మూడు కొత్త మండలాలు

ABN , First Publish Date - 2022-07-24T04:12:12+05:30 IST

స్థానికుల డిమాండ్లు, పాలనా పరంగా సౌలభ్యంగా ఉంటుందనే అధికారవర్గాల నివేదికలు, అధికార పార్టీ ఎమ్మెల్యేల సూచనలు, ప్రజల్లోసానుకూల వాతావరణం కల్పించే అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 13 మండలాల్లో పాలమూరులోనూ మూడు ఉన్నాయి.

మూడు కొత్త మండలాలు

కౌకుంట్ల, గుండుమాల్‌, కొత్తపల్లి

ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల

అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువు


మహబూబ్‌నగర్‌, జులై 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానికుల డిమాండ్లు, పాలనా పరంగా సౌలభ్యంగా ఉంటుందనే అధికారవర్గాల నివేదికలు, అధికార పార్టీ ఎమ్మెల్యేల సూచనలు, ప్రజల్లోసానుకూల వాతావరణం కల్పించే అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 13 మండలాల్లో పాలమూరులోనూ మూడు ఉన్నాయి. ఈ మండలాల ఏర్పాటును ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మండలాల పరిధిని నిర్ణయిస్తూ ఆ ఉత్తర్వులను కలెక్టర్లకు పంపారు. అ ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు 15 రోజుల గడువు విధించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్‌ ద్వారా రెవెన్యూ మండలం ఏర్పాటు లాంఛనప్రాయంగా జరుగనుంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కౌకుంట్ల, నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో గుండుమాల్‌, కొత్తపల్లి మండలాలుగా ఏర్పాటు కానున్నాయి. దేవరకద్ర మండలంలోని ఆరు గ్రామాలు, సీసీకుంట మండలంలోని నాలుగు గ్రామాలతో కౌకుంట్ల మండలాన్ని ప్రతిపాదించగా, కోస్గి మండలంలోని ఎనిమిది గ్రామాలు, మద్దూరు మండలంలోని రెండు గ్రామాలతో కలిపి గుండుమాల్‌, మద్దూరు మండలంలోని 11 గ్రామాలతో కొత్తపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ప్రతిపాదించిన దుద్యాల మండలంలోకి కొడంగల్‌ నియోజకవర్గం కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లిని చేర్చారు. 


ఏ మండలంలో ఏయే ఊర్లు..

కౌకుంట్ల: దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల, గోపన్‌పల్లి, పుట్టపల్లి, పేరూరు, ఇస్రంపల్లి, రేకులంపల్లి, సీసీకుంట మండలంలోని ముచ్చింతల, దాసరిపల్లి, తిర్మలాపూర్‌, అప్పంపల్లి

గుండుమాల్‌ : కోస్గి మండలంలోని గుండుమాల్‌, సారంగరావుపల్లి, బోగారం, భక్తిమళ్ల, బలభద్రాయపల్లి, అప్పాయిపల్లి, అమ్లికుంట, ముదిరెడ్డిపల్లి, మద్దూరు మండలంలోని కొమ్మూరు, వీరారం. 

కొత్తపల్లి : మద్దూరు మండలంలోని కొత్తపల్లి, నిడ్జింత, భూనీడు, దుప్పట్‌ఘట్‌, గోకూల్‌నగర్‌, తిమ్మారెడ్డిపల్లి, పెద్దాపూర్‌, మన్నాపూర్‌, లింగాలఛేడ్‌, నందిగామ, అల్లీపూర్‌.

Updated Date - 2022-07-24T04:12:12+05:30 IST