Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ ఒక్కటే మార్గమని ప్రపంచదేశాలు భావించాయి. డబ్లూహెచ్ఓ సూచనల మేరకు లాక్డౌన్ విధించి ఇప్పటికి యాభైరోజులు దాటింది గత యాభై రోజులుగా ఇళ్ళలోనే ఉన్న పిల్ల, పెద్ద అందరూ రోటీన్‌గా ఆడుకునే క్యారమ్స్, చెస్‌లు ఆడేసుకున్నారు. ఇరవై నాలుగ్గంటలూ స్లిప్‌టెస్టులు, వీకెండ్ టెస్టులు, యూనిట్టెస్టులు అంటూ రకరకాల టెస్టులు, మార్కులు, ర్యాంకులతో బిజీగా ఉండే పిల్లలు హఠాత్తుగా సెలవుల్లో ఉంటే ఏమీ తోచక అల్లరి చేస్తుంటారు. ఆట అంటేనే విజ్ఞానం వినోదం కలగలిసిన క్రియ. పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి ఆడుకుంటే వారికి హుషారు వస్తుంది. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుజాతి ఎన్నో రకాల ఆటలను ఆడుకుందని ఆనాటి చిత్రాల ద్వారా, సాహిత్యం ద్వారా తెలుసుకున్నారు. ఆ ఆటల గురించి ఈ రోజు నేర్చుకుందాం.
అచ్చనగండ్లు, ఒప్పులకుప్ప, కాళ్ళగజ్జె, కోతి కొమ్మచ్చి, గుడుగుడుగుంచం, చిప్పచిప్పగోళ్ళు, ఈత, చెమ్మచెక్క, తొక్కుడు బిళ్ళ, దూదుంపుల్ల, పులి-మేక, ఉప్పబట్టెలు, వామన గుంటలు, పులిజూదం, ఈలకూతలు, సరితేసులు వంటి ఆటలు మన ప్రాచీనులు బాల్యంలో ఆడుకొని ఆనందించనట్లు ఆనాటి సాహిత్యం ద్వారా తెలుస్తుంది. ఇవి మాకు తెలియపోయినా మా చిన్నతనంలో నాలుగుస్తంభాలాట, గోలీలాట, బొంగరాలాట, దాగుడుమూతలు, పాము పటం, పచ్చీస్, వంటి ఆటలెన్నో ఆడుకున్నాం.
బొంగరాలు
మా చిన్నతనంలో ఆడినట్లుగా బొంగరానికి ఒక మేకు ఉండి దారం చుట్టి, ఆ దారాన్ని ఒడుపుగా లాగితే గుండ్రంగా గిరగిరా తిరుగుతుంది. దీనికి కొంత హస్త లాఘవం అవసరం. బొంగరం మేకు లోపలికి పోయింది, కొద్దిగా బయటికి వచ్చింది అంటూ దాన్ని లోపలికీ బయటికీ లాగుతుండే వాళ్ళం. ఇప్పుడు ఈ ఇబ్బంది లేదు. ఇప్పటి బొంగరాలకు తాడు ఉండటం లేదు. ఎన్నో మోడల్స్ దొరుకుతున్నాయి. మరీ సంవత్సరం, రెండు సంవత్సరాల లోపు పిల్లలు బొంగరం తిరగటాన్ని చాలా ఆనందిస్తారు. తిరిగే బొంగరాన్ని తాడుతో లాగి చేతిమీద, చిన్న పిల్లల పొట్టమీదకు లాగితే అలాగే తిరుగుతూ ఉండడం విశేషం. బొంగరాన్ని తిప్పటం అంటే పిల్లల నైపుణ్యానికి పరీక్ష.
నాలుగు స్తంభాలాట
నాలుగు వైపులా నాలుగు గుండ్రాలు గీసి ఉంటాయి. నలుగురు ఆటగాళ్ళు నాలుగు వృత్తాలలో నిలబడతారు. మధ్యలో రాళ్ళు:టాయి. వీళ్ళు దొంగ చేతికి చిక్కకుండా ఆ రాళ్ళను తీసుకొని వాళ్ళ వృత్తాలలో పెట్టుకోవాలి. రాళ్ళు తీసుకునేటపుడు దొంగ అంటుకుంటే అవుటయిపోయినట్లే. చారు చారు పప్పుచారు అంటూ ఈ నాలుగు స్తంభాలాటను ఆడతారు.
అచ్చన గల్లాలు
ఇది రాళ్ళతో ఆడే ఆట. ఇందులో ఐదు రాళ్ళుంటాయి. పాలరాళ్ళను గుండ్రంగా సాది వాటితో ఆడుకుంటారు. ఒక రాయిని పైకెగరవేసి మిగతా రాళ్ళతో సహాపట్టుకోవాలి. ఈ ఆటలో ఐదు స్టెప్పులుంటాయి. మొదట ఒక్కొక్క రాయిని విడివిడిగా ఎగరేసి పట్టుకుంటారు. తరువాత ఐదింటిని చెయ్యి తిరగదిప్పి వెనక వైపుకు పడేలా పట్టుకొని ఆడాలి. చివరకు ఎడమ చెయ్యిని వేళ్ళు దూరంగా ఉండేలా పెట్టి ఆ సందుల్లోంచి రాళ్ళను లోపలికి పోయేలా కుడిచేత్తే ఆడతారు. తర్వాత ఒక రాయి పైకెగరవేసి లోపలికి నెట్టిన నాలుగు రాళ్ళను ఒకేసారి పట్టుకోవాలి. చాలా సరదాగా ఉంటుందీ ఆట. ఇప్పటి పిల్లలకు ఎక్కువ తెలియదు కాబట్టి నేర్పిస్తే బాగుంటుంది.
నేల, బండ
ఇలా ఆటలు ఆడుకునేటపుడు మొదట పంటలు వేసుకుంటారు. ముగ్గురు పిల్లలు కలిసి చప్పట్లను మూసినట్లు వేయడం, తెరచినట్లు వెయ్యటం ద్వారా నవ్వు పండావుపో అంటారు. చివరకు మిగిలిన వాళ్ళు దొంగ అన్నమాట. దొంగ నేలా, బండా అని అడగాలి. వాళ్ళు బండ అంటే అందరూ బండల మీద నిలబడాలి. ఒక బండ మీద నుంచి మరొక బండ మీదకు మారుతున్నపుడు దొంగ పట్టుకోవాలి. దొంగ నేలమీద ఉండాలి. ఎవరో ఒకరు అవుటయ్యే వరకు దొంగ పట్టుకోవటానికి ప్రయత్నించడమే ఈ ఆట. అప్పట్లో మట్టినేలలు ఉండేది కాబట్టి ఈ ఆట ఆడుకోవటానికి చక్కగా సరిపోయింది. ఇప్పటి పిల్లలు ''కార్పెట్టా, ఫ్లోరా'' అని ఆడుకోవాలేమో!
దాగుడుమూతలు
ఇది ఏకాలంలో నైనా మంచి కిక్కిచ్చే ఆట. ఇప్పటి పిల్లలు 'హైడ్ అండ్ సిక్' ఆడుతున్నారు. పూర్వం ఒకరు తల్లి అని బల్ల మీద కూర్చుని ఒకళ్ళ కళ్ళు మూసి ''దాగుడు మూతలు దండాకోర్! పిల్లీ వచ్చే ఎలుకా భద్రం, ఎక్కడి వాళ్ళక్కడే గప్‌చుప్ సాంబారు బుడ్డీ'' అని ఆ తర్వాత వాళ్ళ కళ్ళ మీద చెయ్యి తీసి మిగతా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కోమంటారు. పిల్లలు అంతా తిరిగి ఎదరు దొరుకుతారా అని చూస్తారు. అప్పట్లో అందరిళ్ళలో ధాన్యం బస్తాలు ఉండేవి. వాటి వెనుక కానీ బస్తాల పైకెక్కికానీ దాక్కునే వాళ్ళు. చాలా సరదాగా ఉంటుందీ ఆట.
ఇవన్నీ పాత కాలపు ఆటలు. ఇప్పటి కాలపు కొత్త ఆటలు కొత్త తరహాలో చూద్దాం. ఇప్పుడు అపార్టుమెంట్ కల్చర్ ఎక్కువగా ఉన్నది. అపార్టుమెంటులో అంటే ఇంట్లో కాకుండా కింద ప్లే గ్రౌండ్లో కాకుండా కొద్దిగా బయటికి వచ్చిన ఫీలింగ్‌తో ఆడుకోవాలంటే కారిడార్లు బెస్ట్. పొడుగైన కారిడార్లలో పిల్లలకు మనం తయారు చేసిన ఆటలు ఆడించవచ్చు. ఒకచోట వృత్తం గీసి దాన్నుంచి ఒక గీత గీయాలి. తరువాత చతురస్రం, దీర్ఘచతురస్రం ఇలా గీసి వాటి నన్నింటినీ ఒక గీతతో కలపాలి. ఈ గీత మీద అక్కడక్కడ క్లోజ్, ఓపెన్, జంప్ అని రాయాలి. పిల్లల్ని ఆ గీత మీదే నడవమనాలి. వృత్తంలో గుండ్రంగా తిరగాలి. మరల ఓపెన్ అని రాసిన చోట బయటకు రావాలి. జంప్ అని రాసిన చోట గెంతాలి. ఇదంతా ఏదో సరదాగా, తమాషాగా ఉంటుంది. వాళ్ళకు గీత మీదే నడవగలిగే ఏకాగ్రత్త వస్తుంది. మధ్యలో పెట్టెల్లాగా గీసిన వాటి ఆకారాలు తెలుస్తాయి.
ఇంతే కాకుండా రిబ్బన్లు పొడవాటివి తీసుకొని రకరకాల ఎత్తుల్లో కట్టాలి. అవి తగలకుండా దూరి వెళ్లమనాలి. మరీ కిందకు కట్టి ఉంటే రిబ్బను తగలకుండా దాటి వెళ్ళమనాలి. ఇలా పిల్లలిద్దరికీ చెప్పి ఎవరు కరెక్టేగా ఆడతారో వారికి చాక్లెట్ బహుమతిగా ఇస్తామని చెప్పాలి. ఇలా పిల్లలతో సరదాగా చేయించవచ్చు. మరి కొన్ని ఆటలతో మరొకసారి కలుద్దాం.
- కందేపి రాణీప్రసాద్