ఎక్కువగానే చెల్లిస్తారు. అయితే  సినిమాల్లో డబ్బింగ్‌ ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. టీవీ సీరియల్స్‌లో మాత్రం బాగున్నాయి. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కొన్నిసార్లు ఒక్కో సినిమాలో రెండు మూడు క్యారెక్టర్లకు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు గొంతు మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మిమిక్రీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగం, ఒకప్పుడు నాలుగైదు క్యారెక్టర్లకు చెప్పేవారు, ఇప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు. తెలుగు హీరోలందరూ దాదాపుగా ఎవరి డబ్బింగ్‌ వారే చెప్పుకుంటున్నారు. తెలుగులో నటించే ఇతర ప్రాంతాల ఆర్టిస్టులకు, విలన్లకు మాత్రమే మాలాంటివారు డబ్బింగ్‌ చెప్పే అవకాశం వస్తున్నది. నిజానికి ఎవరి డబ్బింగ్‌ వారు చెప్పుకున్నప్పుడే పరిపూర్ణత వస్తుంది. కొంతమంది దర్శకులు ఆయా నటులకు మన భాష తెలియకపోయినా..  ధైర్యం చేసి డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు. భాషమీద పట్టులేకుండా.. ముద్దుముద్దుగా చెప్పే ఆ మాటలే చాలాసార్లు జనానికి నచ్చుతున్నాయి. 

ఆర్‌సీఎం రాజు గురించి...

ఆర్‌సీఎం రాజు పూర్తి పేరు రెడ్డిచర్ల చంద్రమోహన్‌రాజు. ఆయనది వనపర్తి జిల్లా. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా రంగస్థలం మీద అడుగుపెట్టిన ఆయన రుతురాగాలు సీరియల్‌తో బుల్లితెర డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారారు. 1997లో ఆటోడ్రైవర్‌ సినిమాకు తొలిసారి డబ్బింగ్‌ చెప్పారు. పూర్తిస్థాయిలో మాత్రం ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’లో హీరో వెంకట్‌కు గాత్రదానం చేశారు. ఇప్పటి వరకు 800 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. అశుతోష్‌ రాణా, ఆశీష్‌ విద్యార్థి, ముఖేష్‌రుషి లకు ఆయనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, సింహాద్రి, పోకిరి, రక్తచరిత్ర, రక్తకన్నీరు సినిమాలు ఆయనకు గుర్తింపును తెచ్చాయి. పురాణ గాథలు, మొగలిరేకులు టెలివిజన్‌ సీరియల్స్‌కు, డార్లింగ్‌, పోరుతెలంగాణ, మిణుగురులు చిత్రాలకు బెస్ట్‌ మేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది ఆవార్డులు అందుకున్నారు.



గొంతును కాపాడుకోవలసిందే

డబ్బింగ్‌ కళాకారులకు గొంతే ఆస్తి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిత్యం పండ్లు, ఆకుకూరలు తింటే మంచిది. ఐస్‌క్రీమ్‌, కూల్‌డ్రింక్స్‌, సిగరెట్లు, ఆల్కహాల్‌లకు దూరంగా ఉండాలి. ప్రాణాయామ, యోగా చేయాలి. స్వరం మీద ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి. అన్నింటికీ మించి నీళ్ల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

అవకాశాలు అనేకం

డబ్బింగ్‌ ఆర్టిస్టు మిమిక్రీ కళాకారుడూ, గాయకుడూ కూడా అయి ఉంటే.. ఇంకా మంచిది. మిమిక్రీ వస్తే నోటెషన్స్‌, ఇంటోనేషన్స్‌ పట్టుకోవడానికి వీలుంటుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడే కాదు, గొప్ప డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా. చాలా సూపర్‌హిట్‌ పాత్రలకు ఆయన గొంతు ఇచ్చారు. ప్రతి వాయిస్‌కు ఒక ధర్మం ఉంటుంది. లయ, శృతి ఉంటాయి. సంగీతం తెలిసి ఉంటే.. వాటిని తొందరగా పట్టుకోగలుగుతాం. డబ్బింగ్‌ ఆర్టిస్టులకు సినిమాలలో, టీవీలలో, వాణిజ్య ప్రకటనలలో అవకాశాలు అపారం.

-మధుకర్‌ వైద్యుల


logo