తెతెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు
close

ప్రధానాంశాలు

తెతెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే-షాద్‌నగర్‌: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు నియమితులయ్యారు. ఆయన పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ఇటీవల వరకు తెతెదేపా అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పలువురు నేతల పేర్లను పరిశీలించినప్పటికీ నర్సింహులు నియామకానికే చంద్రబాబునాయుడు మొగ్గు చూపారు. చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లను నర్సింహులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యకర్త నుంచి అధ్యక్ష స్థానానికి..

బక్కని నర్సింహులు తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. షాద్‌నగర్‌ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ ఆయన స్వగ్రామం. 1983లో పార్టీలో కార్యకర్తగా చేరారు. 1994లో షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్‌)లో ప్రత్యర్థి శంకర్‌రావుపై 45 వేలకు పైచిలుకు ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఇదే అత్యధిక మెజారిటీ. 1999లో భాజపాకు ఈ స్థానాన్ని పార్టీ కేటాయించింది. 2004 ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన నర్సింహులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. పార్టీ ఎస్సీ, ఎస్టీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెదేపా జాతీయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

పార్టీకి పూర్వవైభవం తెస్తా: బక్కని

పార్టీ నుంచి ఏనాడూ పదవులు ఆశించలేదని, ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ వచ్చానని బక్కని నర్సింహులు అన్నారు. ఇప్పుడు అందుకున్న బాధ్యత చాలా పెద్దదని, చిత్తశుద్ధితో పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని