Jan 02,2022 20:31

ఢిల్లీ : వెంకటేశ్‌ అయ్యర్‌.. కొన్ని నెలల క్రితం ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. యుఎఇలో జరిగిన ఐపిఎల్‌-14 రెండో అంచె ప్రారంభమైన తర్వాత అతని పేరు క్రికెట్‌ వర్గాల్లో మార్మోగింది. ఐపీఎల్‌-14 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున వెంకటేశ్‌ 10 మ్యాచ్‌లు ఆడి 370 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతని దశ తిరిగింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌ కోసం జాతీయ జట్టుకు ఎంపికై పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫి, విజయ్ హాజారే ట్రోఫిలో అయ్యర్‌ అద్భుతంగా రాణించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 27 ఏళ్ల ఆల్‌రౌండర్‌ త్వరలో వన్డేల్లో కూడా అరంగేట్రం చేయనున్నాడు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యాడు. వన్డే జట్టులో చోటుదక్కడంపై అయ్యర్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా తానెంటో నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. భవిష్యత్తు గురించి పెద్దగా కంగారు పడకుండా రిలాక్స్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు అయ్యర్‌ పేర్కొన్నాడు.
'నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాను. దక్షిణాఫ్రికా పిచ్‌లు ఎక్కువగా బౌన్స్‌కు అనుకూలిస్తాయి. బౌన్సీ పిచ్‌లపై ఒక బౌలర్‌, ఫీల్డర్‌, బ్యాటర్‌గా నా పాత్రను ఎలా నిర్వర్తించాలనే దానిపై అన్ని విధాల సన్నద్ధం అవుతున్నాను. దక్షిణాఫ్రికాకు చేరుకున్న వెంటనే ప్రాక్టిస్‌ సెషన్‌లో పాల్గంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉంది' అని వెంకటేశ్‌ అయ్యర్‌ అన్నాడు. సౌతాఫ్రికా, భారత్‌ మధ్య తొలి వన్డే జనవరి 19, రెండో వన్డే జనవరి 21, మూడో వన్డే జనవరి 23న జరగనున్నాయి.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), జస్ప్రిత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌),శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కొహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ