భారత హేతువాద సంఘం ఛైర్మన్‌ వెంకటాద్రి కన్నుమూత

ప్రముఖ హేతువాది, భారత హేతువాద సంఘం ఛైర్మన్‌ రావిపూడి వెంకటాద్రి (101) శనివారం సాయంత్రం కన్నుమూశారు.

Updated : 22 Jan 2023 05:46 IST

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ప్రముఖ హేతువాది, భారత హేతువాద సంఘం ఛైర్మన్‌ రావిపూడి వెంకటాద్రి (101) శనివారం సాయంత్రం కన్నుమూశారు. చీరాలలో కుమారుడి దగ్గర ఉంటున్న ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెంకటాద్రి 1922లో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో వెంకయ్య, వెంకట సుబ్బమ్మలకు జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. 1956 నుంచి 1996 వరకు నాగండ్ల సర్పంచిగా పని చేశారు. వెంకటాద్రి తొలుత రామభక్తుడు. చిన్నం రామయ్య అనే గ్రామస్థుడి ప్రభావంతో నాస్తికుడిగా మారారు. త్రిపురనేని రామస్వామి శిష్యుడైన వెంకటాద్రి 1943లో ఆయన మరణానంతరం నాగండ్లలో కవి రాజాశ్రమం స్థాపించారు. ప్రథమ వార్షికోత్సవానికి అన్నాదురై, పెరియార్‌ రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాస్తిక భావజాలానికి సంబంధించిన ముఖ్య గ్రంథాలను తమిళనాడులోని పెరియార్‌ గ్రంథాలయం నుంచి, వైజ్ఞానిక అంశాల కోసం సైన్సు, తాత్విక గ్రంథాలను లండన్‌ నుంచి తెప్పించుకొని అధ్యయనం చేశారు. 1946లో దేహ్రాదూన్‌లో నిర్వహించిన హేతువాద అధ్యయన తరగతుల్లో ఎంఎన్‌ రాయ్‌ను కలిశారు. 1949లో ముస్సోరిలో జరిగిన అధ్యయన తరగతుల్లో ప్రసంగించారు. 1979లో రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, హేతువాద ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. విదేశాల్లో పర్యటించి హేతువాద ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. 1982లో హేమా పబ్లికేషన్స్‌ను ఏర్పాటు చేసి హేతువాద, మానవవాద గ్రంథాలను వందల సంఖ్యలో రచించారు. 1982 నుంచి హేతువాది మాసపత్రిక ఎడిటర్‌గా ఉన్నారు. 1991లో ఇంకొల్లులో రాడికల్‌ హ్యూమనిస్టు సెంటర్‌ ఏర్పాటు చేశారు. 2002లో భారత హేతువాద సంఘం ఛైర్మన్‌గా ఎన్నికై 2008 వరకూ పని చేశారు. 2008-10 మధ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు. మళ్లీ 2010 నుంచి ఇప్పటి వరకూ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. వెంకటాద్రికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి పట్ల భారత హేతువాద సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కుర్రా హనుమంతరావు, మేడూరి సత్యనారాయణ, హేతువాద సంఘాల ప్రముఖులు కరి హరిబాబు, షేక్‌ బాబు, దరియావలి, రాజా, రాధాకృష్ణ, రాజశేఖర్‌ టి.హరిబాబు సంతాపం తెలిపారు. వెంకటాద్రి పార్థివ దేహాన్ని ఇంకొల్లు రాడికల్‌ హ్యూమనిస్టు సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంచి, అనంతరం స్వగ్రామం నాగండ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు