తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిరెడ్డి
eenadu telugu news
Published : 23/11/2021 05:46 IST

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిరెడ్డి

హాలియాలో కోటిరెడ్డిని సన్మానిస్తున్న సాగర్‌ నియోజకవర్గ గిరిజన నాయకులు

గుర్రంపోడు, హాలియా- న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని ప్రకటించారు. మంగళవారం ఆయన నల్గొండలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

నాగార్జునసాగర్‌లో ఎంసీ కోటిరెడ్డి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి కుడిభుజంగా ఉంటూ ఆయన గెలుపు కోసం అహరహం కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోటిరెడ్డి 2015లో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆశీస్సులతో తెరాసలో చేరారు. 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్యకు మద్దతుగా పనిచేసి గెలిపించారు. నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన సీటును తనకు కేటాయించాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్‌ భగత్‌కు టికెట్‌ ఖరారు చేస్తూ ఆయనను గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు ఖరారు చేస్తూ తన మాట నిలబెట్టుకున్నారు. దీంతో పాటు రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారుతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తేరా చిన్నపరెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది.

పేరు: మంకెన కోటిరెడ్డి( ఎంసీ కోటిరెడ్డి)
పుట్టిన తేదీ: 15-10-1959
విద్యార్హతలు: బీఏ, ఎల్‌ఎల్‌బీ
స్వస్థలం: బోయగూడెం, తిరుమలగిరి సాగర్‌ మండలం
తల్లిదండ్రులు: బుచ్చమ్మ, మట్టారెడ్డి
భార్య, పిల్లలు: పద్మావతి, కుమారులు: సుజిత్‌రెడ్డి, అభిజిత్‌రెడ్డి,

రాజకీయ నేపథ్యం: వ్యవసాయ కుటుంబమైన కోటిరెడ్డి ఉన్నత విద్య పూర్తి చేసి 1984లో రాజకీయ ప్రవేశం చేశారు. 2005లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా నియమితులై 7 సంవత్సరాలు పని చేశారు. 1984 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డికి ముఖ్యఅనుచరుడుగా ఉన్నారు. 2015లో తెరాసలో చేరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని