Share News

ఖమ్మంలో కుమ్ములాట!

ABN , First Publish Date - 2023-11-19T03:48:56+05:30 IST

ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు!? తెలంగాణలోనే కాదు.. సరిహద్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశమిది

ఖమ్మంలో  కుమ్ములాట!

మరోసారి తుమ్మల, పువ్వాడ హోరాహోరీ ఢీ

హ్యాట్రిక్‌ కొట్టాలని అజయ్‌ కుమార్‌ ఉత్సాహం

ప్రతీకారం తీర్చుకోవాలని నాగేశ్వర్‌ రావు సంకల్పం

కమ్మ, మైనారిటీ, టీడీపీ సానుభూతిపరులు కీలకం

సీపీఐ పొత్తు ధర్మాన్ని పాటించడంపైనా చర్చ

ఒకరు.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మంత్రి! మరొకరు యంగ్‌ టర్క్‌ మంత్రి! ఇద్దరూ కమ్మ సామాజిక వర్గమే! ఇద్దరూ జిల్లాకు రెండు కళ్లు! ఒకరు పైచేయి చాటాలని భావిస్తుంటే.. మరొకరు ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పం చెప్పుకొన్నారు! ఆ ఇద్దరిలో ఒకరు తుమ్మల నాగేశ్వరరావు అయితే.. మరొకరు పువ్వాడ అజయ్‌ కుమార్‌! నిన్న మొన్నటి వరకూ ఒకే పార్టీలో ఉన్న వీరు ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు! అందుకే, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో ‘బిగ్‌ ఫైట్‌’ జరుగుతోంది!

మ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు!? తెలంగాణలోనే కాదు.. సరిహద్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశమిది! మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌ కొడతారా!? లేక తుమ్మల నాగేశ్వరరావు ప్రతీకారం తీర్చుకుంటారా!? అంటూ చర్చలే కాదు.. పందాలూ సాగుతున్నాయి. ఇందుకు కారణం.. ఆ ఇద్దరి మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు సాగుతుండడమే! నిజానికి, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లే అధికంగా ఉన్నాయి. ఇద్దరు కమ్మ అభ్యర్థుల ముఖాముఖి పోరులో వారి సొంత సామాజికవర్గం ఎవరికి అండగా నిలుస్తుందనే అంశం ఇక్కడ కీలకంగా మారింది. అలాగే, నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు నిర్ణయాత్మక శక్తి కానున్నాయి. కమ్మ సామాజికవర్గం తర్వాతి స్థానంలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు ఎటువైపు ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఖమ్మంలో ఇప్పుడు ఆ పార్టీల ఓటు బ్యాంకు చాలా వరకూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు బదిలీ అయిపోయింది. దీనికితోడు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె్‌సతో సీపీఐ జత కట్టింది. విచిత్రంగా, అదే పార్టీకి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజయ్‌! దాంతో, ఇక్కడ సీపీఐ క్యాడర్‌ పొత్తు ధర్మాన్ని పాటిస్తుందా!? లేదా!? అనే చర్చ సాగుతోంది. ఇక, ఇక్కడ టీడీపీ సానుభూతి ఓటు బ్యాంకు కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మలకు టీడీపీ మద్దతు ప్రకటించి.. ప్రచార పర్వంలో కలిసి సాగుతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలున్నాయి.

హ్యాట్రిక్‌ కోసం..

ఖమ్మం బరిలో పువ్వాడ, తుమ్మల రెండోసారి తలపడుతున్నారు. తొలుత, 2014లో తుమ్మల టీడీపీ నుంచి పోటీ చేయగా అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన పువ్వాడ కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో తుమ్మలపై గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరి.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా తొలిసారిగా క్యాబినెట్‌లో పనిచేసే అవకాశం లభించింది. మూడోసారి కూడా ఖమ్మం నుంచి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలన్న సంకల్పంతో పువ్వాడ ఉన్నారు. ఖమ్మం నియోజక వర్గంలో ఎవరూ మంత్రి కాలేదని, తాను మంత్రి కావడంతోనే అభివృద్ధి సాధ్యమైందని, ఖమ్మానికి తాను లోకల్‌ అభ్యర్థినని, ఈ గడ్డపై పుట్టా, ఈ మట్టిలోనే కలుస్తా అంటూ స్థానికతను ప్రచారంలో లేవనెత్తుతున్నారు.

ఓడిన చోటే గెలిచి ప్రతీకారం కోసం..

ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో 2014లో పువ్వాడ చేతిలోనే ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల ఈసారి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. నిజానికి, ఆయనను గెలుపు, ఓటమి ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పదిసార్లు తలపడగా ఐదుసార్లు ఓడిపోయారు. ఐదుసార్లు గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పాలేరు టీఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తుందని.. గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావించినా అది జరగలేదు. దాంతో, రాజకీయంగా తాను సుదీర్ఘ కాలంపాటు పోరాడిన కాంగ్రె్‌సలో చేరి అనూహ్యంగా ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తలపడుతున్నారు. మంత్రి పువ్వాడతో సై అంటే సై అంటూ దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు. విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ ప్రచార జోరును పెంచారు. ఇటీవల మంత్రి పువ్వాడ ‘నేను లోకల్‌.. తుమ్మల నాన్‌ లోకల్‌’ అని వ్యాఖ్యానించడంతోపాటు పాలేరులో చెల్లని రూపాయి.. ఖమ్మంలో చెల్లుతుందా అని విమర్శించారు. అందుకు స్పందించిన తుమ్మల.. ‘‘నేను ఖమ్మం జిల్లాకే లోకల్‌, ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా. నేను డాలర్‌లాంటివాడిని. జిల్లాలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతా’’ అంటూ దీటుగా స్పందించారు.

ఇద్దరిదీ అభివృద్ధి మంత్రమే

ఖమ్మంలో పువ్వాడ, తుమ్మల కాకుండా సీపీఎం నుంచి యర్రా శ్రీకాంత్‌, బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థిగా మిర్యాల రామకృష్ణ, బీఎస్పీ అభ్యర్థిగా అయితగాని శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు బరిలో ఉన్నారు. అయినా, ఇక్కడ ముఖాముఖి పోరే సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ అభివృద్ధి నినాదంతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఖమ్మం అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని చెప్పుకొంటున్నారు. తాను రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని, మళ్లీ గెలిస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తానని పువ్వాడ వివరిస్తున్నారు. తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ హయాంలో ఖమ్మం నియోజకవర్గంతోపాటు ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మౌలిక సదుపాయాలు కల్పించానని, టీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత కూడా రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వివరిస్తున్నారు.

ఖమ్మం - ఆంధ్రజ్యోతి

పువ్వాడ బలాలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రూ.2 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు

నియోజకవర్గంలో వాడవాడకు పువ్వాడ పేరుతో సమస్యల పరిష్కారానికి తీసుకున్న చొరవ

బలహీనతలు

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌పై, ఎమ్మెల్యేపై సాధారణంగా ఉండే వ్యతిరేకత

మంత్రిగా సాధారణ ప్రజలకు దూరం కావడం, టీడీపీ సానుభూతిపరులకు దగ్గర కాలేకపోవడం

అభివృద్ధి పనుల నాణ్యతపై విమర్శలు రావడం

ఆయన వెంట ఉన్న కొందరు కార్పొరేటర్లు, సర్పంచ్‌లు పార్టీ మారడం

తుమ్మల బలాలు

మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం

ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో చేసిన అభివృద్ధి పనులు

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన తొలి నేత కావడం, టీడీపీ శ్రేణులు అండగా నిలవడం

బలహీనతలు

ప్రత్యర్థి కంటే ఆర్థికంగా బలహీనుడు కావడం

ఒక ఎన్నికలో గెలిస్తే.. మరోసారి ఓటమి

పాలవడం

మా తాతకు ఓటేయండి

ఈ చిచ్చర పిడుగులను చూశారా!? ముగ్గురూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనవళ్లు! వీరిలో ఇద్దరు కొడుకు యుగంధర్‌ తనయులైన ప్రయాగ్‌, యువాన్‌! మరొకడు కూతురు కొడుకు హితేష్‌! చిరునవ్వులు చిందిస్తూ తమ తాతకు ఓటేయాలంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. తుమ్మల రోడ్‌ షోలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రఘునాథపాలెం

మా డాడీకి ఒక్క చాన్స్‌ ఇవ్వండి

‘‘మీకు దండం పెడతా! మా డాడీకి ఒక్క చాన్స్‌ ఇవ్వండి. ఎన్నికల్లో ఆయనను గెలిపించండి. నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడు’’ అంటూ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డి ప్రచారం చేస్తున్నారు! హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్న శ్రీనిక రెడ్డి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించినప్పటి నుంచీ కౌశిక్‌ రెడ్డి వెంటే ఉంటున్నారు. ప్రతి రోజూ ప్రచారంలో పాల్గొంటూ మా డాడీకి ఒక్క చాన్స్‌ ఇవ్వండి అంటూ ప్రజలను కోరుతున్నారు. శనివారం హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేశారు.

హుజూరాబాద్‌

మెడలో చెప్పుల జత

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ‘గొడుగు’ గుర్తు వస్తే దానిని చూపించి ఓట్లడుగుతారు! ‘మైకు’ గుర్తు వస్తే చేతిలోనే మైకుంటుంది. మరి ‘చెప్పుల జత’ గుర్తు వస్తే? వికారాబాద్‌జిల్లా, తాండూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్‌ ముస్తఫా రిజ్వాన్‌కు ఆ గుర్తే వచ్చింది. దీంతో రిజ్వాన్‌.. ఇలా చెప్పుల జత మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు.

తాండూరు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌

నన్ను గెలిపిస్తే తేడా చెప్పిస్తా: నవ్య

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై అసభ్య చేష్టల ఆరోపణలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచిన హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం జానకీపురం గ్రామ సర్పంచి కుర్సపల్లి నవ్య గుర్తున్నారా!? స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు! ఎన్నికలకు ఆమె మ్యానిఫెస్టో కూడా విడుదల చేశారు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిన ఓ కీలక అంశాన్ని ఆమె తన మ్యానిఫెస్టోలో చేర్చారు. అదే.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. గ్రామాల స్థాయిలో ఆడపిల్లలకు చెడు స్పర్శ, మంచి స్పర్శ (గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌)పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పడమే! ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూస్తానని, ఏదైనా జరిగితే న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

జనగామ- ఆంధ్రజ్యోతి

ఇదీ మ్యానిఫెస్టో హామీయేనా!?

ఒకటో తేదీనే జీతాల హామీపై విస్మయం

కాంగ్రెస్‌, బీజేపీ మ్యానిఫెస్టోలను గమనించారా!? వాటిలో రెండు పార్టీలూ పెట్టిన ఒక హామీని గుర్తించారా!? ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా కచ్చితంగా ఒకటో తేదీనే జీతాలు ఇస్తామనేదే ఆ హామీ! ఈ అంశం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లోనే కాదు.. అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామనేది ఎన్నికల్లో పార్టీలు వెల్లడించే మ్యానిఫెస్టో హామీగా మారడంపై ప్రతి ఒక్కరూ నివ్వెరపోతున్నారు. నెల రోజులు పని చేసినందుకు జీతాలు పొందడం ఉద్యోగుల హక్కు! ఒకటో తేదీనే వాటిని ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత! కొన్ని దశాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం అమలవుతోంది! కానీ, మారిన పరిస్థితుల్లో ఇది మ్యానిఫెస్టో హామీగా మారడమే దౌర్భాగ్యమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి

అమ్మకానికి కేసీఆర్‌ గుడి

ఆయన తెలంగాణ ఉద్యమకారుడు! రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమంలో పాల్గొన్నాడు! లాఠీ దెబ్బలు తిన్నాడు. ఆస్తులను అమ్ముకొన్నాడు. కేసీఆర్‌పై అభిమానంతో గుడి కట్టి అందులో పాలరాతి విగ్రహం కూడా పెట్టాడు! ప్రభుత్వం రాష్ట్ర సాధన ఆశయాలను నెరవేర్చలేదని, వ్యక్తిగతంగా తనకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ గుడిని అమ్మకానికి పెట్టాడు. ఆయనే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండ రవీందర్‌! ఇంటి ఎదుట గతంలో నిర్మించిన కేసీఆర్‌ గుడి, విగ్రహం అమ్మకానికి పెట్టాడు. శనివారం అతడి ఇంటి వద్ద అమ్మకానికి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

దండేపల్లి

అది రాజనర్సింహల అడ్డా

నాలుగున్నర దశాబ్దాలుగా అక్కడ తండ్రీ కొడుకులే అభ్యర్థులు! అది కూడా ఒకే పార్టీ నుంచి! అక్కడ ఇప్పటి వరకూ 14 సార్లు ఎన్నికలు జరిగితే.. 13 సార్లు వారికే టికెట్‌! అందులోనూ తొమ్మిదిసార్లు కుమారుడే పోటీ చేశారు. ఆ నియోజక వర్గం అందోలు! ఆ తండ్రీ కొడుకులు సిలారపు రాజ నర్సింహ, దామోదర రాజనర్సింహ! ఆ పార్టీ కాంగ్రెస్‌! జయాపజయాలను పక్కనపెడితే.. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ఆ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. అందోల్‌ 1962లో ఎస్సీలకు రిజర్వ్‌ అయింది. మొదటిసారి ఎస్‌ఎల్‌ దేవి కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పోటీ చేసి గెలిచారు. 1967లో సిలారపు రాజనర్సింహకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది. 1972, 1978 ఎన్నికల్లోనూ ఆయన గెలిచి మంత్రిగా పని చేశారు. 1983లో టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మళ్లీ టికెట్‌ దక్కింది. రాజనర్సింహ మరణంతో 1989లో ఆయన తనయుడు దామోదర రాజనర్సింహకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ ఆయనే కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జోగిపేట

Updated Date - 2023-11-19T03:48:57+05:30 IST