logo

రఘునాథ్‌కే భాజపా అభ్యర్థిత్వం..

భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకర్గ అభ్యర్థిగా వెరబెల్లి రఘునాథ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొదటినుంచి ఉత్కంఠ కొనసాగించిన అధిష్ఠానం ఎట్టకేలకు రఘునాథ్‌ వైపే మొగ్గు చూపింది.

Published : 03 Nov 2023 05:21 IST

మంచిర్యాల అర్బన్‌, న్యూస్‌టుడే: భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకర్గ అభ్యర్థిగా వెరబెల్లి రఘునాథ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొదటినుంచి ఉత్కంఠ కొనసాగించిన అధిష్ఠానం ఎట్టకేలకు రఘునాథ్‌ వైపే మొగ్గు చూపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు కేంద్ర, రాష్ట్రస్థాయిలో ఉన్న నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో భాజపా తరఫున పోటీచేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన భారాస అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో మరోసారి తలపడనున్నారు. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కల్ల మల్లారెడ్డి పలు ప్రయత్నాలు చేసినా నిరాశే మిగిలింది. మరోవైపు బీసీ వాదం ఉన్నందున భాజపా తరఫున బీసీ వర్గానికి చెందిన వారికి పార్టీ టికెట్‌ వస్తుందన్న ఊహాగానాలని తేలిపోయాయి.


బయోడెటా...

వెరబెల్లి రఘునాథ్‌
వయస్సు: 51
స్వస్థలం: మంచిర్యాల
తల్లిదండ్రులు: తిరుపతిరావు, రాజ్యలక్ష్మి
భార్య: స్రవంతి (గృహిణి)
పిల్లలు: అరుణిమ(ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం), అన్విత (ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం)
విద్యాభ్యాసం: ఇంజినీరింగ్‌ దిల్లీ విశ్వవిద్యాలయం, ఎంబీఏ అమెరికాలో పూర్తిచేశారు.

2010లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థను ప్రారంభించారు. సేవాభారతి, యూత్‌ఫర్‌ సేవ, రఘునాథ్‌ వెరబెల్లి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఖరారు కాని చెన్నూరు

చెన్నూరు, చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: భాజపాను వీడి గడ్డం వివేక్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ టికెట్‌ ఆయనకే ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక భాజపా అభ్యర్థిత్వం అధిష్ఠానం ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. గురువారం పార్టీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో చెన్నూరు పేరు లేకపోవడంపై సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసిన భాజపా అధిష్ఠానం చెన్నూరును పెండింగ్‌లో ఉంచింది. వివేక్‌ కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నిరాశకు గురయ్యారు. ఈ తరుణంలో ఆయనను భాజపా అధిష్ఠానం సంప్రదించి పార్టీలోకి రావాలని కోరినట్లు తెలిసింది. అందుకు ఆయన నిరాకరించినట్లు విశ్వసనీయ సమాచారం. భాజపా అధిష్ఠానం మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని