బస్తీ మే సవాల్‌! టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు..?

బస్తీ మే సవాల్‌! టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు..?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి  ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం.  ఇక్కడ చీమచిటుక్కుమన్నా ఆసక్తిగా చెప్పుకొంటారు జనాలు. అలాంటిది కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరంటే ఎంతో ఉత్కంఠగా చర్చించుకుంటారు. ఈ రెండు నియోజకవర్గాలు పక్క పక్కనే ఉంటాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అయినా టీడీపీలో ఉన్నప్పుడు వీరి మధ్య మొగ్గతొడిగిన విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయట. టీఆర్‌ఎస్‌లోకి రాకమునుపు ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా చేశారు. గాంధీ. టీడీపీలో యాక్టివ్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవట. 2014లో కృష్ణారావు కూకట్‌పల్లి, గాంధీ శేరిలింగంపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచారు. తర్వాత ఇద్దరూ గులాబీ కండువా కప్పేసుకున్నారు.  2018 ఎన్నికల్లో ఇద్దరూ టీఆర్‌ఎస్‌ టికెట్‌పై మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

కరోనా సమయంలో తమ ప్రాంతాల్లోని ప్రజలకు తోచిన విధంగా పేదలకు సాయం చేశారు. రోజువారీ కూలీలకు ఆర్థిక సాయం అందించారు. భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆహార పొట్లాలు పంపిణీచేశారు. ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు ఇచ్చారు.  హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీతోపాటు మరో డివిజన్‌లో సైతం మాధవరం కృష్ణారావు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణారావు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచీ ఈ డివిజన్‌లలో ఆయనకు కేడర్‌ ఉందని చెబుతారు. అందువల్లే ఆయా డివిజన్‌లలోనూ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే ఉంది. హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, మరో డివిజన్‌ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. తన నియోజకవర్గంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎలా సహాయ చర్యలు చేపడతారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారట. అసలే ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఉండగా.. ఈ పరిణామాలు ఇద్దరి మధ్య గ్యాప్‌ మరింత పెంచాయట. పార్టీ వర్గాలు కూడా ఈ అంశంపై రకరకాల కామెంట్స్‌ చేస్తున్నాయి. ఇక‌, ఇద్ద‌రు అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న వార్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి కింది వీడియోను క్లిక్ చేయండి...