Advertisement

ఉద్యమానికి పుట్టినిల్లు.. గుమ్మలక్ష్మీపురం..

Jul 22 2019 @ 05:29AM

  • నాటి పోరాట చైతన్యమే నేటి గిరిజనాభివృద్ధి
  • శ్రీకాకుళం ఉద్యమానికి 52 ఏళ్లు పూర్తి
కడుపు మండిన చోట పోరాటం పుడుతుంది.. ఆవేదన నిండిన గుండెల్లో ఆవేశం రాజుకుంటుంది. తమ హక్కులను కాలరాసి, తమ నోటికాడ కూడును లాగేసుకుంటే.. తమను కాళ్లకింద తొక్కే ప్రయత్నం చేస్తుంటే ప్రతి చేయీ ఉద్యమం కోసం పిడికిలి బిగిస్తుంది... సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటం పురుడుపోసుకుంది.. తమ భూములను తీసుకున్న దోపిడీ దారులపై గిరిజనులు ఉద్యమ బావుటా ఎగరవేశారు.. ఆ పోరాటానికి గిరిజన ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం వేదికయ్యింది...
 
(గుమ్మలక్ష్మీపురం)
నాటి శ్రీకాకుళంలో గిరిజన రైతాంగ సాయుధ పోరాటం పురుడు పోసుకుంది. గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతం నాటి నుంచి నేటి వరకూ గిరిజన సమస్యలపై జరిగిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు నిలయమైంది. ఆ పోరాటాల ఫలితంగానే గిరిజనులు తమ హక్కులను సాధించుకుంటున్నారు. శ్రీకాకుళం ఉద్యమం జరిగి 52 ఏళ్లు గడిచిన సందర్భంగా నాటి ఉద్యమాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం...
 
1967 సంవత్సరంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పాణిగ్రాహి చౌదరి తేజేశ్వరరావు, నాగభూషణ పట్నాయిక్‌ తదితర విప్లవ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఉద్యమం ప్రారంభమయ్యింది. నాటి గిరిజనులపై దోపిడీకి, కంబారీ వ్యవస్థకు, గిరిజనుల భూములను గిరిజనేతరులు అక్రమంగా దోచుకున్న సంఘటనలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమయ్యింది. ఉద్యమం మూడేళ్లుగా జరుగుతుండడంతో జాతీయ నాయకుల దృష్టినీ ఆకర్షించింది. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర కమ్యూనిస్టు నాయకులు గిరిజనులను చైతన్యపరచడానికి 1967 అక్టోబరు 31న కురుపాం మండలం మొండెంఖల్‌ గ్రామంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నాటి సభను అడ్డుకోవడానికి ఆనాటి గిరిజనేతర భూస్వాములు మేడిది సత్యనారాయణ ఆధ్వర్యంలో సభకు వెళ్లే గిరిజనులను అటకాయించారు. ఈ సందర్భంగా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య జరిగిన ఘర్షన తీవ్ర రూపం దాల్చి కాల్పులకు దారి తీసింది. భూస్వాములు గిరిజనులపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోరన్న, మంగన్న అనే ఉద్యమకారులు తూటాలకు బలై అమరులయ్యారు. నాటి నుంచి ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంగా మారింది.
 
నక్సలబరీ సహకారంతో...
ఇదిలాఉండగా అదే సమయంలోనే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నక్సల్‌బరీ ఉద్యమం జరుగుతోంది. నాటి నక్సల్‌బరీ ఉద్యమానికి, ఇక్కడి శ్రీకాకుళం రైతాంగ పోరాటానికి సారూప్యత ఉండటంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన నాయకులు చారుమజుందార్‌, కానీ సంధ్యా శ్రీకాకుళం ఉద్యమానికి సహకరించారు. ఈ ఉద్యమకారులకు నాటు తుపాకులు, బాంబులు, గ్రానైట్స్‌, తదితర మందుగుండు సామగ్రిని అందజేశారు. ఈ ఉద్యమం మూడేళ్ల పాటు తీవ్ర రూపం దాల్చింది. నక్సలైట్‌ నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం ఆధ్వర్యంలో ఉద్యమకారులు గిరిజనేతర భూస్వాములను హతమార్చడం, భూస్వాముల వద్ద గల భూములను స్వాధీనం చేసుకుని పేద గిరిజనులకు పంపిణీ చేయడం, భూస్వాముల నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులను దోపిడీ చేసి గిరిజనులకు పంపిణీ చేయడం, తదితర కార్యక్రమాలను చేపట్టారు. గిరిజన వ్యవసాయ కూలీలకు గిట్టుబాటు కూలీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో నాటి ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌, ఏపీఎస్పీ దళాలను మొహరించింది. ఈ ఉద్యమాన్ని అణచివేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్లు, ఉద్యమకారుల అరెస్టులు వంటి సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలతో ఉద్యమానికి కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 1970 జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం కురుపాం మండలం బోడికొండ వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. ఆ తరువాత నిమ్మల కృష్ణమూర్తి, ఆరిక సూర్యనారాయణ, శ్రీరాములు, తదితర గిరిజన నాయకులు అరెస్టు అయ్యారు. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. జీసీసీ, ఐటీడీఏ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలకు ఐఏఎస్‌ అధికారులను నియమించారు.
 
గిరిజనులకు అభివృద్ధి ఫలాలు...
1975 నుంచి గిరిజనులకు అభివృద్ధి ఫలాలు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి, వ్యవసాయ అభివృద్ధి, తోటల పెంపకం, తదితర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నాటి కార్యక్రమాలతో నేటి గిరిజనుల్లో కొంతవరకు అభివృద్ధి కనిపిస్తోంది. గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగ, ఉపాధిపరంగా కొంతవరకు ముందుకు వచ్చారు. నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట ఉద్యమం జరగకపోతే నేటి గిరిజనాభివృద్ధి కనిపించేది కాదు. శ్రీకాకుళం ఉద్యమానికి మారిన గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతం నేటికీ చరిత్రలో నిలిచిపోయింది.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.