Srikanth addala: నాలో కొత్త యాంగిల్‌ బయటికొచ్చింది

మాస్‌ సినిమా అయినా నా మార్క్‌ తప్పనిసరి...
నాకూ, వెంకటేశ్‌కి డిఫరెంట్‌ సినిమా అవుతుంది...
ఎమోషన్‌ని క్యారీ చేయడం సవాల్‌గా అనిపించింది..
గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చిందంతే..
ఇకపై స్పీడ్‌ పెంచుతా...

తెరపై మానవ సంబంధాలు, కుటుంబ విలువలును ఆవిష్కరించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలది ప్రత్యేక శైలి. మనసుకు హత్తుకునే భావోద్వేగాలను పండించడంలో ఆయన మాస్టర్‌. అందుకే కుటుంబ చిత్రాల దర్శకుడిగా ఆయనకు పేరుంది. తమిళంలో హిట్టైన ‘అసురన్‌’ చిత్రాన్ని ఆయన తెలుగులో ‘నారప్ప’గా రీమేక్‌ చేశారు. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మంగళవారం ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ అడ్డాల చెప్పుకొచ్చిన సంగతులివి...

ఇప్పటి వరకూ నాలోని ఫ్యామిలీ, ఎమోషన్‌ యాంగిల్‌ను మాత్రమే చూశారు. ‘నారప్ప’తో పూర్తిగా మాస్‌ యాంగిల్‌ని బయటపెడుతున్నా. ట్రైలర్‌ చూసి చాలామంది నాలో ఇంత మాస్‌ యాంగిల్‌ ఉందా అనుకుంటున్నారు.  శ్రీకాంత్‌ అడ్డాల ఇలాంటి సినిమా తీయాలనుకోవడం లేదురా ఆంజనేయులా? అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్‌ భలే థ్రిల్‌గా ఉన్నాయి. కొందరైతే ఇలాంటి సినిమా చేయాల్సి వచ్చిందా? మీరే చేశారా అని అడుతున్నారు. కావాలనే ఈ జానర్‌ సినిమా చేశా. మంచి సినిమాలను రీమేక్‌ చేసేటప్పుడు ఒరిజినల్‌లో ఉన్న ఫీల్‌ మిస్‌ కాకుండా తీస్తే చాలు. ఇందులో మన నేటివిటీకి తగ్గ ఎమోషన్స్‌ జోడించాం. అంతకుమించి కథను ఏమీ మార్చలేదు.

వెంకటేశ్‌ తర్వాతే నన్ను అనుకున్నారు...
మా అసోసియేట్‌ సలహాతో ‘అసురన్‌’ చూశా. నాకెందుకో ఈ సినిమా తెలుగులో చేస్తే బావుంటుంది అనిపించింది. అప్పటికే ఈ సినిమా రైట్స్‌ సురేశ్‌బాబుగారి దగ్గర ఉన్నాయి. నేను వేరే కథ పని మీద ఆయన్ను కలిసినప్పుడు ‘అసురన్‌’ రీమేక్‌ గురించి అడిగి. డైరెక్టర్‌గా ఎవరినీ అనుకోకపోతే నేను చేస్తాను’ అని చెప్పా. ఆయన వెంటనే ఒకే అన్నారు. హీరోగా వెంకటేశ్‌ని అనుకున్నాకే దర్శకుడిగా నన్ను అనుకున్నారు. కథకు, మన నేటివిటీకి తగ్గట్టు అనంతరంలో పలు లొకేషన్‌లలో రెండు వారాలపాటు షూటింగ్‌ చేశాం. ఆ తర్వాత అంతా ఒరిజినల్‌ లొకేషన్‌లోనే సినిమా పూర్తి చేశాం.  కంటిన్యూగా 58 రోజులు చేశాం. ఏకధాటిగా చేసేసరికి టీమ్‌ అంఆ నీరసించిపోయి సెలవు అడిగేశారు. ఆ తర్వాత కరోనా వల్ల ఆరు నెలల గ్యాప్‌ వచ్చింది.

రీమేక్‌ ఎప్పుడూ సవాలే...
ఇప్పటి వరకూ నేను చేసినవన్నీ నా కథలే. మొదటిసారి రీమేక్‌ చేశా. ఇది మాస్‌ సినిమా అయినా ఎమోషన్స్‌, సెన్సిబిలిటీస్‌ ఉన్నాయి. నా తాలూక సెన్సిబిలిటీస్‌ ఎక్కడా మిస్‌ కాకుండా సినిమా ఉంటుంది. సొంత కథతో సినిమా తీసినా, వేరే కథను అడాప్ట్‌ చేసుకుని పని చేయడం దేని శైలి దానిదే! రీమేక్‌ అనేది ఎప్పుడూ సవాలే? రీ క్రియేట్‌ చేయడం చాలా కష్టం. ఆ పట్టు కరెక్ట్‌గా దొరకాలి. సినిమా బావుంటే అంతా బాగానే ఉంటుంది. లేకపోతే.. ‘ఉన్నది ఉన్నట్లు తీయడానికి పోయే కాలమా’ అంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమా తీశా. ఈ జానర్‌లో సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యా. మాతృకలోని ఎమోషన్‌ని ఇక్కడ కూడా క్యారీ చేయడం నాకు సవాల్‌గా అనిపించింది.

ఇద్దరికీ డిఫరెంట్‌ సినిమా...
సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మనం ఎప్పుడూ చూసే వెంకటేశ్‌ కనిపిస్తారు. ఓల్డ్‌ గెటప్‌కు చాలా ఇన్‌వాల్వ్‌ అయ్యి చేశారు. ఆయన కథను నమ్మి పరకాయ ప్రవేశం చేశారు. వెట్రిమారన్‌ ఎంత రియలిస్టిక్‌గా తీశారో.. అంతే కమర్షియాలిటీ కూడా చూపించారు. దర్శకుడిగా ఆయన గ్రేట్‌నెస్‌ అది. మేం కూడా అంతే రియలిస్టిక్‌గా తీసుకొచ్చాం. ‘నారప్ప’ కొడుకు చనిపోయిన సమయంలో వెంకటేశ్‌ నటన చూసి మాట్లాడలేకపోయా. అంతగా ఇన్‌వాల్వ్‌ అయిపోయారు. వెంకటేశ్‌గారికి, నాకు డిఫరెంట్‌ సినిమా అవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో సాగే ఓ ఫైట్‌ సీన్‌ తీస్తుండగా ఓ డిఫరెంట్‌ సినిమా తీస్తున్నామని అనిపించింది. మా సెట్‌లో కూడా చాలామంది ‘మనుషులంటే మంచోళ్లు’ అని సినిమాలు తీసిన మీరు ఈ జానర్‌ ఏంటి సార్‌’ అన్నారు. ‘అసురన్‌’ చూసినప్పుడే సుందరమ్మ పాత్రకు ప్రియమణి అయితే బెస్ట్‌ అనిపించింది. ఆమెకు జాతీయ పురస్కారం తీసుకొచ్చిన ‘పరుత్తివీరన్‌’ సినిమా నాకు గుర్తొచ్చింది. ఈ సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోలేకపోయా.

ఓటీటీ అనగానే షాకయ్యా...

థియేటర్‌లో విడుదల అనే సినిమా తీశాం. ఇలాంటి సినిమాను థియేటర్‌లో చూస్తేనే కిక్‌ ఉంటుంది. కానీ ఏం చేస్తాం. కరోనా వల్ల పరిస్థితుల తారుమారు అయ్యాయి. ఓ రోజున సినిమా ఓటీటీకి వెళ్తుంది అని చెప్పగానే కాస్త డిస్సపాయింట్‌ అయ్యా. బాధ ఉన్నప్పటికీ సినిమా బాగా వచ్చిందనే తృప్తితో ఆనందంగా ఉన్నా.

ఆయన్ను మిస్‌ అవుతున్నా...
జనరల్‌గా నా సినిమాలో గోదావరి యాస ఉంటుంది. ఈ సినిమా కోసం అనంతపురం యాస ఉయోగించాం. స్ర్కిప్ట్‌ కో ఆర్టినేటర్‌గా సత్యానంద్‌గారు పనిచేశారు. గణేశ్‌ పాత్రోగారిని మిస్‌ అవుతున్నా. సంగీతం విషయంలో నా అసోసియేషన్‌ ఎక్కువ మిక్కీ.జె. మేయర్‌తోనే ఉంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమాకు ఆయన అయితే బావుంటుందని తీసుకున్నా.

గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చింది..
ఏ రంగంలో అయినా జయాపజయాలు సహజం. ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్‌ అయినందుకు బాధ పడలేదు. కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫెయిల్‌ కావచ్చు. కానీ దర్శకుడిగా మనం ఫెయిల్‌ కాము. మామూలుగానే నేను స్లోగా సినిమాలు తీస్తా. ఈసారి కాస్త గ్యాప్‌ ఎక్కువ వచ్చింది. అది నేను తీసుకున్నది కాదు.. అలా వచ్చింది అంతే! కరోనా గోల లేకపోతే నారప్ప ఏడాదిన్నక క్రితమే వచ్చుండేది. ఇప్పుడు కాస్త స్పీడ్‌ పెంచుతా.

మూడు భాగాలుగా...
‘అన్నాయ్‌’ సినిమాను మూడు భాగాలుగా చేయబోతున్నా. 1970లో సాగే పక్కా యాక్షన్‌ సినిమా ఇది. గీతా ఆర్ట్స్‌లో ఈ సినిమా ఉంటుంది. హీరోగా ఎవరినీ అనుకోలేదు. వేరే జానర్‌కి నేను షిప్ట్‌ అవ్వలేదు. జానర్‌వారీగా సెలెక్ట్‌ చేసకుంటున్నా. ఎన్ని రకాలు చేసినా నా శైలి మానవ సంబంధాలను మరచిపోను. ప్రస్తుతం ఓటీటీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చాలా అవకాశాలు దొరుకున్నాయి. కంటెంట్‌ ఉంటే ఓటీటీలో కూడా మంచి సినిమాలు చేయొచ్చు.